America Cricket: ప్రపంచకప్‌తో రాత మారుతుంది

ఆటల్లో అమెరికా అనగానే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌ లాంటి క్రీడలే గుర్తుకు వస్తాయి. కానీ దేశాన్ని ఇప్పుడు క్రికెట్‌ జ్వరం పట్టుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌పై అమెరికా క్రికెట్‌ జట్టు చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందుకుంది.

Updated : 29 May 2024 07:46 IST

బీసీసీఐ మద్దతిస్తే మరింత ముందుకు
‘ఈనాడు’తో అమెరికా క్రికెట్‌ ఛైర్మన్‌ వేణు

ఆటల్లో అమెరికా అనగానే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌ లాంటి క్రీడలే గుర్తుకు వస్తాయి. కానీ దేశాన్ని ఇప్పుడు క్రికెట్‌ జ్వరం పట్టుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌పై అమెరికా క్రికెట్‌ జట్టు చారిత్రక సిరీస్‌ విజయాన్ని అందుకుంది. ఇక టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్‌తో కలిసి ఆ దేశం ఆతిథ్యమివ్వబోతోంది. ప్రస్తుతం తెలుగువాడైన పీసీకే వేణునే అమెరికా క్రికెట్‌ ఛైర్మన్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అక్కడి క్రికెట్, ప్రపంచకప్‌ ఏర్పాట్ల గురించి వేణును ‘ఈనాడు’ పలకరించింది. నల్గొండ నుంచి వెళ్లి జార్జియాలో స్థిరపడ్డ వేణుతో ఇంటర్వ్యూ విశేషాలు..

ఈనాడు - హైదరాబాద్‌

బంగ్లాదేశ్‌పై అమెరికా సిరీస్‌ విజయం సాధించడంపై ఏమంటారు?

ఈ విజయం అసలు ఊహించలేదు. మాకు మంచి జట్టు ఉందని, ఆటగాళ్లు కష్టపడుతున్నారని తెలుసు. జట్టు కూర్పు కూడా ఉత్తమంగా ఉంది. ఇటీవల కెనడాతో సిరీస్‌ను 4-0తో స్వీప్‌ చేశాం. కానీ బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయం మరింత సంతృప్తినిస్తోంది. ఈ విజయంతో ఐసీసీ అసోసియేట్‌ సభ్యదేశంగా ఉన్న మాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తాం.

టీ20 ప్రపంచకప్‌ దిశగా ఈ సిరీస్‌ విజయం ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుందంటారు? 

బంగ్లాపై సిరీస్‌ విజయం కచ్చితంగా అమెరికా జట్టుపై ప్రభావాన్ని చూపుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇది ఎంతో ముఖ్యమైన విజయం. అమెరికాలో క్రికెట్‌కు సవాళ్లున్నాయి. జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తేనే ప్రజలు ప్రోత్సహిస్తారు. తమ చిన్నారులను క్రికెట్‌ వైపు నడిపిస్తారు. భారత్‌లో అయితే క్రికెట్‌ ఆడాలని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాలో మాత్రం చెప్పాలి.

అమెరికా క్రికెట్‌ జట్టులో ఎక్కువగా భారత సంతతి ఆటగాళ్లు ఉండటానికి కారణమేంటి? జట్టు ఎంపిక   ఎలా జరుగుతుంది?

అమెరికాలో క్రికెట్‌ ఆడేవాళ్లలో భారత సంతతికి చెందినవాళ్లే ఎక్కువ. మనవాళ్లకు క్రికెట్‌ అంతే ఎంతో ఇష్టం. అందుకే ఇక్కడ మెజారిటీ వాళ్లే ఉన్నారు. వాళ్ల నైపుణ్యాలు ఉత్తమంగా ఉన్నాయి. సొంత ఆసక్తితో, డబ్బులు పెట్టుకుని మరీ ఆడుతున్నారు. జట్టు ఎంపిక ఎవరికైనా ఒకే తీరుగా ఉంటుంది. మెరుగైన ప్రతిభ ఉండి, ఆటలో రాణించిన వాళ్లు జట్టులోకి వస్తారు.

టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలు ఎలా ఉన్నాయి? 

అమెరికా మొదటిసారి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఏర్పాట్లు గొప్పగా సాగుతున్నాయి. జట్లు ఒక్కక్కటిగా వస్తున్నాయి. దేశంలో ఈ స్థాయి టోర్నీ జరగబోతుండటం ఇదే తొలిసారి. అందుకే టోర్నీ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఐసీసీ ప్రమేయం నేరుగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదు. స్టేడియాల నిర్మాణాలు, మ్యాచ్‌ల నిర్వహణ ఏర్పాట్లను ఐసీసీ దగ్గరుండి చూసుకుంటోంది.

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందడి ఎలా ఉంది? 

ప్రపంచంలోనే ఎక్కడైనా సరే భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే సందడే వేరు. నేనది ప్రత్యక్షంగా చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలో భారత్, పాకిస్థాన్‌ ప్రజలు మిలియన్లలో ఉన్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరును ఆస్వాదించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌పై ఇంత ఆసక్తి ఉంటుందని ఊహించలేదు. క్రికెట్‌ చూడని వాళ్లు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడిదే ఇక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రపంచకప్‌ కోసం డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు వాడుతున్నారు కదా. సాధారణ పిచ్‌లకు, వీటికి తేడా ఏంటి? 

డ్రాప్‌ ఇన్‌కు, సాధారణ పిచ్‌లకు పెద్ద తేడా ఉండదు. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు వేరే చోట తయారు చేసి, తీసుకొచ్చి మైదానంలో అమర్చుతారు. మైదానంలో చూస్తే ఇవి సాధారణ పిచ్‌ల మాదిరే ఉంటాయి. న్యూయార్క్‌లోని స్టేడియం కోసం ఫ్లోరిడాలో పిచ్‌ను తయారు చేయించాం. వీటిని నిపుణులు రూపొందిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. భారత్‌లో ఈ తరహా పిచ్‌లు కొత్త కాబట్టి చర్చ సాగుతోంది. ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో ఇదంతా మామూలే.

టీ20 ప్రపంచకప్‌ నిర్వహణతో అమెరికా క్రికెట్‌కు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు? 

క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు, కొత్త అభిమానులను ఆకర్షించేందుకు అమెరికాలో ప్రపంచకప్‌ నిర్వహణకు ఐసీసీ ముందుకొచ్చింది. దీంతో ఈ దేశంలో క్రికెట్‌ రాత మారబోతోంది. ఆతిథ్య జట్టు హోదాలో తొలిసారి ప్రపంచకప్‌ ఆడబోతున్నాం. దీంతో దేశంలో క్రికెట్‌ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం ఉంది. అలాగే ఆటగాళ్లకూ అవకాశాలు, గుర్తింపు దక్కుతుంది. మా క్రికెట్‌ జట్టు భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది. అమెరికా అనేది పెద్ద మార్కెట్‌. ఇందులో నుంచి క్రికెట్లోకి కొంచెం మళ్లించినా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అభిమాన బలం కూడా పెరుగుతుంది.

అమెరికా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బేస్‌బాల్‌కు యుఎస్‌ఏలో విపరీతమైన ఆదరణ ఉంది. ఆ స్థాయికి క్రికెట్‌ చేరుకుంటుందని అనుకుంటున్నారా?

ఇప్పుడే అక్కడివరకూ ఆలోచించడం లేదు. ఆ స్థాయి ఆదరణ దక్కాలంటే ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నో ఏళ్లు కష్టపడాలి. భవిష్యత్‌లో కచ్చితంగా ఆ స్థాయి వరకూ వెళ్తామనే నమ్మకం ఉంది. నిలకడగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలి. వచ్చే మూణ్నాలుగేళ్లలో జాతీయ జట్టు మరింత వృద్ధి చెందాలి. అమెరికాలోనే జరిగే 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కూ ప్రవేశం దక్కడం మాకు మరింత మేలు చేసేదే. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడితే జట్టుకు మరింత గుర్తింపు దక్కుతుంది.

నల్గొండ నుంచి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడి వరకు మీ ప్రయాణం గురించి చెప్పండి? 

నేను 1998లో అమెరికా వచ్చా. చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టమే. ఆడటమే కాకుండా టోర్నీలు నిర్వహించేవాణ్ని. అమెరికాలో కేవలం వారాంతాల్లో మాత్రమే ఆడేవాళ్లు. అలాంటి వాళ్లకోసం 2007లో అట్లాంటా క్రికెట్‌ లీగ్‌ ప్రారంభించా. ఇందులో ప్రతి ఏడాది 130కి పైగా జట్లు పోటీపడుతున్నాయి. అట్లాంటా క్రికెట్‌ అకాడమీని కూడా ఆరంభించా. 2011లో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించా. 2018లో అమెరికా క్రికెట్‌ సంఘం ఏర్పడ్డప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదని అనుకున్నా. ఎన్నికల్లో మూడు సార్లు గెలిచా. ఇప్పుడు మూడో విడత ఛైర్మన్‌గా పనిచేస్తున్నా. ఈ పాతికేళ్లలో ఎన్నో మార్పులు చూశా. ఎన్నో అవకాశాలు పొందా. 17 ఏళ్లుగా క్రికెట్లోనే ఉన్నా. సవాళ్లను దాటి సాగుతున్నా. 

అమెరికా క్రికెట్‌ అభివృద్ధిలో బీసీసీఐ సాయం ఏమైనా ఉందా? 

ప్రస్తుతానికైతే ఎలాంటి సాయం లేదు. భవిష్యత్‌లో తప్పకుండా బీసీసీఐ అండగా నిలుస్తుందని ఆశిస్తున్నా. ప్రపంచంలోని శక్తిమంతమైన బోర్డు బీసీసీఐ. దీని మద్దతు ఉంటే మేం ఇంకాస్త వేగంగా పురోగతి సాధించగలం. ప్రపంచకప్‌ తర్వాత దీని గురించి చర్చిస్తాం.

ఇప్పుడు మీ ముందున్న లక్ష్యాలేంటి?

ముందుగా టీ20 ప్రపంచకప్‌ ఘనంగా జరిగేలా శక్తివంచన లేకుండా పనిచేయాలి. అమెరికా ప్రజలకు కొత్త అనుభూతిని అందించాలి. ఇక క్రికెట్‌ జట్టు పరంగా 2030లోపు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశంగా ఎదగాలి. రాబోయే ఒలింపిక్స్‌లోనూ ఆకట్టుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని