Babar Azam: తోటి ఆటగాడిని హేళన చేసి.. చిక్కుల్లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజాం

టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్యాంపు ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తోటి ఆటగాడిని హేళన చేసి వివాదంలో చిక్కుకున్నాడు.

Published : 04 Jun 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పాకిస్థాన్‌ జట్టులో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా.. తాజాగా ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తోటి ఆటగాడిని హేళన చేస్తూ మాట్లాడిన వీడియో ఒకటి వైరలవుతోంది.

ప్రాక్టీస్‌ సమయంలో బాబర్‌ తోటి ఆటగాళ్లతో మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ను ‘నువ్వు ఎక్కువ బరువు ఉన్నావు..’ అని అన్నట్లు వినిపించింది. దీంతో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తోటి ఆటగాడిని బాడీషేమింగ్‌ చేశాడని విమర్శిస్తున్నారు.

మరోవైపు జట్టు ఎంపిక తర్వాత ఎక్కువ మంది ఆజం ఖాన్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. అతడి ఫిట్‌నెస్‌, ఆటతీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్‌ ముంగిట.. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఐదు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇటు కీపింగ్‌లోనూ ఘోరమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు. కనీసం బంతిని పట్టుకొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి క్రికెటర్‌ను పొట్టి కప్‌ కోసం ఎంపిక చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ కుమారుడు కావడం వల్లే ఆజంను ఎంపిక చేశారని కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని