Australia: ఆస్ట్రేయాలియానా.. మజాకా! ప్రపంచకప్‌లో పడి లేచిన కంగారూ

మంచి అంచనాలతో ప్రపంచకప్‌ బరిలో దిగిన జట్టు.. తొలి రెండు మ్యాచ్‌లలో చెత్త ప్రదర్శన చేసింది. కానీ, ఆ తర్వాతి మ్యాచ్‌లలో అనూహ్యంగా పుంజుకుని ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆదివారం భారత్‌తో తుదిపోరుకు సై అంటూ.. ఆసీసా మజాకానా అని నిరూపించింది.  

Published : 17 Nov 2023 15:01 IST

విజయాలు ఆస్ట్రేలియాకు (Australia) కొత్తకాదు.. కప్పులు అంతకన్నా కొత్త కాదు.. ఎప్పుడు ప్రపంచకప్‌ జరిగినా ఆసీస్‌ను ఏమాత్రం తీసిపారేయలేరు. అందుకే ఈసారి ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లోనూ కంగారూ జట్టును ఫేవరెట్లలో ఒక జట్టుగా చేర్చారు. కానీ, ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టుకు ఓటమే. పైగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. ఎప్పుడూ చూడని దృశ్యమది. ఆ జట్టు ఆట చూస్తే ఈసారి కష్టమే అన్నట్టు కనిపించింది. కానీ అద్భుతంగా పుంజుకున్న ఆసీస్‌ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్‌తో తుదిపోరుకు సై అంటోంది. ఆసీసా మజాకానా అని నిరూపించింది.

అదే ప్రొఫెషనలిజం

ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుగా ఓడించడం! ఒకప్పుడు ఆసీస్‌ బ్రాండ్‌ ఇది. 1999 నుంచి 2007 వరకు కంగారూ జట్టు భీకర ఆటతో ప్రత్యర్థులను వణికించింది. ఒకప్పుడు వెస్టిండీస్‌ను చూస్తేనే ప్రత్యర్థి జట్లు సగం ఓడిపోయేవి. కానీ 2000 దశకంలో ఆసీస్‌ను చూసినా కూడా ఇలాగే భావించేవి. అలాంటి ఆసీస్‌ ఆటలో తగ్గి చిన్న ప్రత్యర్థుల చేతుల్లోనూ ఓడడం మొదలుపెట్టింది. బాల్‌ టాంపరింగ్‌ లాంటి అంశాలు ఆ జట్టును బాగా ఇబ్బంది పెట్టాయి. కాల క్రమంలో స్టార్‌ ఆటగాళ్లు దూరం కావడంతో బలహీనపడింది. కానీ, ఆసీస్‌ అంటే ప్రొఫెషనలిజానికి పేరు. ఎంతగా పడినా కుంగలేదు. ప్రత్యర్థులు కలవరపెట్టినా తేలిగ్గా లొంగలేదు. పునాదులు నిర్మించుకుని.. ప్రతిభావంతులను చేర్చుకుని మళ్లీ బలంగా మారింది. 2021 ప్రపంచకప్‌ గెలవడం ఆ జట్టు స్థైరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒకప్పటిలా భీకరంగా లేకపోయినా బలంగానే ఉన్నానన్న సంకేతాలు పంపింది. 

పడి లేచింది

అయిదుసార్లు ఛాంపియన్‌ ఆస్ట్రేలియా.. భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో మంచి అంచనాలతోనే బరిలో దిగింది. కప్‌ గెలుస్తుందో లేదో చెప్పలేకపోయినా కనీసం సెమీఫైనల్‌ పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఆరంభంలో ఆసీస్‌ ఆట చూస్తే ఇంగ్లాండ్‌ ఆటనే తలపించింది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త ప్రదర్శన చేసింది. భారత్, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు వాళ్లకు ఎంతో పేరున్న ఫీల్డింగ్‌లోనూ తడబడింది. సులువైన క్యాచ్‌లు వదిలిపెట్టి అసలు ఆడేది ఆస్ట్రేలియానేనా అన్న అనుమానాన్ని కలిగించింది. కానీ, అక్కడ నుంచి పుంజుకున్న తీరు అద్భుతం. ముఖ్యంగా తనకన్నా బలహీనమైన జట్ల నుంచి పోటీ ఎదురైనా నిలిచింది. ఒత్తిడిలోనూ గట్టిగా నిలబడి ఒక్కో మ్యాచే గెలుచుకుంటూ పోయింది. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌పై విజయం మాత్రం అద్భుతం. ఇక ఓటమి తథ్యం అన్న స్థితి నుంచి విజయం అందుకుని ఆశ్చర్యపరిచింది. దీనికి ఆ జట్టు మ్యాక్స్‌వెల్‌కు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి.

వన్డే చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన అతడు డబుల్‌ సెంచరీతో ఆసీస్‌ను గట్టెక్కించాడు. ఆ స్ఫూర్తితోనే సెమీస్‌ చేరిన కంగారూ జట్టు.. సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి తుదిపోరుకు చేరింది. సెమీస్‌లో ఒకప్పటి ఆసీస్‌ ఆట కనిపించింది. ప్రత్యర్థిని పేస్‌తో చుట్టేయడం చూస్తే పాత రోజులు గుర్తుకొచ్చాయి. బ్యాటింగ్‌లో కాస్త తడబడినా ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్‌ చేరింది. ఈ టోర్నీలో అజేయంగా సాగుతున్న భారత్‌తో తుదిపోరులో కంగారూ ఆట ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. అయితే ఇప్పటిదాకా జట్టు ఆట ఒక ఎత్తు. ఇప్పుడు ఫైనల్‌ ఇంకో ఎత్తు. 20 ఏళ్ల తర్వాత రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు సిద్ధమయ్యాయి. మరి మునుపటి మాదిరి కంగారూ జట్టు కప్‌ ఎగరేసుకుపోగలదా లేక భారత్‌ దూకుడు ముందు తలొంచుతుందా అనేది ఆదివారమే తేలుతుంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని