Travis Head: హెడ్‌.. ఆస్ట్రేలియా ‘హిట్‌మ్యాన్‌’.. మన రోహిత్‌ లాంటోడే ఆసీస్‌ సెమీస్‌ హీరో

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో ట్రావిస్‌ హెడ్‌దే కీలక పాత్ర. తొలుత బౌలింగ్‌లో.. ఆనక బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Updated : 17 Nov 2023 19:49 IST

కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్లో అప్పుడప్పుడూ మెరుస్తూ, పార్ట్‌టైమ్‌ స్పిన్‌తో జట్టుకు ఉపయోగపడుతూ.. ఓ మోస్తరు స్థాయి ఆటగాడిలాగే కనిపించేవాడు రోహిత్‌ శర్మ. కానీ అతను ఓపెనింగ్‌లోకి వచ్చాక కథ మారిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు ‘హిట్‌మ్యాన్‌’. ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ హీరో ట్రావిస్‌ హెడ్‌ది (Travis Head) సైతం దాదాపుగా ఇలాంటి కథే.

వన్డే ప్రపంచకప్‌లో రసవత్తరంగా సాగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో ట్రావిస్‌ హెడ్‌దే అత్యంత కీలక పాత్ర. సెమీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సైతం అతనే. మొదట పేలవ ఆరంభం తర్వాత పుంజుకుని మెరుగైన స్థితికి చేరుకున్న దక్షిణాఫ్రికాను ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టింది హెడ్‌యే. ప్రధాన స్పిన్నర్‌ జంపా ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా విఫలం కాగా.. పార్ట్‌టైమర్‌ అయిన హెడ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పే బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. 250 దాటేలా కనిపించిన దక్షిణాఫ్రికా 212 పరుగులకు పరిమితమైందంటే మధ్యలో హెడ్‌ కొట్టిన దెబ్బే కారణం. ఆ తర్వాత బ్యాటుతోనూ అతను చెలరేగిపోయాడు. లక్ష్యం చిన్నదే అయినా.. ధాటిగా ఆడి ఆసీస్‌ పైచేయి సాధించేలా చేశాడు. 

హెడ్‌ నిష్క్రమించాక ఆసీస్‌ ఎంత ఇబ్బంది పడిందో, దక్షిణాఫ్రికా ఎలా పోటీలోకి వచ్చిందో తెలిసిందే. అతను వెనుదిరిగాకే తన ఇన్నింగ్స్‌ ఎంత విలువైందో అర్థమైంది. సెమీస్‌ విజయంలో ఇంత కీలక పాత్ర పోషించిన హెడ్‌.. అసలు ప్రపంచకప్‌లో ఆడతాడన్న గ్యారెంటీయే లేదు. హెడ్‌ లేకుండానే భారత్‌కు వచ్చింది ఆస్ట్రేలియా. ప్రపంచకప్‌కు కొన్ని వారాల ముందు అతడి ఎడమ చేయికి ఫ్రాక్చర్‌ అయింది. దీంతో ఈ మెగా టోర్నీకి అతను అనుమానంగా మారాడు. కానీ వేగంగా కోలుకుని ప్రపంచకప్‌ మధ్యలో ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో వెంటనే జట్టులోకి తీసుకుని తుది జట్టులో ఆడించింది ఆసీస్‌. ఆడిన తొలి మ్యాచ్‌లోనే (న్యూజిలాండ్‌)పై మెరుపు శతకంతో తన విలువను చాటిచెప్పాడు హెడ్‌. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. కీలకమైన సెమీస్‌లో ఆల్‌రౌండ్‌ మెరుపులతో జట్టును గెలిపించి ఫైనల్‌ చేర్చాడు.

మిడిలార్డర్లో మొదలుపెట్టి..

ఎడమ చేతి వాటం బ్యాటర్‌ అయిన ట్రావిస్‌ హెడ్‌ దేశవాళీ క్రికెట్లో మిడిలార్డర్లోనే ఆడేవాడు. దీంతో పాటుగా కుడిచేతి వాటం ఆఫ్‌ స్పిన్‌తో ఉపయోగపడేవాడు. 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హెడ్‌.. జాతీయ జట్టులోనూ మొదట మిడిలార్డర్లోనే ఆడాడు. టీ20లతో పాటు వన్డేల్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసిన హెడ్‌ను తర్వాతి ఏడాది ప్రయోగాత్మకంగా వన్డేల్లో ఓపెనర్‌ను చేసింది ఆస్ట్రేలియా టీమ్‌ మేనేజ్‌మెంట్‌. ఆ స్థానంలో ఆడిన తొలి వన్డేలోనే అతను సెంచరీ సాధించాడు. దీంతో ఆ తర్వాత కూడా అతను అదే స్థానంలో ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఓపెనర్‌ అయ్యాడు. మధ్యలో ఫామ్‌ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయినా.. తిరిగి దేశవాళీల్లో సత్తా చాటి ఆస్ట్రేలియా జట్టులోకి పునరాగమనం చేశాడు.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాటింగ్‌ శైలి మారిపోయింది. గతంలో కంటే విధ్వంసకంగా ఆడటం మొదలుపెట్టాడు. గత ఏడాది కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో బాగా దూకుడు పెరగడంలో హెడ్‌ది కీలక పాత్ర. గత ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి పాలవడానికి ప్రధాన కారణం ట్రావిసే. ఆ మ్యాచ్‌లో 174 బంతుల్లో 169 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్‌కు దూరం చేశాడు. వన్డేల్లో మరింత నిలకడగా రాణిస్తున్న హెడ్‌.. ఇప్పుడు ప్రపంచకప్‌పై తన ముద్ర వేశాడు. ఫైనల్లో ఈ ఆల్‌రౌండర్‌పై భారత్‌ ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిందే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని