Anahat Singh: 15 ఏళ్లకే స్క్వాష్‌ సీనియర్‌ టైటిల్‌.. ఎవరీ అనహత్‌?

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుని చూసి రాకెట్‌ పట్టిన ఆ అమ్మాయి.. 15 ఏళ్లకే స్వ్కాష్‌లో జాతీయ సీనియర్‌ టైటిల్‌ గెలిచి ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచిన ఈ యువ సంచలనం విశేషాలు ఇవి. 

Published : 24 Nov 2023 15:23 IST

ఆ అమ్మాయిని చూస్తే స్కూల్‌ కెళ్లే పాప.. మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వచ్చిందా అన్నట్లు ఉంటుంది. ఆ బక్క పలచని అమ్మాయి గాలికి పడిపోతుందా అని కూడా అనిపిస్తుంది. కానీ, బరిలో దిగితే కానీ తెలియదు ఆ టీనేజర్‌ సత్తా ఏంటో! వయసు 15 ఏళ్లే అయినా సీనియర్లతో పోటీపడుతూ అంతర్జాతీయ టైటిళ్లు గెలుస్తూ ఔరా అనిపిస్తుంది ఈ బాలిక. ఆమే అనహత్‌ సింగ్‌ (Anahat Singh). భారత స్క్వాష్‌ (Squash) నయా సంచలనం. తాజాగా జాతీయ సీనియర్‌ విభాగంలో టైటిల్‌ గెలిచి ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.  

సింధుని చూసి..

దిల్లీకి చెందిన అనహత్‌ తొలుత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కావాలని అనుకుంది. 2008లో పి.వి.సింధుని చూసి స్ఫూర్తి పొంది రాకెట్‌ పట్టింది. ఇంట్లో అమ్మానాన్న గుర్‌శరణ్‌సింగ్, తన్వి కూడా క్రీడాకారులే కావడం ఆమెకు కలిసొచ్చింది. అక్క అమైరా స్క్వాష్‌ వైపు వెళ్లడం చూసి ఎనిమిదేళ్ల వయసులో అనహత్‌కు కూడా ఈ ఆటపై ఇష్టం ఏర్పడింది. అక్కతో కలిసి తానూ టోర్నీలకి వెళ్లడం మొదలుపెట్టింది. జాతీయ కోచ్‌ అంజాద్‌ఖాన్‌ శిక్షణలో వేగంగా ఈ ఆటలో రాటుదేలింది అనహత్‌. అతి తక్కువ సమయంలోనే అండర్‌-11లో భారత్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి అయింది. ఆ తర్వాత అండర్‌-13లో అడుగుపెట్టింది. రిత్విక్‌ భట్టాచార్య శిక్షణ ఆమెకు మరింత కలిసొచ్చింది. 2020లో బ్రిటీష్‌, మలేసియా ఓపెన్‌ టోర్నీల్లో రజతం సాధించి సత్తా చాటింది. ఆ తర్వాత కొవిడ్‌-19 కారణంగా ఆమె కెరీర్‌కు చిన్న విరామం వచ్చింది. 

ఆసియా క్రీడల్లో అదరగొట్టి

గతేడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన అనహత్‌.. చెన్నైలో జరిగిన సీనియర్‌ శిబిరానికి ఎంపికైంది. దీపిక పల్లికల్, జోష్న చిన్నప్ప లాంటి వెటరన్ల మధ్య ఈ అమ్మాయి చిన్న పిల్లలా కనబడేది. కానీ, పోటీల్లోకి దిగాక తెలిసింది అనహత్‌ ప్రతిభ. సీనియర్లు కూడా ఈ అమ్మాయి ముందు నిలువలేకపోయారు. చిరుత వేగం, అంతకుమించిన నైపుణ్యం, సరళతతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది అనహత్‌. ఎంత సీనియర్‌ ఎదురైనా ఏమాత్రం తొణక్కుండా స్థిరంగా ఆడడం ఆమె మరో ప్రత్యేకత. ఈ లక్షణాలు సీనియర్‌ విభాగంలో ఆమె త్వరగా దూసుకెళ్లేలా చేశాయి. ఈ ఏడాది ఆగస్టులో అండర్‌-17 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో అనహత్‌ విజేతగా నిలిచింది. ఈ జోరుతోనే హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో అనహత్‌ రెండు కాంస్యాలతో అదరగొట్టింది. మహిళల టీమ్‌లో కాంస్య పతకం గెలిచిన ఈ టీనేజర్‌.. ఆ తర్వాత మిక్స్‌డ్‌ విభాగంలో అభయ్‌ సింగ్‌ తోడు కంచు మోగించింది. 2026 లాస్‌ఏంజెల్‌ ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను ఒక ఆటగా చేర్చడంతో కచ్చితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. తాజాగా జాతీయ సీనియర్‌ విభాగంలో టైటిల్‌ గెలుచుకుని.. జోష్న చిన్నప్ప (2000) తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా నిలిచిన 15 ఏళ్ల అనహత్‌.. మున్ముందు ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని