RCB vs CSK: బెంగళూరు Vs చెన్నై.. టాప్‌ - 10 మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌లు!

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) మరో ఆసక్తికర పోరు సిద్ధమవుతోంది. బెంగళూరు, చెన్నై జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 30 మ్యాచుల్లో ఇరు జట్లు తలపడగా.. ఆధిక్యం మాత్రం చెన్నై సూపర్‌ కింగ్స్‌దే (19). మరో వైపు బెంగళూరు (10) కొన్నిసార్లు మంచి పోటీనే ఇచ్చింది.

Updated : 17 Apr 2023 16:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) - రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఇంట్రెస్టింగే. బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ అయినా సరే.. ఇప్పటికీ అభిమానులకు మాత్రం కింగ్‌ కోహ్లీ (Virat Kohli)నే సారథి. ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టాలంటే  బెంగళూరు చెమటోడ్చాల్సిందే. మరి ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచులు జరగగా.. వాటిలో ఆసక్తికరమైన మ్యాచ్‌ల ఫలితాలను గురించి ఓసారి తెలుసుకుందాం.. 

  1. ఐపీఎల్‌ తొలి సీజన్‌ 2008లో 126 పరుగులను కాపాడుకొని మరీ చెన్నైపై బెంగళూరు విజయం సాధించింది. చెన్నైను కేవలం 112 పరుగులకే ఆలౌట్‌ చేసి మరీ 14 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలిచింది. 
  2. అదే సీజన్‌లో (2009) బెంగళూరుపై రెండు మ్యాచ్‌లు ఓడిన చెన్నై.. మూడో మ్యాచ్‌లో మాత్రం కసినంతా తీర్చేసుకుంది. తొలుత 179/5 స్కోరు సాధించగా.. అనంతరం బెంగళూరును 87 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 
  3. 2011 సీజన్‌లో  చెన్నై, బెంగళూరు నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. అయితే, తొలి ప్రిలిమినరీ మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 175/4 స్కోరు చేయగా.. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 177 పరుగులు చేసి విజయం సాధించింది. 
  4. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 2012 సీజన్‌లో ఈ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత ఆర్‌సీబీ 205/8 స్కోరు చేయగా.. చెన్నై సరిగ్గా 20 ఓవర్లలో 208/5 చేసి విజయం సాధించింది.
  5. 2013 సీజన్‌లో వర్షం కారణంగా 8 ఓవర్ల చొప్పున జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై బెంగళూరు విజయం సాధించింది. ఆర్‌సీబీపై చెన్నై తన అత్యల్ప (82/6) స్కోరును నమోదు చేయడం గమనార్హం.
  6. అంబటి రాయుడు (82) విశ్వరూపం చూపించడంతో 2018వ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై మరో రెండు బంతులు మాత్రమే మిగిలి ఉండగానే 206 పరుగులను ఛేదించింది. 
  7. ఒక్క పరుగు తేడాతో గెలుపోటములు తేలిపోతుంటాయి. సరిగ్గా 2019 ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇలాంటి మ్యాచ్‌ జరిగింది. చెన్నైపై ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 161/7 స్కోరు సాధించగా.. చెన్నై 160 పరుగులకే  పరిమితమై ఓటమిపాలైంది. 
  8. బెంగళూరు చరిత్రలో ఇదొక చెత్త రికార్డు నమోదైన మ్యాచ్‌. 2019 సీజన్‌లో ఇరు జట్లు మరోసారి తలపడగా.. చెన్నై బౌలర్ల దెబ్బకు బెంగళూరు 70 పరుగులకే కుప్పకూలింది. అనంతరం చెన్నై కూడా స్వల్ప లక్ష్య ఛేదన కోసం కష్టపడింది. 17.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలవడం గమనార్హం. 
  9. గతేడాది సీజన్‌లో (2022) బెంగళూరు - చెన్నై రెండు సార్లు తలపడ్డాయి. అందులో తొలిసారి చెన్నై 23 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 216/4 భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు కూడా చేరువగా వచ్చేందుకు ప్రయత్నించినా విజయం సాధించడంలో సఫలం కాలేదు. 
  10. మరో మ్యాచ్‌లో (ఐపీఎల్ 2022) ఆర్‌సీబీ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 173 పరుగులను ఛేదించడంలో చెన్నై (160/8) విఫలమైంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని