Wimbledon: వింబుల్డన్‌ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?

క్రికెట్‌లో ఎన్ని టోర్నీలున్నా వన్డే ప్రపంచకప్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. అలాగే టెన్నిస్‌లోనూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లున్నా వింబుల్డన్‌కు ఉండే ప్రాధాన్యత వేరు...

Published : 28 Jun 2022 02:04 IST

నేటి నుంచే చారిత్రక టోర్నీ ప్రారంభం..

క్రికెట్‌లో ఎన్ని టోర్నీలున్నా వన్డే ప్రపంచకప్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. అలాగే టెన్నిస్‌లోనూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లున్నా వింబుల్డన్‌కు ఉండే ప్రాధాన్యత వేరు. ప్రతి క్రికెటర్‌ ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలవాలని ఎలా కలగంటాడో.. టెన్నిస్‌లోనూ రాకెట్‌ పట్టిన ప్రతి ప్లేయర్‌ వింబుల్డన్‌లో గెలవాలని ఆశపడతారు. అయితే, క్రికెట్‌లో మెగా టోర్నీ నాలుగేళ్లకోసారి నిర్వహిస్తే.. ఈ టెన్నిస్‌ టోర్నీని ఏటా నిర్వహిస్తారు. అంతగొప్ప పేరున్న వింబుల్డన్‌ 2022 సీజన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ టోర్నీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

  1. వింబుల్డన్‌ టోర్నీని 1877లో తొలిసారి నిర్వహించారు. వింబుల్డన్‌లోని వార్పుల్‌ రోడ్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ క్రొకెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 22 మంది పాల్గొన్న ఈ టోర్నీలో స్పెన్సర్‌ విలియమ్‌ గొరే అనే క్రీడాకారుడు ఛాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో జోర్జ్‌ మార్షల్‌ అనే ప్రత్యర్థిని ఓడించి తొలి విజేతగా చరిత్ర సృష్టించాడు. అయితే, స్పెన్సర్‌ కేవలం టెన్నిస్‌ మాత్రమే కాకుండా క్రికెట్‌, ఫుట్‌బాల్ గేమ్స్‌లోనూ రాణించాడు.
  2. వింబుల్డన్‌ టోర్నీ తొలి ఏడు సంవత్సరాలు కేవలం పురుషులకు మాత్రమే నిర్వహించగా.. తర్వాతి రోజుల్లో ఆటకు విశేషమైన ఆదరణ లభించింది. దీంతో 1884లో తొలిసారి మహిళల సింగిల్స్‌ను ఏర్పాటు చేయగా మొత్తం 13 మంది పాల్గొన్నారు. అందులో మౌద్‌ వాట్సన్‌ అనే క్రీడాకారిణి ఈ విభాగంలో తొలి ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఇంగ్లాండ్ తరఫున ఉమెన్స్‌ సింగిల్స్‌ గెలిచిన చివరి విజేత వర్జీనియా వేడ్‌. ఆమె 1977లో వింబుల్డన్‌ ట్రోఫీని ముద్దాడింది.
  3. ఇక ప్రస్తుతం వింబుల్డన్‌ టోర్నీని నిర్వహిస్తున్న ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌ సెంట్రల్‌ కోర్టును 1922లో కింగ్‌ జార్జ్‌, క్వీన్‌ మేరీ ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ గేమ్‌కు మరింత ఆదరణ లభించడంతో వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు చూసేందుకు జనం ఎగబడేవారు. దాంతో టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉండేది. వారిని నిలువరించడానికి 1922లో తొలిసారి బ్యాలెట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
  4. వింబుల్డన్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ను 1937లో తొలిసారి బీబీసీ బ్రాడ్‌కాస్ట్‌ యూనిట్‌ టీవీలో ప్రసారం చేసింది. అప్పట్లో కేవలం నార్త్‌ లండన్‌లోని బీబీసీ ట్రాన్స్‌మీటర్స్‌కు 40 మైళ్ల దూరంలో ఉండేవారే వీక్షించేవారు. తర్వాత ఆదరణ పెరగడంతో 1967లో దాన్ని రంగుల తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడంటే వివిధ ప్రసార మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌ అప్‌డేట్స్‌ వస్తున్నాయి కానీ, అప్పట్లో కేవలం బీబీసీ ద్వారే ఆ టోర్నీ విశేషాలు తెలిసేవి. అందుకోసం ప్రత్యేకమైన టీవీ స్టూడియోలు, కెమెరా స్టేషన్లు, రేడియో స్టేషన్లు ఏర్పాటు చేశారు.
  5. టెన్నిస్‌లో మొత్తంగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలుంటే కేవలం వింబుల్డన్‌లో మాత్రమే గ్రాస్‌ కోర్టును ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్‌ ఓపెన్‌ టోర్నీల్లో హార్డ్‌ కోర్టుల్లో మ్యాచ్‌లు కొనసాగిస్తే.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్లే కోర్టును వాడతారు. వింబుల్డన్‌ టోర్నీని గ్రాస్‌ కోర్టులో నిర్వహిస్తారు. ఈ కోర్టులను 28 మంది తో కూడిన ప్రత్యేకమైన బృందం పర్యవేక్షిస్తుంది. వాటి కోసం ఏటా 9 టన్నుల పెరేనియల్‌ రై అనే ప్రత్యేకమైన పచ్చగడ్డి విత్తనాలను వినియోగిస్తారు. మ్యాచ్‌లు జరిగేటప్పుడు ఆ గడ్డిని 8 మిల్లీమీటర్ల మందమే ఉంచుతారు.
  6. ఈ టోర్నీలో ఆడేవాళ్లంతా తెలుపు రంగు దుస్తులే ధరించాలి. 1963లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. 1995లో పూర్తిగా తెల్ల రంగే వాడాలనే నిబంధనను తీసుకొచ్చారు. అలాగే 2014 నుంచి ఆటగాళ్లు వాడే పరికరాలు, బూట్లు, టోపీలు, సాక్సులు ఇలా ప్రతీది తెల్ల రంగులోనే ఉండాలి. అలాగే క్రీడాకారులు ఆయా మ్యాచ్‌ల్లో పాల్గొనే ముందు ఈ కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది రిఫరీలు చూసి అనుమతిస్తారు.
  7. ఏటా ఈ టోర్నీ జరిగే సమయంలో మొత్తం 23 టన్నుల స్ట్రాబెర్రీలు అమ్ముడుపోతాయి. వీటిని ప్రత్యేకంగా కెంట్‌ అనే ప్రాంతంలో పండిస్తారు. టోర్నీ జరిగే రోజుల్లో వీటిని రోజూ ఉదయం 5:30 గంటలకే ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌కు తీసుకొస్తారు. వాటిని మళ్లీ పూర్తిగా పరిశీలించాకే ప్రేక్షకులకు అమ్మడానికి సిద్ధంగా ఉంచుతారు. అలాగే ఆయా రోజుల్లో ప్రేక్షకులు టీ, కాఫీ, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జా, బర్గర్‌లు కూడా అధికమొత్తంలో కొనుగోలు చేస్తారు. దీంతో ఇక్కడ ఆహార పధార్థాలకు కూడా భారీ డిమాండ్‌ ఉంటుంది.
  8. ఇక ప్రస్తుత సీజన్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో రోజర్‌ ఫెదరర్‌, నోవాక్‌ జకోవిచ్‌.. విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలో ఫెదరర్‌ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలవగా జకోవిచ్‌ 6 టైటిళ్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, జకోవిచ్‌ గత మూడు సీజన్లలో 2018, 2019, 2021 హ్యాట్రిక్‌ విజయాలు సాధించి టాప్‌ ఫెవరెట్‌గా ఉన్నాడు. 2020లో కరోనా కారణంగా టోర్నీ రద్దయింది.
  9. మహిళల విభాగంలో మార్టినా నవ్రతిలోవా 9 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్టెఫీ గ్రాఫ్‌, సెరీనా విలియమ్స్‌ 7 విజయాలతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో ఈ సీజన్‌లో సెరీనా విజయం సాధిస్తే స్టెఫీని వెనక్కి నెట్టే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని