ODI WC 2023: బంగ్లాదేశ్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్.. వరల్డ్‌ కప్‌ నుంచి నోకియా ఔట్!

ప్రపంచ కప్‌ (ODi World Cup 2023) కోసం జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్‌ తన జట్టుకు ప్రత్యేకంగా టెక్నికల్‌ కన్సల్టెంట్‌ను నియమించుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టుకు గాయాల బెడద తప్పలేదు. ఇద్దరు కీలక పేసర్లు గాయాలతో దూరమయ్యారు.

Published : 21 Sep 2023 18:30 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ జట్టుకు టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. గతంలో బంగ్లాకు టీ20 ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం అతడికుంది. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీరామ్‌ను మా జట్టుకు టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించుకున్నాం. వరల్డ్ కప్‌లో అతడి సేవలను ఉపయోగించుకుంటాం’’ అని బంగ్లాదేశ్‌ బోర్డు డైరెక్టర్ ఖలీద్‌ మహమ్మద్ వెల్లడించారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముందు కూడా ఆ దేశం శ్రీరామ్‌ను ఇదే పదవిలో నియమించుకుంది. 


దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ

వన్డే ప్రపంచ కప్‌ ముంగిట దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక పేసర్లు ఆన్రిచ్‌ నోకియా, సిసిందా మగల గాయాల కారణంగా ప్రపంచకప్‌నకు దూరమయ్యారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా వన్డే టీమ్‌ ప్రధాన కోచ్‌ రాబ్ వాల్తెర్‌ తెలిపారు. వీరిద్దరి స్థానంలో ఆడిల్ పెహ్లూక్వాయో, లీజాద్‌ విలియమ్స్‌ను రిప్లేస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కీలకమైన పేసర్లు లేకపోవడం మమ్మల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. వారిద్దరూ నాణ్యమైన ఫాస్ట్‌ బౌలర్లు. అయితే, త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. పెహ్లూక్వాయో, లీజాద్‌కు అవకాశం కల్పించాం’ అని రాబ్‌ వ్యాఖ్యానించాడు. 


పాకిస్థాన్‌కు అవకాశాలు తక్కువే: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్

వచ్చే వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచే అవకాశాలు పాకిస్థాన్‌కు తక్కువగా ఉన్నాయని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు డొమినిక్‌ కార్క్ వ్యాఖ్యానించాడు. భారత్‌లా పూర్తిస్థాయి జట్టుతో పాక్‌ బరిలోకి దిగలేకపోతోందని పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లను చూశాం. పాక్‌ క్రికెట్‌ లీగ్‌తో ఆ జట్టు బలంగానే తయారైనట్లు అనిపించింది. అయితే, కీలకమైన సమయంలో భారత్‌ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో లంకను 50 పరుగులకే ఆలౌట్ చేసింది. మరోవైపు పాక్‌ మాత్రం సూపర్ -4 స్టేజ్‌కే పరిమితమైంది. భారత్ స్పిన్, పేస్, బ్యాటింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కానీ, పాకిస్థాన్‌ మాత్రం అలా ఉన్నట్లు కనిపించలేదు. అందుకే, వచ్చే ప్రపంచ కప్‌లోనూ పాక్‌కు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’ అని కార్క్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని