IND vs AUS: సెలక్టర్లు రాజీనామా చేయాలి: సునీల్ గావస్కర్‌

ఆస్ట్రేలియా సెలక్టర్లపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌  (Sunil Gavaskar) తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. జట్టు ఎంపిక సరిగ్గా చేయనందుకు బాధ్యత వహిస్తూ వారు రాజీనామా చేయాలని సూచించాడు.

Updated : 06 Mar 2023 20:10 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ  (Border Gavaskar Trophy)లో మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (Australia) ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పిచ్‌లను భారత్‌ తమకు అనుకూలంగా మార్చుకుందని, అందుకే విజయం సాధించిందని ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు, ఆ దేశ మీడియా అక్కసు వెళ్లగక్కింది. అయితే, ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులో కంగారులు విజయం సాధించడంతో  వారి నోళ్లకు తాళం పడింది. అయితే.. ఆస్ట్రేలియా సెలక్టర్లను భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) ఇటీవల తీవ్రంగా విమర్శించాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, కొన్ని మీడియా సంస్థలు పిచ్‌ల గురించి ఆలోచించడం మానేసి సెలక్టర్లు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించాడు.

‘చాలా మంది ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు, కొన్ని మీడియా సంస్థలు తమ ఆటగాళ్లను విమర్శిస్తున్నాయి. నిజానికి వాళ్లు టార్గెట్ చేయాల్సింది సెలక్టర్లను. మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటారో లేదో తెలియనప్పుడు ఆ ముగ్గురు ఆటగాళ్లను (హేజిల్‌వుడ్‌, మిచెల్ స్టార్క్‌, కామెరూన్‌ గ్రీన్) ఎలా ఎంపిక చేస్తారు? అంటే సగం సిరీస్‌కు కేవలం 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారన్నమాట. అప్పటికప్పుడు హడావుడిగా స్పిన్నర్‌ మాథ్యూ కునెమన్‌ను రప్పించారు. అలాంటి స్పిన్నర్‌ అప్పటికే జట్టులో ఉన్నాడు. ఒకవేళ ఆ ఆటగాడు జట్టుకు అవసరం లేడనుకుంటే అతడిని ఎంపిక చేయడం ఎందుకు? తర్వాత అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ఎందుకు? అంటే టీమ్‌ మేనేజ్‌మెంట్ 12 మంది ఆటగాళ్ల నుంచి 11 మందిని ఎంపిక చేసుకుంటుందా? ఇది మరీ విచిత్రంగా ఉంది. సెలక్టర్లకు నిజంగా చిత్తశుద్ధి, బాధ్యత ఉంటే వారు రాజీనామా చేయాలి’ అని సునీల్ గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని