Musheer Khan: ముషీర్‌ ఖాన్‌ టైమింగ్‌ బాగుంది.. సర్ఫరాజ్‌ను అధిగమిస్తాడు: భారత మాజీ క్రికెటర్

అండర్-19 ప్రపంచ కప్‌లో (U19 World Cup 2024) ముషీర్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ఫైనల్‌ మినహా.. మిగతా మ్యాచుల్లో నాణ్యమైన క్రికెట్ ఆడాడు. భారత్‌కు ఇటీవలే ఎంపికైన సర్ఫరాజ్‌ సోదరుడే ఈ ముషీర్ ఖాన్.

Published : 12 Feb 2024 19:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అండర్-19 వరల్డ్ కప్‌ (U19 World Cup 2024) ఫైనల్‌లో భారత్‌ ఓడినప్పటికీ.. టోర్నీ ఆసాంతం యువ క్రికెటర్లు అదరగొట్టారు. ముషీర్‌ ఖాన్‌ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాయంతో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 360 పరుగులు చేశాడు. ఒక అండర్‌-19 ప్రపంచ కప్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్‌ ఈ రికార్డు సృష్టించాడు. ముషీర్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ నైపుణ్యంతో పాటు భారత పేస్‌ ఎటాక్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ముషీర్ బ్యాటింగ్‌ శైలిని చాలా ఇష్టపడతా. కెరీర్‌ ముగిసేసరికి.. అన్న సర్ఫరాజ్‌ కంటే ముషీర్‌ ఖాన్ చాలా ఎత్తులో ఉంటాడు. ముషీర్‌లో ఉన్న మరో ప్రత్యేకత అతడి టైమింగ్‌. కాళ్లను వినియోగించుకుని స్పిన్‌ను ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. అసాధారణమైన షాట్లను ఆడేస్తున్నాడు. అయితే, బ్యాక్‌ఫుట్‌ గేమ్‌పైనా కసరత్తు చేస్తే తిరుగుండదు. అందులోనే కాస్త బలహీనంగా కనిపిస్తున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇలానే ఔటయ్యాడు. సెమీస్‌లోనూ పెవిలియన్‌కు చేరే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. షార్ట్‌ బంతులను ఎదుర్కోవడంపై శ్రమించాలి’’ అని చోప్రా తెలిపాడు. 

స్పిన్‌ ఓకే.. పేస్ బలహీనం

‘‘ఆస్ట్రేలియాతో ఫైనల్‌ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. సౌమీ పాండే అద్భుత బౌలింగ్‌తో రాణించాడు. టోర్నీలో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతడే. పూర్తి నియంత్రణతో బంతులు విసిరాడు. కానీ, ఫాస్ట్‌ బౌలింగ్‌కు వచ్చేసరికి గొప్పగా లేదు. రాజ్‌ లింబాని బాగానే ఉంది. కానీ, మొత్తం పేస్‌ దళం వీక్‌గా అనిపించింది. స్పిన్‌పై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ.. బెనోని పిచ్‌పై  ఫాస్ట్‌ బౌలింగ్‌ కీలకం. మనం సరైనంత పేస్‌తో ప్రత్యర్థిపై దాడి చేయలేదు’’ అని ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు