BAN vs NZ: అప్పుడు ‘టైమ్‌డ్‌ ఔట్‌’ కలిసొచ్చింది.. ఇప్పుడు ‘హ్యాడ్లింగ్‌ ది బాల్‌’ కావాలని చేసింది కాదు: హసన్

‘ఫీల్డింగ్‌కు విఘాతం’ కలిగించి బంగ్లా సీనియర్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ ఔటైన సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున ఇలా పెవిలియన్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

Updated : 07 Dec 2023 10:53 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) శ్రీలంక సీనియర్‌ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌ ‘టైమ్‌డ్‌ ఔట్’ గుర్తుంది కదా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో (BAN vs NZ) మరో అరుదైన ఔట్‌ నమోదైంది. బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ ‘హ్యాడ్లింగ్‌ ది బాల్‌’ కారణంగా పెవిలియన్‌కు చేరాడు. బంగ్లా క్రికెట్‌ చరిత్రలో ఇలా ఔటైన తొలి ఆటగాడు ముష్ఫికర్‌. అయితే, తమ సీనియర్‌ ఆటగాడు ముందుగా అనుకొని బంతిని అడ్డుకోలేదని బంగ్లా స్పిన్నర్‌ మెహిదీ హసన్‌ పేర్కొన్నాడు. అప్పట్లో అరుదైన ‘టైమ్‌డ్‌ ఔట్’ నిర్ణయం తమకు కలిసొచ్చిందని.. తాజా ఘటనలో మాత్రం తాము వికెట్‌ను కోల్పోయినట్లు పేర్కొన్నాడు.

‘‘ముష్ఫికర్‌ కావాలని బంతిని అడ్డుకోలేదు. బ్యాటింగ్‌ చేసే క్రమంలో అనుకోకుండా చేతితో బంతిని ఆపాడు. ఉద్దేశపూర్వకంగా ఇలా ఔట్‌ కావాలని ఎవరూ అనుకోరు. మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పలు అంశాలను దృష్టిలోపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా బంతిని ఎదుర్కొన్న తర్వాత అది స్టంప్స్‌ మీదకు వస్తుందేమోనని భయపడ్డాడు. అలాంటి సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి. అయితే, చేతితో బంతిని నెట్టి ఔట్‌ కావాలని అతడేమీ అనుకోలేదు. అప్పటికప్పుడు అలా జరిగిపోయింది. వరల్డ్‌ కప్‌లో శ్రీలంక బ్యాటర్‌ ‘టైమ్‌డ్‌ ఔట్‌’ విషయంలో మాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. కానీ, ఈసారి అలా జరగలేదు’’ అని మెహిదీ వ్యాఖ్యానించాడు. 

పిచ్‌ పరిస్థితి మాకు తెలుసు..

‘‘మేం సరైన ప్రదేశంలో బంతిని విసిరితే న్యూజిలాండ్‌ బ్యాటర్లు ఇబ్బంది పడతారని తెలుసు. బ్యాటింగ్‌ సమయంలో వారి స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇక్కడి పిచ్‌ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. పిచ్‌ నుంచి సహకారం లభిస్తుండటంతో త్వరగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాం. అందులో ఇప్పటికే సగం విజయవంతమయ్యాం’’ అని మెహిదీ వెల్లడించాడు. కివీస్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో మెహిదీ మూడు, మరో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం రెండు తీశారు. 

న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ రెండో టెస్టు (BAN vs NZ) తొలి రోజే 15 వికెట్లు పడ్డాయి. అందులో 13 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 55/5 స్కోరుతో కొనసాగుతోంది. అంతకుముందు బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు