Babar Azam: ఆడలేక.. నడిపించలేక.. కెప్టెన్సీ వదిలేసిన బాబర్‌

బ్యాటర్‌గా అద్భుతంగా ఆడే బాబర్‌ అజాం (Babar Azam).. ఈసారి వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టును నడిపించడంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.

Published : 16 Nov 2023 15:28 IST

ఆ ఆటగాడు అత్యుత్తమ నైపుణ్యాలతో పాకిస్థాన్‌ జాతీయ జట్టులోకి వచ్చాడు. తనదైన క్లాస్‌ ఆటతీరుతో మెప్పించాడు. రికార్డుల బాటలో సాగాడు. అనతికాలంలోనే జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ తనదైన ముద్ర వేశాడు. విరాట్‌ కోహ్లీతో పోల్చి చూసే స్థాయికి చేరాడు. దీంతో జట్టు పగ్గాలు దక్కాయి. మూడు ఫార్మాట్లలోనూ జట్టును నడిపించాడు. సమర్థవంతమైన కెప్టెన్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రపంచకప్‌తో అతని కథ మలుపు తిరిగింది. ఈ మెగా టోర్నీలో జట్టును నడిపించడంలో అతను విఫలమయ్యాడు. ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. చివరకు జట్టు నాయకత్వాన్ని వదులుకున్నాడు. అతనే.. బాబర్‌ అజాం (Babar Azam). ఉవ్వెత్తున ఎగసి.. అంతే వేగంగా కింద పడ్డ క్రికెటర్‌. 

మెరుపులతో.. 

2015లో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేసిన బాబర్‌ తక్కువ కాలంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. నిలకడగా రాణిస్తూ పాక్‌ ప్రధాన బ్యాటర్‌గా మారాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణించాడు. వన్డేల్లో అత్యధిక వేగంగా 5 వేల పరుగులు, అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా మూడు వేల పరుగులు చేసిన ఘనత అతనిదే. ముఖ్యంగా వన్డేల్లో గొప్ప ఆటతీరుతో సాగుతున్నాడు. ఇప్పటివరకూ 117 వన్డేల్లో 56.72 సగటుతో 5729 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలున్నాయి. ఇక 49 టెస్టుల్లో 3772 పరుగులు, 104 టీ20ల్లో 3485 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌-5లో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు అతనే. రెండేళ్ల పాటు వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగాడు. ఇటీవల శుభ్‌మన్‌ గిల్‌ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2019లో సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతను పాక్‌ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2021లో టెస్టు సారథ్యమూ స్వీకరించాడు. అతని కెప్టెన్సీలో టెస్టుల్లో 20కి గాను పాక్‌ 10 గెలిచింది. ఆరు ఓడింది. మరో నాలుగు డ్రా అయ్యాయి. కెప్టెన్‌గా 43 వన్డేల్లో 26 విజయాలు అందుకున్నాడు. 16 ఓటములు చూశాడు. ఓ మ్యాచ్‌ ఫలితం తేలలేదు. టీ20ల్లో అయితే అతని కెప్టెన్సీ రికార్డు మరింత గొప్పగా ఉంది. 71 మ్యాచ్‌ల్లో 42 విజయాలు, 23 ఓటములున్నాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో అత్యంత విజయవంతమైన సారథిగా అతనున్నాడు. అతని కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ ఫైనల్‌ చేరింది. 2021లో సెమీస్‌ వరకూ వెళ్లింది. ఆసియా కప్‌ ఫైనల్‌ చేరింది. వన్డేల్లో నంబర్‌వన్‌ ర్యాంకు అందుకుంది. అతని సారథ్యంలోనే పాక్‌ తొలిసారి ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించింది. 

ఇప్పుడిలా..

ఆటతో, నాయకత్వంతో ఉత్తమ ప్రదర్శన చేస్తూ సాగుతున్న బాబర్‌కు ఈ ప్రపంచకప్‌ సవాలు విసిరింది. ఇందులో జట్టును నడిపించడంలో అతను విఫలమయ్యాడు. మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ప్రత్యర్థి జట్లను కట్టడి చేయలేక చేతులెత్తేశాడు. సమర్థవంతంగా వ్యూహాలు అమలు చేయలేకపోయాడు. బౌలింగ్‌ మార్పు, ఫీల్డింగ్‌ కూర్పులోనూ ఆకట్టుకోలేదు. వికెట్లు రాక, పరుగులు పోతుంటే ఏం చేయలో తెలియని నిస్సహాయ స్థితిలో సహచర ఆటగాళ్లపై అరుస్తూ కనిపించాడు. వ్యక్తిగతంగానూ 9 మ్యాచ్‌ల్లో 320 పరుగులే చేసి నిరాశపరిచాడు. చివరకు 9 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు గెలిచి, అయిదింట్లో ఓడి పట్టికలో అయిదో స్థానంతో పాక్‌ సెమీస్‌కు దూరమైంది. అందులోనూ అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓటమి బాబర్‌ను మరింత దెబ్బతీసింది. దీంతో అతను కెప్టెన్‌గా తప్పుకోవాలని మాజీలు డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో కెప్టెన్‌గా ఏం నేర్చుకోలేదంటూ తప్పుబట్టారు. మరోవైపు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అండగా నిలవలేదు. ప్రపంచకప్‌ వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని కోరింది. బాబర్‌ తప్పుకోవడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా వ్యవహరించింది. ఇక ఇమాముల్‌ హక్, షాదాబ్‌ ఖాన్, మహమ్మద్‌ నవాజ్, హారిస్‌ రవూఫ్‌ లాంటి ఆటగాళ్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నా జట్టులో కొనసాగేలా బాబర్‌ పక్షపాతం చూపించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కెప్టెన్సీకే బాబర్‌ గుడ్‌బై చెప్పేశాడు. టెస్టుల్లో కొనసాగాలని బోర్డు కోరినా అతను వినలేదని తెలిపింది. అయితే ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతానని చెప్పాడు. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని