Rahane-Pujara: ఒకప్పటి టీమ్‌ఇండియా ‘మిడిల్‌’.. కొత్త ఏడాదిలోనైనా దక్కేనా ప్లేస్‌!

దక్షిణాఫ్రికాతో (SA vs IND) తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత లైనప్‌ పేకమేడలా కూలిన సమయంలో ‘నయా వాల్‌’ పుజారా.. మన ‘జింక్స్‌’ రహానె ఉంటే పరిస్థితులు విభిన్నంగా ఉండేదేమో.. 

Updated : 31 Dec 2023 12:56 IST

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మ్యాచ్‌లో (SA vs IND) ఇన్నింగ్స్‌ తేడాతో భారత్ ఓటమిపాలైన తర్వాత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఓ మాట అన్నాడు. ‘‘ఇలాంటి సమయంలో రహానె ఉండుంటేనా? పరిస్థితి వేరేగా ఉండేది’’ అవును సన్నీ ఎందుకు అలా అన్నాడనేది రహానె గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. రహానె 2018 పర్యటనలోని జోహెన్నెస్‌బర్గ్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 48 పరుగులు చేశాడు. అవి తక్కువే అయినా.. రహానెనే ఆ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌. 

సఫారీ జట్టుతో టెస్టు సిరీస్‌కు సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె లేకుండా టీమ్‌ఇండియా అక్కడికి వెళ్లింది. తొలి టెస్టులోనే వారిద్దరి విలువేంటో తెలుసొచ్చింది. తొలి బంతి నుంచే పేసర్లు చెలరేగిపోయే సఫారీ గడ్డపై క్రీజ్‌లో కుదురుకోవడం చాలా కీలకం. ఇలాంటి అవకాశాలను ఎన్నోసార్లు ఈ మిడిలార్డర్‌ ద్వయం అందిపుచ్చుకొంది. కానీ, గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని వారిద్దరికి అవకాశం ఇవ్వకుండా ఎక్కువ మంది యువకులతో కూడిన జట్టుతోనే ఈసారి దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతోంది. తాజాగా పుజారా, రహానె సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకేనా అన్నట్లుగా ఉంది. టెస్టుల్లో వీరిద్దరిని కొనసాగించాలనే డిమాండూ క్రికెట్ అభిమానుల నుంచి వెల్లువెత్తుతోంది. యువ క్రికెటర్లను ఇంకాస్త సానబెట్టాలని.. అప్పటి వరకు సీనియర్లను ఆడించాలనేది వారి వాదన. 

‘‘విశ్రాంతి రోజులు లేవు..’’ - రహానె

‘‘రంజీ ట్రోఫీ కోసం సన్నద్ధత..’’ - పుజారా

తొలుత అజింక్య రహానె ట్విటర్ వేదికగా ‘విశ్రాంతి తీసుకొనే రోజులు లేవు’ అంటూ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశాడు. ఆ తర్వాత పుజారా కూడా ‘రంజీ ట్రోఫీ ప్రిపరేషన్‌’ అంటూ మరో పోస్టు పెట్టాడు. దీంతో వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కోసం జట్టులోకి వచ్చేందుకు రహానె, పుజారా రంజీ ట్రోఫీని సద్వినియోగం చేసుకోవాలనే కామెంట్లు అభిమానులు చేశారు. ఇటీవల జాతీయ జట్టులో ఆడకపోయినప్పటికీ.. రహానె దేశవాళీ క్రికెట్‌ మాత్రం చాలా ఆడాడు. పుజారా కూడా కౌంటీల్లోనూ ఆడి వచ్చాడు. వీరిద్దరికీ సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌,  న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై మంచి రికార్డు ఉంది. పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని క్రీజ్‌లో పాతుకుపోవడం వీరిద్దరి స్పెషాలిటీ. పుజారా దక్షిణాఫ్రికాపై 10 టెస్టుల్లో 535 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌పైనా నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు. ఈ దేశాలపై ఐదు సెంచరీలు చేసిన అనుభవం ఉంది. రహానె కూడా సఫారీ జట్టుపై ఆరు మ్యాచుల్లో 402 పరుగులు చేశాడు. 

పుజారా 3.. రహానె 5.. 

ప్రస్తుతం భారత జట్టు కూర్పులో రెండు స్థానాలు అత్యంత కీలకం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌ బరిలోకి దిగుతున్నారు. కానీ, వీరిద్దరిలో కనీసం ఒక్కరైనా క్రీజ్‌లో పాతుకుపోయేలా ఉండాలి. ఆ తర్వాత మూడో స్థానంలో పుజారా, ఐదో స్థానంలో రహానె సరిగ్గా సరిపోతారు. వీరి మధ్య విరాట్ కోహ్లీ ఎలానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విదేశీ పిచ్‌లపై పుజారా, రహానె ఆటతీరు మరింత బాధ్యతాయుతంగా ఉంటుంది. రంజీ ట్రోఫీ కూడా జనవరి 5 నుంచి మొదలుకానుంది. ఇంగ్లాండ్‌తో జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఎంత భారత వేదిక అయినప్పటికీ.. ఇంగ్లాండ్‌ పేస్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమే. ఒకవేళ వీరిద్దరూ రంజీల్లో నాణ్యమైన ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు.

- ఇంటర్నెట్ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని