BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ కొనసాగింపు

భారత్ ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను (Rahul Dravid) కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Updated : 29 Nov 2023 14:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు భారత క్రికెట్‌ (Team India) జట్టు ప్రధాన కోచ్‌ పదవిపై ఉత్కంఠ వీడింది. ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అంగీకరించాడు. దీంతో బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. రాహుల్‌తోపాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. దీని ప్రకారం బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌కు పొడిగింపు లభించినట్లైంది. అయితే, వీరు ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్నాయి. 

ద్రవిడ్‌ స్పందన ఇదీ.. 

‘‘టీమ్‌ఇండియాతో గత రెండేళ్ల ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశాం. మేనేజ్‌మెంట్‌తోపాటు జట్టు నుంచి ఎంతో సహకారం లభించింది. డ్రెస్సింగ్‌ రూంలో సృష్టించిన వాతావరణం పట్ల గర్వంగా ఉంది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మేం సరైన దారిలోనే ఉన్నాం. మా సన్నద్ధతపై స్పష్టత ఉంది. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా విజన్‌ పట్ల విశ్వాసంతో మద్దతుగా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ ముందు జట్టుగా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డాం. ఆ సమయంలోనూ బీసీసీఐ మద్దతును మరువలేం. జట్టు కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. నా కోసం కుటుంబ సభ్యులు చాలా త్యాగాలు చేశారు. వారి మద్దతును ఎప్పుడూ మరిచిపోలేను’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా రాహుల్ ద్రవిడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వన్డే ప్రపంచ కప్‌ తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని అదే పదవిలో కొనసాగమని క్రికెట్ మాజీలు, బీసీసీఐ పెద్దలు కొంతకాలంగా అడుగుతూనే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగర్కార్‌ కూడా ఇదే కోరుకున్నారు. తొలుత విముఖత చూపిన ద్రవిడ్‌.. చివరికి అంగీకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని