Qualifier 2 - SRH vs RR: నేను లోకల్.. ఈ స్టేడియం నాకెంతో ‘స్పెషల్’: రవిచంద్రన్ అశ్విన్‌

రెండో క్వాలిఫయర్‌ కోసం హైదరాబాద్‌ - రాజస్థాన్‌ టీమ్‌లు తమ శక్తియుక్తులను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Published : 24 May 2024 16:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో కీలకమైన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ చెన్నై వేదికగా జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్‌ రాయల్స్ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తన సొంత మైదానం చెపాక్‌లో ఆడుతుండటంపై రాజస్థాన్‌ రవిచంద్రన్ అశ్విన్‌ థ్రిల్‌గా ఫీలవుతున్నాడు. ఈసారి తమ జట్టుకే ఇక్కడి ప్రేక్షకులు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నాడు. 

‘‘ఎవరి హోం గ్రౌండ్‌ వారికి స్పెషల్. నాకు కూడా చెపాక్‌ ఇలాంటిదే. చాన్నాళ్లపాటు ఎన్నో సాధించిన మైదానం అది. బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించా. తప్పకుండా ఈసారి మా జట్టు కోసం కీలక ప్రదర్శన చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈసారి మాకే మద్దతు ఇస్తారనుకుంటున్నా. హైదరాబాద్‌పై ఎలాంటి గేమ్‌ ప్లాన్‌ను అమలుచేస్తామనేది ఇప్పుడే చెప్పలేం. మా వ్యూహాలు వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాయా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని అశ్విన్‌ తెలిపాడు. 

హెడ్‌నే టార్గెట్‌ చేస్తుంది: చోప్రా

వరుస మ్యాచుల్లో విఫలమైన ట్రావిస్ హెడ్‌ను రాజస్థాన్‌ బౌలర్లు మరోసారి త్వరగా ఔట్‌ చేసేందుకు వ్యూహం పన్నుతారని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘హెడ్‌కు బౌలింగ్‌ వేసేటప్పుడు ట్రెంట్ బౌల్ట్ పెద్దగా ఇబ్బందిపడడు. గత మ్యాచ్‌లో అతడిని ఔట్ చేసే అవకాశం చేజారింది. రియాన్‌ క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈసారి అలా జరగకుండా హెడ్‌ను ఉచ్చులో వేయడానికి ప్రయత్నిస్తారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. హెడ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పరుగులు చేస్తుంటే.. శర్మ ఛేదన సమయంలో దూకుడుగా ఆడుతున్నాడు. తప్పకుండా అతడు భారత జట్టులోకి వస్తాడు’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

ఒకవేళ మ్యాచ్‌ ఇవాళ రద్దైతే..? 

రెండో క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతాతో టైటిల్‌ కోసం తలపడుతుంది. నైరుతి రుతుపవనాల నేపథ్యంలో వర్షం పడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ అప్పుడు కూడా మ్యాచ్‌ జరగకుండా రద్దైతే మాత్రం హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ కంటే సన్‌రైజర్స్ ముందుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు