Tanveer Sangha - Cricket: అరంగేట్రంలోనే హిట్టర్లను భయపెట్టాడు.. ఎవరీ తన్వీర్‌ సంఘా?

ఆసీస్‌ (SA vs AUS) తరఫున దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగిన భారత సంతతి ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. దీంతో క్రికెట్‌ ప్రపంచమంతా అతడెవరా? అని శోధించడం మొదలు పెట్టింది.

Published : 31 Aug 2023 16:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ప్రాథమిక జట్టులో సభ్యుడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కూ ఎంపికయ్యాడు.. కానీ తుది జట్టులో అవకాశం వస్తుందని మాత్రం అనుకోలేదు.. తీరా మ్యాచ్‌ జరిగే సమయానికి టాప్‌ క్రికెటర్ అనారోగ్యం బారిన పడటం అతడికి కలిసొచ్చింది. విదేశీ గడ్డపై అరంగేట్రం చేశాననే బెరుకు లేకుండా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసి శభాష్ అనిపించుకున్నాడీ ఆస్ట్రేలియా (Australia Team) లెగ్‌ స్పిన్నర్. ఇదేంటి ఆసీస్ బౌలర్‌ గురించి ఇంత ఉపోద్ఘాతం అవసరమా..? అనే సందేహం రాకమానదు. ఎందుకంటే అతడు ఆసీస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాడు తన్వీర్ సంఘా (Tanveer Sangha). 

దక్షిణాఫ్రికా జట్టులో హెండ్రిక్స్‌, ఐదెన్ మార్‌క్రమ్‌, డేవాల్డ్‌ బ్రెవిస్, స్టబ్స్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు ఉన్నారు. వీరు క్రీజ్‌లో కుదురుకుంటే ఎంతటి బౌలర్‌నైనా ఉతికారేస్తారు. అయితే, ఆసీస్‌ యువ సంచలనం తన్వీర్ సంఘా మాత్రం వారిందరి భరతం పట్టేలా బంతులను సంధించి ఔట్‌ చేయడం విశేషం. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. దాదాపు రెండు దశాబ్దాల రికార్డుకు సంఘా (4/31) దగ్గరగా వచ్చాడు. 2005లో మైకెల్‌ కాస్పోవిక్‌ ఆసీస్‌ తరఫున అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే 4/29 ప్రదర్శన చేశాడు. 

జలంధర్‌ కుటుంబం.. తండ్రి ట్యాక్సీ డ్రైవర్‌

తన్వీర్‌ తండ్రి జోగా సంఘా 1997లొ సిడ్నీకి వలస వచ్చి ట్యాక్సీ డ్రైవర్‌గా స్థిరపడ్డారు. తన్వీర్ 2001 నవంబర్‌ 26న సిడ్నీలోనే జన్మించాడు. అయితే, సంఘా కుటుంబానిది భారత్‌లోని జలంధర్‌కు సమీపంలోని రహిమ్‌పుర్. అతడి తల్లి ఉప్‌నీత్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. తన్వీర్‌ 2020లోనే దేశవాళీ టీ20ల్లోకి అడుగు పెట్టాడు. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే అదే ఏడాది జరిగిన అండర్ -19 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఛాన్స్‌ రావడంతో దానిని రెండు చేజేతులా అందిపుచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణిస్తే తప్పకుండా భారత్‌తో  జరిగే వన్డే సిరీస్‌తోపాటు మెగా టోర్నీలో తుది జట్టులోకి రావడం ఖాయం. ఇలా ఆసీస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో భారత ఆటగాడు తన్వీర్‌. ఇంతకుముందు 2015లో గురిందర్ సంధు ఆసీస్‌ తరఫున రెండు వన్డేలు ఆడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని