T10 League: ఇదేం బ్యాటింగ్‌ గురూ.. 43 బంతుల్లో 193 పరుగులా?

క్రికెట్‌లో రికార్డులు అధిగమించడం సహజమే. అయితే, ఒక్కో ఇన్నింగ్స్‌లో కేవలం 60 బంతులు మాత్రమే ఉండే టీ10 ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీనే కష్టమనుకుంటే.. సెంచరీతోపాటు ద్విశతకానికి కాస్త చేరువగా రావడం నెట్టింట వైరల్‌గా మారిపోయింది.

Updated : 08 Dec 2023 15:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  టీ10 మ్యాచ్‌ (T10 Match) .. పేరుకు తగ్గట్టుగానే ఫటాఫట్‌.. ధనాధన్‌ బాదుడే.. రికార్డులు కొల్లగొట్టుడే. కేవలం 60 బంతుల్లోనే ఇన్నింగ్స్‌ ముగిసిపోతుంది. టీ20 ఫార్మాట్‌కు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌ ఇది. ఇక్కడ క్రీజ్‌లో కుదురుకోవడాల్లేవు. వచ్చామా..? బాదామా? వెళ్లామా? అన్నట్లుగానే ఇన్నింగ్స్‌ సాగుతోంది. తాజాగా ఈ లీగ్‌లో ఒక బ్యాటర్‌ ఏకంగా 43 బంతుల్లోనే 193 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతడు కేవలం 24 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకడం గమనార్హం. ఇప్పుడా మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

యూరోపియన్‌ క్రికెట్ టీ10 లీగ్‌లో కాటలున్యా జాగ్వార్ (CJ), సోహల్ హాస్పిటల్టెట్(SH) జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీజే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 257 పరుగులు చేసింది. అందులో హమ్జా సలీమ్‌ దార్ (43 బంతుల్లో 193*) చెలరేగిపోయాడు. ఇందులో 22 సిక్స్‌లు, 14 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ10 క్రికెట్ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన లూయిస్‌ డు ప్లూయ్‌ను హమ్జా అధిగమించాడు. అంతకుముందు లూయిస్‌ 163 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో హమ్జా యూరోపియన్‌ టీ10 లీగ్‌లో 3వేలకుపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఎస్‌హెచ్‌ 10 ఓవర్లలో 104/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో 153 పరుగుల భారీ తేడాతో జాగ్వార్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హమ్జాతోపాటు యాసిర్‌ అలీ కేవలం 19 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఎస్‌హెచ్‌ జట్టుకు చెందిన బౌలర్ వారిస్‌ ఒక్క ఓవర్‌లోనే 43 పరుగులు ఇవ్వడం గమనార్హం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని