SA vs IND: కెప్టెన్‌ మారాడు.. కొత్త ఆటగాళ్లు వచ్చారు.. మరి ఫలితం?

South Afirca vs India Test Series Preview: దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది.

Updated : 25 Dec 2023 18:25 IST

దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈ సారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ ఆ దేశంలో ఎనిమిది సార్లు టెస్టు సిరీస్‌ ఆడిన మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. చివరగా 2021-22 సిరీస్‌లో దక్షిణాఫ్రికాలో భారత్‌ ఆడింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. కెప్టెన్‌ మారాడు. సీనియర్లు దూరమయ్యారు. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో సఫారీ సవాలుకు భారత్‌ సై అంటోంది.

కెప్టెన్‌గా చివరిది..

2021-22లో దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌ అనగానే కోహ్లి (Virat Kohli) కెప్టెన్‌ నుంచి తప్పుకోవడం కచ్చితంగా గుర్తుకొస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ టీ20లతో పాటు వన్డేల్లోనూ ఒకరే కెప్టెన్‌ ఉండాలనుకున్న బీసీసీఐ ఆ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది. దీనిపై కోహ్లి వర్సెస్‌ బీసీసీఐ సిట్యుయేషన్‌ మారింది. వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నిరుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్‌బై చెప్పి షాకిచ్చాడు. భారత జట్టు కెప్టెన్‌గా పూర్తిగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ కెప్టెన్సీ కెరీర్‌ ఆరంభమైంది. ఇప్పుడు మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం అక్కడికి వెళ్లిన కోహ్లి.. ఇప్పుడు కేవలం ఆటగాడిగానే ఆడబోతున్నాడు. 

ఆ సీనియర్లు లేకుండా..

2021-22 టెస్టు సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా(Cheteshwar Pujara) , అజింక్య రహానె (Ajinkya Rahane) ఇద్దరూ లేకుండా భారత టెస్టు జట్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఈ ఇద్దరు టెస్టు స్పెషలిస్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకుండా భారత్‌ విదేశాల్లో టెస్టు ఆడబోతుండటం గత దశాబ్ద కాలంగా ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు లేకుండా భారత్‌ దక్షిణాఫ్రికాలో సిరీస్‌ ఆడబోతుండటం కూడా 2006 తర్వాత ఇదే తొలిసారి. టెస్టు అరంగేట్రం తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌కు పుజారా, రహానె దూరమవడం ఇదే మొదటిసారి. 2022లో సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. కానీ తిరిగి పుంజుకుని వీళ్లు జట్టులోకి వచ్చారు. అయితే ఇప్పుడేమో దక్షిణాఫ్రికా సిరీస్‌కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. చివరగా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఆడినప్పుడు 3 మ్యాచ్‌ల్లో రహానె 22.66 సగటుతో 136, పుజారా 20.66 సగటుతో 124 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఇప్పుడు మంగళవారం ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో ఈ ఇద్దరి కెరీర్‌ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

వీళ్లూ దూరం..

దక్షిణాఫ్రికాలో గత భారత జట్టు టెస్టు సిరీస్‌తో పోలిస్తే ఈ సారి జట్టులో చాలా కొత్త ముఖాలున్నాయి. అప్పుడు జట్టులో ఉన్న రహానె, పుజారా, మయాంక్‌ అగర్వాల్, సాహా, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్, పంత్, షమి, ప్రియాంక్‌ పాంచల్, హనుమ విహారి, జయంత్‌ యాదవ్‌ ఇప్పుడు లేరు. గాయాల కారణంగా ఆ సిరీస్‌కు దూరమైన రోహిత్‌ శర్మ, జడేజా, శుభ్‌మన్‌ గిల్‌ ఇప్పుడు జట్టులోకి వచ్చారు. అప్పుడు తొలి టెస్టు తుది జట్టులో ఉన్న వాళ్లలో కేఎల్‌ రాహుల్, కోహ్లి, అశ్విన్, శార్దూల్, బుమ్రా, సిరాజ్‌ మాత్రమే ఇప్పుడూ జట్టుతోనూ ఉన్నారు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్, కేఎస్‌ భరత్, ముకేశ్‌ కుమార్, ప్రసిద్ధ్‌ కృష్ణ కొత్తగా జట్టుతో చేరారు. అప్పుడు తొలి మ్యాచ్‌ గెలిచి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తడబడి ఓటమి పాలైంది. మరి ఈ సారి దాదాపు పూర్తిగా మారిన జట్టుతో, కొత్త ఉత్సాహంతో రెండు టెస్టుల సిరీస్‌లో అడుగుపెడుతున్న భారత్‌ సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టించాలన్నది అభిమానుల ఆకాంక్ష.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని