Ajinkya Rahane : టెస్టు ప్లేయర్‌ అన్నారు.. అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో చెలరేగుతున్నాడు..

రహానే(Ajinkya Rahane) ఈ సీజన్‌లో అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అత్యధిక స్ట్రైక్‌ రేట్‌తో ఆడుతూ జట్టు భారీ స్కోర్లలో భాగమవుతున్నాడు.

Published : 24 Apr 2023 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఈ సీజన్‌కుముందు అతడిపై ఎలాంటి అంచనాలు లేవు. కేవలం బేస్‌ ప్రైస్‌కే చెన్నై(Chennai Super Kings) దక్కించుకుంది. తుది జట్టులో అవకాశం కల్పించడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడే వెటరన్‌ క్రికెటర్‌ అజింక్య రహానె(Ajinkya Rahane).

భారీ హిట్టర్లను వెనక్కి నెట్టి..

అజింక్య రహానెపై ఎక్కువగా టెస్టు ప్లేయర్‌ అని ముద్ర ఉండేది. ఇప్పుడా శైలికి భిన్నంగా.. ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్‌ చేస్తూ చెన్నై జట్టుతోపాటు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో అతడి దూకుడు ఎంతలా ఉందంటే.. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ అత్యధిక స్ట్రైక్‌ రేట్‌ (వంద కంటే ఎక్కువ పరుగులు) అతడి పేరిటే ఉంది. భారీ హిట్టర్లను వెనక్కి నెట్టి 199.04 స్టైక్‌ రేట్‌తో రహానె ఈ జాబితాలో ముందున్నాడు. అతడి తర్వాత మాక్స్‌వెల్‌ (188 స్ట్రైక్‌ రేట్‌), పూరన్‌ (185 స్ట్రైక్‌ రేట్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (168 స్ట్రైక్‌ రేట్‌) ఉన్నారు.

అన్ని రకాల షాట్లు ఆడుతూ..

గత సీజన్లలో చూసిన రహానే స్ట్రైక్‌రేట్‌ ఏమంత గొప్పగా లేదు. 2008 నుంచి 2022 వరకూ అతడి బ్యాటింగ్‌ గణాంకాలను చూస్తే 120.67 స్ట్రైక్‌ రేట్‌తో మొత్తం 4 వేలకుపైగా పరుగులు చేశాడు. యావరేజ్‌ 30.86కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అతడి యావరేజ్‌ 52.25. ఇక  సిక్స్‌లను అలవోకగా దంచి కొడుతున్నాడు. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి 9 బంతులకో సిక్స్‌ బాదుతున్నాడు. అన్ని రకాల షాట్లు ఆడుతూ అలరిస్తున్నాడు. కోల్‌కతాపై అతడు ఆడిన రివర్స్‌ స్కూప్‌ షాట్‌పై పలువురు మాజీలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆదివారం కోల్‌కతా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసమే సృష్టించాడు రహానే . 29 బంతుల్లో 71 పరుగులు కొట్టి.. జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కూడా 27 బంతుల్లో 61 పరుగులతో చెలరేగాడు. ఇలా ఇప్పటి వరకూ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 209 పరుగులు చేశాడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 153 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానె.. రెండుసార్లు మాత్రమే 200 స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాలూ ఈ సీజన్లోనే కావడం విశేషం.

రూ.50 లక్షల బేస్‌ప్రైస్‌కే చెన్నైకి దక్కిన రహానె.. తన అద్భుత ఆటతీరుతో జట్టుకు న్యాయం చేస్తుండగా.. మిగతా జట్లు కొన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో పోల్చుతూ రహానేను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు