Asia Cup Final: ఆసియా కప్‌ ఫైనల్‌.. ఈ లంకను దాటాలంటే సర్వశక్తులూ ఒడ్డాల్సిందే!

ఆదివారం మినీ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.  ఆసియా కప్‌ను (Asia Cup 2023) నెగ్గాలని మరోసారి భారత్, శ్రీలంక జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలాలు ఎలా ఉన్నాయంటే..?

Updated : 16 Sep 2023 20:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆరు దేశాలు తలపడిన ఆసియా కప్‌ 2023 టోర్నీ ఫైనల్‌ దశకు చేరుకుంది. ఆదివారం భారత్ - శ్రీలంక జట్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది. ఆసియా కప్‌ చరిత్రలో అత్యధికసార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా శ్రీలంక (13) కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్ కూడా 11 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఏడుసార్లు విజేతగా నిలవగా.. శ్రీలంక మాత్రం ఆరు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఆసియా కప్‌లో ఇరు జట్లూ 22 మ్యాచుల్లో తలపడగా.. చెరో పదకొండేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆసియా కప్‌ అనగానే శ్రీలంక చెలరేగుతుందనే దానికి ఇవే ఉదాహరణలు. తాజా ఆసియా కప్‌లోనూ శ్రీలంక నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. దీంతో ఫైనల్‌ కూడా రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ తీక్షణ గాయం కారణంగా ఫైనల్‌కు అందుబాటులో ఉండటం లేదు. 

భారత్‌ తరఫున వీరు కీలకం..

  • ఓపెనర్లు: టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ జోడీ పటిష్టమైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్ తొలి వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మిస్తున్నారు. సూపర్ 4 దశలోనూ శ్రీలంకపై భారత్ 213 పరుగులు సాధించినా.. ఓపెనర్లు తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించడం విశేషం. మరోసారి మంచి భాగస్వామ్యం నిర్మించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. బంగ్లాపై క్లిష్టపరిస్థితుల్లోనూ గిల్ సెంచరీ కొట్టడం సానుకూలాంశం. 
  • విరాట్ కోహ్లీ: కొదమసింహంలా ప్రత్యర్థులపై విరుచుకుపడే విరాట్ కోహ్లీ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై వీరబాదుడు బాదిన కోహ్లీ.. శ్రీలంకపై యువ బౌలర్‌ బౌలింగ్‌కు బోల్తా పడ్డాడు. దీంతో శ్రీలంకపై అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశించడం సహజమే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకుని ఫ్రెష్‌గా బరిలోకి దిగనున్నాడు. సచిన్‌ సెంచరీల రికార్డుకు మరింత చేరువగా వచ్చేందుకు విరాట్‌కు ఇదొక చక్కని అవకాశం. 
  • మిడిలార్డర్‌లో ఆ ఇద్దరు: దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేఎల్ రాహుల్ సెంచరీ బాదేశాడు. అదీనూ భయంకరమైన పేస్‌ దళం కలిగిన పాకిస్థాన్‌పై. సూపర్ -4లో శ్రీలంకపైనా విలువైన పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో ఆడలేదు. అదే విధంగా ఇషాన్‌ కిషన్‌ ఫైనల్‌లో ఎలా రాణిస్తాడనేది కీలకం. బంగ్లాపై స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ, శ్రీలంకపై గత మ్యాచ్‌లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. 
  • బౌలింగ్‌లో ఈ ఇద్దరు: భారత బౌలింగ్‌ను చూస్తే అద్భుతంగానే ఉంది. కానీ, ఇద్దరు బౌలర్లు మాత్రం అద్వితీయమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వారిలో దాదాపు సంవత్సరం తర్వాత వన్డే మ్యాచ్‌లను ఆడుతున్న బుమ్రా ఒకరు కాగా.. ఇటీవల అద్భుతమైన బౌలింగ్‌తో చాహల్‌, అశ్విన్‌ను కాదని జట్టులోకి స్థానం దక్కించుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌. ఈ మినీ టోర్నీలో నిలకడగా బౌలింగ్‌ వేస్తున్నవారిలో బుమ్రా, కుల్‌దీప్‌ ఉంటారు. సూపర్ -4లో శ్రీలంకపై భారత్ విజయం సాధించడంలో వీరిద్దరు ప్రధాన పాత్ర పోషించారు. 

శ్రీలంకలో వీరిని ఆపకపోతే కష్టమే.. 

  • కుశాల్ మెండిస్, సమరవిక్రమ: శ్రీలంక మిడిలార్డర్‌లో అత్యంత కీలకమైన ఆటగాళ్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ. వీరిద్దరిని ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండకుండా చూస్తే శ్రీలంకపై టీమ్ఇండియా సగం విజయం సాధించినట్లే. కీలకమైన సూపర్ -4 దశలో సమరవిక్రమ పాక్‌పై 48 పరుగులు, బంగ్లాపై 93 పరుగులు చేశాడు. కుశాల్‌ కూడా పాక్‌పై 91 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. 
  • ఎనిమిదో స్థానం వరకూ..: శ్రీలంక జట్టులోనూ ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక ఆల్‌రౌండర్‌ కావడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.  అసలంక, నిస్సాంక, ధనంజయ డిసిల్వా కూడా డేంజరస్‌ బ్యాటర్లు. వీరు బౌలింగ్‌లోనూ మెరుస్తుంటారు. సూపర్ -4లో భారత్‌ను ఇబ్బంది పెట్టిన బౌలర్లలో అసలంక కూడా ఉన్నాడు. నాలుగు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. 
  • దునిత్ వెల్లలాగె: ఇప్పుడందరి కళ్లూ ఈ కుర్రాడిపైనే. భారత్‌పై ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చివరి వరకూ క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అంతకుముందు భారత్‌ టాప్‌ బ్యాటర్లను వణికించి ఐదు వికెట్ల ప్రదర్శనా చేశాడు. విరాట్, రోహిత్, గిల్, రాహుల్, హార్దిక్‌ పాండ్య వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరోసారి అతడిని టీమ్‌ఇండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక బ్యాటింగ్‌లోనూ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గానే అతడి షాట్ల ఎంపిక ఉందని విశ్లేషకులు అభినందించారు. 
  • పతిరన: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో రాటుదేలిన మతీశ్‌ పతిరన ఇప్పుడీ ఆసియా కప్‌లోనూ తన సత్తా ఏంటో చూపించాడు. యువ ‘మలింగ’గా తన వైవిధ్యభరిత బౌలింగ్‌ యాక్షన్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. భారత్‌తో గత మ్యాచ్‌లో 4 ఓవర్లు మాత్రమే వేసిన పతిరన వికెట్ లేకుండా 31 పరుగులు ఇచ్చాడు. కానీ, ఫైనల్‌ వంటి కీలక పోరులో అతడి యార్కర్లను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు కత్తిమీద సామే. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని