ICC: ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డులు.. భారత్‌ నుంచి ముగ్గురు నామినేట్!

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం టీమ్‌ఇండియా నుంచి అక్షర్‌ పటేల్, స్మృతి మంధాన, హర్మన్‌ ప్రీత్ కౌర్ నామినేట్‌ అయ్యారు.  

Published : 06 Oct 2022 02:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్‌ విభాగంలో ఒకరికి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డు’ ప్రకటిస్తుంది. తాజాగా ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్  (సెప్టెంబర్) అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. అక్షర్‌తోపాటు పాకిస్థాన్‌ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్‌ కూడా నామినేట్‌ కావడం గమనార్హం. 

ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా భారీ స్కోర్లు నమోదైన తొలి మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. కేవలం 8 ఓవర్ల చొప్పున జరిగిన రెండో మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాటర్లకు కళ్లెం వేశాడు. రెండు ఓవర్ల కోటాలో 13 పరుగులే ఇచ్చి గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, టిమ్‌ డేవిడ్‌ వికెట్లు తీసి అదరగొట్టాడు. మూడో టీ20లోనూ మూడు వికెట్లు తీయడం విశేషం. దీంతో ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి టాప్‌ బౌలర్‌గా మారాడు. టీ20ల్లో నంబర్‌వన్ బ్యాటర్‌ రిజ్వాన్‌ కూడా అవార్డు రేసులో నిలిచాడు. గత పది మ్యాచుల్లో ఏడు అర్ధశతకాలు నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లోనూ 281 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం. భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ కామెరూన్ గ్రీన్‌ రెండు అర్ధశతకాలు బాదేశాడు. దీంతో అతడి పేరూ నామినేట్‌ అయింది. 

భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు

పురుషుల క్రికెట్‌ నుంచి అక్షర్‌ పటేల్‌ ఒక్కడే నామినేట్‌ కాగా.. భారత్‌ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేషన్‌ దక్కించుకోవడం విశేషం. ఇంగ్లాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తోపాటు ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డుకు నామినేట్‌ కాగా.. వీరిద్దరితోపాటు బంగ్లాదేశ్‌ సారథి నిగర్ సుల్తానాకు అవకాశం దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని