Deepti-Dean: బౌలింగ్‌ చేసేందుకు దీప్తి శర్మ ప్రయత్నించలేదు: జేమ్స్ అండర్సన్

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ ఛార్లీ డీన్‌ను టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ రనౌట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ ఆ ఘటనపై స్పందించాడు.

Updated : 07 Dec 2022 17:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దీప్తి శర్మ - ఛార్లీ డీన్‌ రనౌట్‌ వివాదంపై చర్చ ఇంకా కొనసాగుతోనే ఉంది. తాజాగా ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్ స్పందించాడు. బౌలర్‌ బంతిని సంధించనప్పుడు నాన్‌స్ట్రైకర్‌ ముందుకు వెళ్లిన సందర్భంలో చేసే ఔట్‌ చట్టబద్ధమైనది కాదని అభిప్రాయపడ్డాడు. తమ బ్యాటర్‌ ముందుకు వెళ్లడం తప్పే కాదన్నట్లుగా మాట్లాడటం గమనార్హం. ఆ మ్యాచ్‌లో చాలాసార్లు డీన్‌ ఇలానే చేసినా.. తప్పు ప్రత్యర్థిదేనని అండర్సన్‌ చెప్పడం విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది. ‘‘ఇలాంటి సంఘటన గురించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఓ 30 సెకన్లపాటు దీర్ఘంగా ఆలోచిస్తే నాకు కాస్త ఆగ్రహం వచ్చింది. అయితే ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇది అవతలివారికీ కోపం తెప్పిస్తుంది. అయితే నేను ఇలాంటి రనౌట్‌ చేసేందుకు మొగ్గు చూపని జట్టుతో ఆడుతున్నా. ప్రస్తుతం దీనిని చట్టబద్ధం చేశారు. కాబట్టి ఇది రనౌట్‌గా పరిగణించాలి’’ అని వ్యాఖ్యలు చేశాడు. 

‘‘అయితే ఇప్పటికైనా ఆటగాళ్లు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. ఇతరులకు ఇలాంటి అవకాశం ఇవ్వొద్దు. ఛార్లీ డీన్‌కు జరిగినదానిపై చాలా ఫీలవుతున్నా. ఎందుకంటే ఆమె ఉండుంటే ఇంగ్లాండ్‌ తప్పకుండా గెలిచి ఉండే అవకాశం ఉంది. కఠిన పరిస్థితులను చాలా అద్భుతంగా మేనేజ్‌ చేసింది. డీన్‌ పరుగును దొంగిలించేందుకు అలా ముందుకు వెళ్లిందని నేను భావించడంలేదు. బౌలర్‌తోపాటు బ్యాటర్ ముందుకు వెళ్లడం సహజం. అయితే దీప్తి శర్మ మాత్రం  బౌలింగ్‌ చేయడానికి వచ్చినట్లు లేదు. ఛార్లీ డీన్‌ ఇలా ముందుకు వెళ్లడం గమనించి రనౌట్‌ చేసింది. ఇక వార్నింగ్‌ ఇచ్చామనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం ఎలాంటి హెచ్చరికలు రాలేదని చెప్పారు. అందుకే దీనిని చట్టబద్ధమైన ఔట్‌గా చూడను. ఇందులో నైపుణ్యం ఎక్కడుంది..? ఇలా ఔట్ చేయడానికి ఇదొక దొంగచాటు మార్గం. అది నాకు ఇష్టం లేదు’’ అని అండర్సన్ తెలిపాడు. మ్యాచ్‌ ముగిశాక క్రికెటర్ల కరచాలనం చేసుకొనేటప్పుడు డీన్‌ ఛార్లీ కన్నీటి పర్యంతమైందని, భారత్‌ ప్లేయర్లు మాత్రం ఆమె వైపు చూడలేదని పేర్కొన్నాడు. తాను ఇంగ్లాండ్‌ ఆటగాడిగానే కాకుండా.. వేరే మ్యాచ్‌ అయినా ఇలాంటి సంఘటన జరిగితే ఇష్టపడనని అండర్సన్‌ చెప్పాడు. అండర్సన్ వ్యాఖ్యలు ఇలా ఉంటే... సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో మాత్రం దీప్తి శర్మ బౌలింగ్‌ యాక్షన్‌తోనే ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని