Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్

అక్షర్‌ పటేల్ (Axar Patel) .. ఆసీస్‌పై అద్భుత ప్రదర్శనతో నాలుగో టీ20 మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్‌ చేయడం వల్ల వికెట్లు దక్కాయని పేర్కొన్నాడు.

Published : 02 Dec 2023 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ విజయం సాధించడంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. దీంతో అక్షర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడాడు.

‘‘మ్యాచ్‌లు ఆడనప్పుడు ఇంటి దగ్గర ఉన్న సమయంలో చాలా అంశాలపై దృష్టిపెట్టాను. ఇప్పుడు అవి ఈ సిరీస్‌లో అమలు చేసేందుకు ప్రయత్నించా. నా బలమేంటో తెలుసు. దానికి కట్టుబడి బౌలింగ్‌ చేశా. మంచు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులను వేయాలి. ఈ మ్యాచ్‌లో అలా చేసి ఫలితం రాబట్టగలిగా. ఈ ఫార్మాట్‌లో మానసికంగా చాలా బలంగా ఉండాలి. అప్పుడే వికెట్లను తీసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గాయం కారణంగా వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీలో ఆడలేకపోయా. కోలుకున్నాక బౌలింగ్‌లో మెరుగుకావడానికి శ్రమించా. బౌలింగ్‌లో వేరియేషన్స్‌ చాలా కీలకం. వాటిపై సాధన చేశా’’ అని అక్షర్ పటేల్ తెలిపాడు. 

ఎప్పుడు అవకాశం వచ్చినా..: రవి బిష్ణోయ్‌

‘‘జట్టు కోసం ఎప్పుడు అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి ఎదురు చూస్తుంటా. ఆసీస్‌తో అవకాశం రావడం బాగుంది. భారత్‌ గెలవడం మరింత ఆనందంగా ఉంది. నా బౌలింగ్‌ పట్ల సంతోషంగా ఉన్నా. భవిష్యత్తులోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. జట్టులో యువకులం ఎక్కువగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకరికొకరం జట్టుగా ఆస్వాదిస్తున్నాం. భారత బౌలింగ్‌ కోచ్ సాయిరాజ్‌ బహుతులే ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిలకడగా బంతులను సంధించడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు’’ అని భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని