Abhinav Bindra: అథ్లెట్లు రోబోలు కాదు

క్రీడా విధానంలో భాగమైన ప్రతి ఒక్కరూ అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలని, అంతే కానీ పతకాలు తెచ్చే రోబోల్లాగా పరిగణించకూడదని షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రా అన్నాడు.

Published : 24 May 2024 03:05 IST

దిల్లీ: క్రీడా విధానంలో భాగమైన ప్రతి ఒక్కరూ అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలని, అంతే కానీ పతకాలు తెచ్చే రోబోల్లాగా పరిగణించకూడదని షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రా అన్నాడు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఇటీవల భారత మెరుగైన ప్రదర్శన కారణంగా క్రీడాకారులకు ఆదరణ దక్కడంతో పాటు వీళ్లపై అంచనాల భారం కూడా పెరుగుతోంది. ‘‘అన్నింటికంటే ముందుగా అథ్లెట్లను మనుషుల్లాగే చూడాలి. పతకాలు తెచ్చే రోబోల్లాంటి పరిస్థితిలోకి నెట్టొద్దు. అథ్లెట్లతో బంధం పెంచుకోవడం, నమ్మకం ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యం. అథ్లెట్ల స్థిరమైన మానసిక, భావోద్వేగ పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు క్రీడా సైకాలజిస్టులకు ఎంతో ఓపిక ఉండాలి. టోక్యో ఒలింపిక్స్‌కు, ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌కు మధ్య షూటర్ల మానసిక దృక్పథం మారింది. నాలుగేళ్ల క్రితం కాకుండా ఇప్పుడు వీళ్లు ఎలా ఉన్నారనే విషయంపైనే మానసిక అంచనా వేయాలి. అథ్లెట్ల పరిణామంతో పాటే సైకాలజిస్టులూ మారాలి. ఇప్పుడు సంధి దశలో ఉన్నాం. క్రీడా సైన్స్‌ను కోచ్‌లు స్వాగతించాలి. వీళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు కోచ్‌లకు మానసిక ఆరోగ్యం గురించి వర్క్‌షాప్‌ నిర్వహిస్తే అప్పుడు వాళ్లు మరింత సంతోషపడతారు’’ అని కర్ణిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో గురువారం క్రీడా సైకాలజిస్టులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో అభినవ్‌ పేర్కొన్నాడు. 2008 ఒలింపిక్స్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో బింద్రా పసిడి గెలిచిన సంగతి తెలిసిందే.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని