ODI World Cup 2023: మరో సెంచరీ మిస్‌... ‘100’ అందుకోలేకపోతున్నారు!

ప్రపంచకప్‌  (ODI World Cup 2023) లాంటి మెగా టోర్నీలో సెంచరీ చేసినా.. అయిదు వికెట్లు తీసినా దాని విలువే వేరు. తాజా ప్రపంచకప్‌లో బ్యాటర్లు సెంచరీ ముంగిట తడబడుతున్నారు. కొద్దిలో శతకాన్ని కోల్పోయి నిరుత్సాహంగా వెనుదిరుతున్నారు.

Published : 08 Nov 2023 17:30 IST

క్రికెట్‌లో ఓ బ్యాటర్‌ అద్భుతంగా రాణించాడని చెప్పడానికి సెంచరీ ఓ ప్రామాణికం. బౌలర్‌ అదరగొట్టాడని తెలుసుకోవడానికి అయిదు వికెట్ల ప్రదర్శన ఓ రుజువు. అయితే ప్రపంచకప్‌  (ODI World Cup 2023) లాంటి మెగా టోర్నీలో సెంచరీ చేసినా.. అయిదు వికెట్లు తీసినా దాని విలువే వేరు. తాజా ప్రపంచకప్‌లో బ్యాటర్లు సెంచరీ ముంగిట తడబడుతున్నారు. కొద్దిలో శతకాన్ని కోల్పోయి నిరుత్సాహంగా వెనుదిరుతున్నారు. ఇందులో భారత బ్యాటర్లే ముందు వరుసలో ఉన్నారు. విరాట్‌ కోహ్లి (Virat Kohli) మూడుసార్లు, రోహిత్‌శర్మ  (Rohit Sharma) మూడుసార్లు సెంచరీ ముంగిట ఔటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. తాజాగా ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ మలన్‌ (87) సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

కోహ్లి తడబాటు

ఛేదనలో సెంచరీ చేయడంలో కోహ్లి మొనగాడు. అతడు సాధించిన శతకాల్లో ఛేజింగ్‌లో చేసినవే ఎక్కువ. అలాంటిది ఈ ప్రపంచకప్‌లో ఛేజింగ్‌లో రెండుసార్లు మూడంకెలు అందుకోలేకపోయాడు విరాట్‌. మొత్తం మీద మూడుసార్లు 100 మార్కు దాటడంతో విఫలమయ్యాడు. కచ్చితంగా శతకం బాదుతాడు అనుకున్న సందర్భంలోనూ అభిమానులను నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఛేదనలో విరాట్‌ 85 పరుగుల ఇన్నింగ్స్‌తో అబ్బురపరిచాడు. ఇక శతకం బాదడమే తరువాయి అనుకునేలోపు పెవిలియన్‌ చేరిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో పోరులో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చాలారోజుల తర్వాత ప్రపంచకప్‌ సెంచరీ సాధించాడు కింగ్‌.

అతడాడిన మూడు ప్రపంచకప్పుల్లో ఇది మూడో సెంచరీ మాత్రమే. అయితే ఈ ఒక్క ప్రపంచకప్‌లోనే మరో మూడు శతకాలు చేసే అవకాశాన్ని విరాట్‌ కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో పోరులో వీరోచిత ఇన్నింగ్స్‌ విరాట్‌ 95 పరుగుల వద్ద ఒత్తిడికి గురై ఓ చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. సెంచరీకి అతి సమీపంగా వచ్చిన ఇన్నింగ్స్‌ ఇది. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాలన్న అతడి దృక్పథం శతకం కాకుండా అడ్డుకుంది. ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌.. అప్పటికే భారత్‌ మంచి స్థితిలో ఉంది. అయినా కూడా ఓ అనసవరమైన షాట్‌తో వికెట్‌ ఇచ్చుకున్నాడు విరాట్‌. అభిమానులను బాగా నిరాశపరిచాడు. ఓ సాధారణ చెకింగ్‌ షాట్‌తో వికెట్‌ చేజార్చుకున్నాడు.

రోహిత్‌ కూడా

రోహిత్‌ది కూడా కోహ్లి లాంటి పరిస్థితే. అతడి ఆట కూడా అచ్చం విరాట్‌ మాదిరే సాగుతోంది. ఈ టోర్నమెంట్లో అద్భుత ఇన్నింగ్స్‌లతో అలరించిన ఈ స్టార్‌ ఓపెనర్‌.. మూడుసార్లు శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గొప్పగా ఆడి ఇన్నింగ్స్‌కు పునాది వేసిన రోహిత్‌.. 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత అఫ్గానిస్థాన్‌పై 131 పరుగులు చేసి ఈసారి టోర్నీలో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రెండుసార్లు శతకం చేసే ఛాన్స్‌ చేజార్చుకున్నాడు రోహిత్‌. పాకిస్థాన్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడినా 86 పరుగుల వద్ద వెనుదిరిగిన ఈ ఓపెనర్‌.. ఇంగ్లాండ్‌పైనా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను 87 పరుగుల వద్దే ముగించాడు. రోహిత్, కోహ్లితో పాటు మరో స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ (97 నాటౌట్‌) కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. సెంచరీ చేసే ఛాన్స్‌ ఉన్నా.. సిక్స్‌కు బదులు ఫోర్‌ వెళ్లడంతో ఉసూరుమన్నాడు. భారత యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌ (92), శ్రేయస్‌ అయ్యర్‌ (82) కూడా సెంచరీ ముంగిట ఔటయ్యారు. 

వేరే జట్లలోనూ

భారత బ్యాటర్లు మాత్రమే కాదు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (95) త్రుటిలో మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన అతడు గొప్పగా ఆడినా ఈ విషయంలో బోల్తా పడ్డాడు. మార్‌క్రమ్‌ (91 పరుగులు, పాకిస్థాన్‌పై), వార్నర్‌ (81, కివీస్‌పై), క్లాసెన్‌ (90, బంగ్లాదేశ్‌), రచిన్‌ రవీంద్ర (97, పాకిస్థాన్‌పై) శతకాలు చేజార్చుకున్న బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు షకీబ్‌ అల్‌ హసన్‌ (82), నజ్ముల్‌ శాంటో (90) కూడా శతకాలను చేజార్చుకున్నారు. కొసమెరుపు ఏంటంటే దక్షిణాఫ్రికా స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ అందరికంటే భిన్నం. ఈ టోర్నీలో 50 దాటిన ప్రతిసారీ ఈ ఓపెనర్‌ సెంచరీ బాదేశాడు. ఏకంగా 4 శతకాలు ఖాతాలో వేసుకున్నాడు.

కొన్ని 80లు 100 కంటే ఎక్కువ అంటారు క్రికెట్లో.. ఇప్పుడు అభిమానులు కూడా భారత ఆటగాళ్లు సెంచరీలు మిస్‌ అయిన ప్రతిసారి సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులే పెడుతున్నారు. కొంతమంది మాత్రం మ్యాచ్‌లు గెలిస్తే చాలు.. శతకాలు అవసరం లేదని అంటున్నారు. అయితే 80, 90ల్లో ఔటైతే నిజానికి బ్యాటర్‌కే కాదు అభిమానులకు కూడా ఏదో వెలితి. అంత దూరం వచ్చి ఈ మైలురాయిని దాటలేదే అనే అసంతృప్తి. అందులోనూ ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో సెంచరీలు చేసే అవకాశం ప్రతిసారీ రాదు. ముఖ్యంగా కెరీర్‌ చరమాంకంలో ఉన్న కోహ్లి, రోహిత్‌కు ఈ టోర్నీయే సువర్ణావకాశం. మున్ముందు మ్యాచ్‌ల్లో ఈ స్టార్లు 80లను 100లుగా మారుస్తారో లేదో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు