Cricket News: అభిమానికి షకిబ్ చెంపదెబ్బ.. ఇంగ్లాండ్‌ చెఫ్‌ను తెచ్చుకోనుండటంపై సెహ్వాగ్‌ కామెంట్!

Published : 08 Jan 2024 17:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మైదానంలో దూకుడుగా ఉండే బంగ్లా కెప్టెన్‌ షకిబ్.. బయటా అదే విధంగా ప్రవర్తించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. భారత్‌ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్‌ ప్రత్యేకంగా చెఫ్‌ను తెచ్చుకోనుండటంపై సెహ్వాగ్‌ సరదా కామెంట్.. హిందీ పాటకు క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్ డ్యాన్స్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

బంగ్లా ఎన్నికల సమయంలోనూ షకిబ్‌ అనుచిత ప్రవర్తన

బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ మరోసారి విమర్శలపాలయ్యాడు. మైదానంలో ఆవేశంగా ఉండే అతడు.. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగానూ ఓ అభిమానిని చెంప దెబ్బ కొట్టాడు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన ఓటును వినియోగించుకోవడానికి షకిబ్ పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లిన సమయంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో షకిబ్‌పై ఓ అభిమాని పడటంతో.. ఈ సీనియర్‌ క్రికెటర్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అతడి చెంపను చెళ్లుమనిపించాడు.


ఐపీఎల్‌లో ఇంగ్లాండ్‌కు అవసరం లేదు: సెహ్వాగ్

టీమ్‌ఇండియా పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్‌ జట్టు తమతోపాటు ప్రత్యేకంగా వంట చేసే వ్యక్తిని తీసుకు వస్తుందనే వార్తలపై ఇప్పటికే ఆకాశ్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా సరదాగా కామెంట్ చేశాడు. ‘‘కుక్‌ వెళ్లి పోవడంతో ఇంగ్లాండ్‌కు అవసరం పడింది. ఐపీఎల్‌లో మాత్రం అవసరం ఉండకపోవచ్చు’’ అని ఇంగ్లాండ్‌ మాజీ ఓపెనర్‌ అలెస్టర్‌ కుక్‌ లేకపోవడాన్ని ఉదహరిస్తూ సెహ్వాగ్‌ పోస్టు పెట్టాడు. నెలరోజులపాటు సాగే పర్యటనలో ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


కపిల్‌ దేవ్‌ సూపర్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన కపిల్‌.. అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తారన్న విషయం అభిమానులకు తెలిసేలా ప్రసారమైన వీడియో వైరల్‌గా మారింది. రెండు రోజుల కిందట తన 65వ పుట్టిన రోజును కపిల్ దేవ్‌ జరుపుకొన్న సంగతి తెలిసిందే. గతంలో తన సతీమణితో కలిసి హిందీ పాటకు కపిల్‌ దేవ్ కాలు కదిపిన వీడియోను తాజాగా ఓ అభిమాని తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని