Ind vs Eng: కోహ్లీ, పుజారాకు వారితోనే ముప్పు.. అప్పుడేమైంది? ఇప్పుడేం చేయాలి?

india tour of england: ఇంగ్లాండ్‌పై నెగ్గాలంటే ఈ పేస్‌ ద్వయాన్ని అడ్డుకోవాల్సిందే

Published : 23 Jun 2022 12:49 IST

ఇంగ్లాండ్‌పై నెగ్గాలంటే ఈ పేస్‌ ద్వయాన్ని అడ్డుకోవాల్సిందే

స్వదేశంలో టెస్టు సిరీస్‌ జరిగితే భారత్‌ జట్టు (Team India) అలవోకగా నెగ్గుతుంది. స్పిన్నర్లు విజృంభిస్తారు. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తారు. ప్రత్యర్థి జట్టులో ఎటువంటి పేసర్లు ఉన్నా భారత పిచ్‌లపై తేలిపోతుంటారు. అయితే విదేశీ పిచ్‌లపై సీన్‌ రివర్స్‌. కీలక మ్యాచ్‌ల్లో మన బ్యాట్స్‌మన్‌ చెతులెత్తేయడం చూస్తూంటాం. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కోల్పోవడానికి కారణం కూడా అదే. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ చేయడం మనవాళ్లకి ఎప్పడూ సవాలే. అయితే 2021 ఇంగ్లాండ్‌ పర్యటనలో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లలలో ఎవరో ఒకరు రాణించడం, టెయిలెండర్ల మెరుపులు కనిపించాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది. కొవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జులై 1 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణిస్తేనే సిరీస్‌ దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండేళ్లకు పైగా సెంచరీ చేయని కోహ్లీ, పూజారా.. ఇంగ్లాండ్‌ పేస్‌ ద్వయం అండర్సన్‌, బ్రాడ్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అయితే, పుజారా ఇటీవల కౌంటీ క్రికెట్‌లో ససెక్స్‌ టీమ్‌ తరఫున 5 మ్యాచ్‌ల్లో 720 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అందులో రెండు శతకాలు, రెండు డబుల్‌ సెంచరీలు చేయడం విశేషం.

అండర్సన్‌ బౌలింగ్‌లో పదును తగ్గలే...

ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చినప్పుడల్లా భారత బ్యాటర్లకు ఆఫ్‌ సైడ్‌ ఆవల స్వింగ్‌ బంతులు వేసి బుట్టలో వేయడం అండర్సన్‌కు అలవాటే. 2014లో కోహ్లీని ఆ బంతులతోనే బోల్తా కొట్టించాడు. అయితే 2018 సిరీస్‌లో ఆ బలహీనతపై దృష్టి పెట్టి కోహ్లీ విజయవంతం అయ్యాడు. ఆ సిరీస్‌లో పరుగుల వరద పారించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు. తరవాత మళ్లీ పాత కథే. గతేడాది జరిగిన ఇదే (2021) టెస్టు సిరీస్‌లో మొదటి, మూడో టెస్టుల్లో అండర్సన్‌ స్వింగ్‌ బంతులను ఆడలేక కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పూజారాది కూడా ఇదే సమస్య. ఈ సిరీస్‌లోనే అండర్సన్‌ బౌలింగ్‌లో మొదటి, మూడు, నాలుగు టెస్టుల్లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పూజారా పెవిలియన్‌ చేరాడు.

విరాట్‌ను టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ఔట్‌(7) చేసిన పేసర్‌ కూడా అండర్సనే. దీంతో పాటు టెస్టుల్లో జిమ్మీ అత్యధిక సార్లు ఔట్‌ చేసిన బ్యాటర్‌ పూజారనే (11). ఈ రికార్డులు చాలు కోహ్లీ,  పూజారాలపై అతడి ఆధిపత్యం ఎలా ఉందో చెప్పడానికి. 39 ఏళ్ల వయసులోనూ ఈ స్వింగ్‌ కింగ్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. 2022లో 3 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే టెస్టుల్లో అత్యధిక వికెట్లు (651) తీసిన పేసర్‌గా ఈ ఇంగ్లిష్‌ దిగ్గజం కొనసాగుతున్నాడు. కోహ్లీ, పూజారాతో పాటు భారత బ్యాటర్లు ఇతడి వలలో చిక్కే ప్రమాదం ఉంది.

బ్రాడ్‌తోనూ ప్రమాదమే..

టెస్ట్‌ల్లో ఇంగ్లాండ్‌ జట్టుకు దొరికిన గొప్ప ఓపెనింగ్‌ పేస్‌ జోడీ అండర్సన్‌, బ్రాడ్‌. సుదీర్ఘకాలంగా ఈ ద్వయం జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 154 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 546 వికెట్లు తీసిన బ్రాడ్‌.. దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563) రికార్డుకు దగ్గర్లో ఉన్నాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పెట్టగల నైపుణ్యం అతడి సొంతం. 2022లో అతడు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సొంతగడ్డపై బ్రాడ్‌ ప్రమాదకర బౌలర్‌. టెస్టుల్లో కోహ్లీని ఐదు, పూజారాను నాలుగుసార్లు ఔట్‌ చేశాడు. 2018లో లార్డ్స్‌ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో  ఫామ్‌లో ఉన్న కోహ్లీ, పూజారాలను బ్రాడే పెవిలియన్‌ చేర్చాడు. దీంతో టీమ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. అదే సిరీస్‌లో చివరి టెస్టులోనూ విరాట్‌ను ఔట్‌ చేశాడు. సొంతగడ్డపై బ్రాడ్‌ ప్రమాదకర బౌలర్‌ కాబట్టి అతడి బౌలింగ్‌ను భారత్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడాలనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.

గత మూడు పర్యాయాలు భారత్‌ ఇంగ్లాండ్‌లో సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వీళ్లిద్దరే. ప్రతి పర్యటనలోనూ పోటా పోటీగా వికెట్లు తీస్తూ భారత బ్యాటర్లతో ఒక ఆట ఆడుకున్నారు. మొదటి స్పెల్‌లోనే టాప్‌ ఆర్డర్‌ను కూల్చేసి ఇంగ్లాండ్‌ విజయాన్ని దాదాపు ఖాయం చేశారు. గతేడాది జరిగిన ఈ సిరీస్‌లో బ్రాడ్‌ ఆడలేదు. అండర్సన్‌ 4 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని