IPL 2024: ఆసీస్‌ ఆటగాళ్లకు ఇంత ధరా?.. కంగారూ క్రికెటర్లకు డిమాండ్‌ ఎందుకు?

ఐపీఎల్ వేలంలో (IPL Auction) ఆసీస్ ఆటగాళ్ల హవా కొనసాగింది. భారీ ధరను ఆ జట్టు ప్లేయర్లే సొంతం చేసుకున్నారు. రికార్డులు కూడా వారి పేరిటే నమోదయ్యాయి. 

Updated : 20 Dec 2023 21:55 IST

రూ.16 కోట్లు దాటితేనే అమ్మో అంత ధరనా అనుకున్నాం. అదే.. రూ.18.50 కోట్లు అయితే ఆశ్చర్యంలో మునిగిపోయాం. ఇప్పుడు ఏకంగా ఒకరికేమో రూ.24.75 కోట్లు, మరొకరికేమో రూ.20.50 కోట్లు. గత రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఈ ఐపీఎల్‌ మినీ వేలం అంచనాలను దాటేసింది. ఆటగాడి ధర రూ.20 కోట్ల మార్కును చేరుకోవడమే కాదు.. ఒకే సారి ఇద్దరికి అంతకంటే ఎక్కువ ధర దక్కింది. ఆ ఇద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్, కమిన్స్‌ కావడం ఇక్కడ మరో విశేషం. వీళ్లే కాదు.. ఈ వేలంలో ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ భారీ ధర పలికింది. మరి కంగారూ క్రికెటర్లపై ఫ్రాంఛైజీలు రూ.కోట్ల వర్షం కురిపించడానికి కారణమేంటీ? 

వాళ్లదే హవా..

ఐపీఎల్ వేలం అనగానే చాలు ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఫ్రాంఛైజీల మోజు బయటపడుతుంది. లీగ్‌ ఆరంభం నుంచి ఇది ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న టాప్‌-10 క్రికెటర్ల జాబితాలో నాలుగు స్థానాలు వాళ్లవే. స్టార్క్, కమిన్స్‌ (2024 వేలం) తొలి రెండు ప్లేసుల్లో ఉండగా.. కామెరూన్‌ గ్రీన్‌ (2023లో రూ.17.50 కోట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. కమిన్స్‌ (2020లో రూ.15.50 కోట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇద్దరు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు (సామ్‌ కరన్‌- రూ.18.50 కోట్లు, బెన్‌ స్టోక్స్‌- రూ.16.25 కోట్లు), ఒక్కో దక్షిణాఫ్రికా (క్రిస్‌ మోరిస్‌- రూ.16.25 కోట్లు), వెస్టిండీస్‌ (నికోలస్‌ పూరన్‌- రూ.16 కోట్లు), ఇద్దరు భారత ఆటగాళ్లు (యువరాజ్‌ సింగ్‌- రూ.16 కోట్లు, ఇషాన్‌ కిషన్‌- రూ.15.25 కోట్లు) ఉన్నారు. అంతర్జాతీయ టీ20ల్లో బెరుకన్నదే లేకుండా దూకుడుగా ఆడటం ఆసీస్‌ ఆటగాళ్లకు అలవాటు. అంతే కాకుండా తమ సొంత బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో సత్తాచాటిన కంగారూ ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడం, ఎలాంటి వాతావరణానికి అయినా అలవాటు పడటం ఆసీస్‌ ఆటగాళ్ల ప్రత్యేకత.  

ఈ సారి కూడా అంతే..

ఈ సారి వేలంలోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధరలను దక్కించుకున్నారు. దీని వెనుక ఇటీవల ప్రపంచకప్‌లో వీళ్ల ప్రదర్శన, అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన ఆటతీరు, వారి దేశవాళీ లీగ్‌లో ఉత్తమంగా రాణించడం తదితర కారణాలున్నాయి. అంతే కాకుండా వేలంలో వీళ్ల పేర్లు వచ్చే సమయానికి నెలకొన్న పరిస్థితులు, ఫ్రాంఛైజీల దగ్గర అప్పుడు ఉన్న డబ్బు, జట్ల మధ్య పోటీ కూడా వీరి ధరలపై ప్రభావం చూపాయి. ఈ సారి అత్యధిక ధర పలికిన టాప్‌-6 ఆటగాళ్లలో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లున్నారు. స్టార్క్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌), కమిన్స్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)తో పాటు యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌- రూ.10 కోట్లు) కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వీళ్లే కాకుండా ట్రేవిస్‌ హెడ్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రూ.6.80 కోట్లు), జే రిచర్డ్‌సన్‌ (దిల్లీ క్యాపిటల్స్‌- రూ.5 కోట్లు), ఆస్టన్‌ టర్నర్‌ (లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌- రూ.కోటి) కూడా మంచి ధర పలికారు. 

అందుకే ఇలా

ఐపీఎల్‌లో రెండు సీజన్లే (ఆర్సీబీ తరపున 2014, 2015) ఆడినప్పటికీ స్టార్క్‌ కోసం కోల్‌కతా రికార్డు ధర చెల్లించింది. 33 ఏళ్ల స్టార్క్‌ అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల ప్రపంచకప్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన (16 వికెట్లు) చేశాడు. పైగా ఫెర్గూసన్, సౌథీ, ఉమేశ్, శార్దూల్‌ వంటి పేసర్లను వదులుకున్న కోల్‌కతాకు స్టార్క్‌ అవసరం వచ్చింది. మరోవైపు కమిన్స్‌ను బ్యాటర్‌గా, బౌలర్‌గా, కెప్టెన్‌గా వాడుకోవాలనే ఉద్దేశంతోనే సన్‌రైజర్స్‌ కూడా తగ్గలేదని చెప్పాలి. మంచి పేస్‌తో వికెట్లు రాబట్టగలిగే అతడు భారీ షాట్లూ ఆడగలడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం (2022లో ముంబయిపై 14 బంతుల్లో) రికార్డు అతనిదే. ఇక ఈ ఏడాది దేశానికి ప్రపంచకప్‌ అందించిన కమిన్స్‌ నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్‌ ఫైనల్లో శతకంతో ఆసీస్‌ను గెలిపించిన హెడ్‌ కోసం కూడా వేలంలో పోటీ నెలకొంది. వార్నర్‌ను వదులుకున్న తర్వాత ఆ స్థాయి ఓపెనర్‌ సన్‌రైజర్స్‌కు దొరకలేదు. ఇప్పుడా ఖాళీని హెడ్‌తో భర్తీ చేయనుంది. ఇక ఆసీస్‌ యువ పేసర్‌ స్పెన్సర్‌కు అంత ధర ఊహించనిదే. ఆస్ట్రేలియా తరపున అతను ఇప్పటి వరకూ రెండు టీ20లు, ఓ వన్డే మాత్రమే ఆడి రెండు వికెట్లను పడగొట్టాడు. కానీ, బిగ్‌బాష్‌ లీగ్, హండ్రెడ్‌ లీగ్‌లో అతడి ప్రదర్శన, వేగం చూసి గుజరాత్‌ దక్కించుకున్నట్లుంది. రిచర్డ్‌సన్‌ కోసం దిల్లీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్లు కనిపించింది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని