Ajit Agarkar: లార్డ్స్‌లో ‘శతక్కొట్టిన’ అగార్కర్.. టీమ్‌ఇండియా చీఫ్‌ సెలక్టర్‌ రికార్డులివే..!

భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ (Ajit Agarkar) నియమితుడయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అగార్కర్‌ నెలకొల్పిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Updated : 06 Jul 2023 13:15 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ (Ajit Agarkar) భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 1998-2007 మధ్య 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడిన అగార్కర్‌.. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు. 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టు సభ్యుడు. 2007లో ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులోనూ అతడు ఆడాడు. అజిత్ అగార్కర్ ప్రధానంగా బౌలర్‌ అయినప్పటికీ.. అప్పుడప్పుడు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అజిత్ పేరిట ఉన్న రికార్డుల (Records)పై ఓ లుక్కేద్దాం. 

  •  లార్డ్స్‌ టెస్టులో శతకం: 2002లో లార్డ్స్‌ ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్‌ (109; 190 బంతుల్లో 16 ఫోర్లు) శతకం బాదాడు. ఈ క్రమంలోనే లార్డ్స్‌ మైదానంలో సెంచరీ బాదిన అతి కొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.
  • వన్డే క్రికెట్‌లో భారత్‌ తరఫున వేగవంతమైన అర్ధ శతకం బాదిన రికార్డు అజిత్ అగార్కర్‌ పేరిటే ఉంది. 2000లో జింబాబ్వేపై 21 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 7 ఫోర్ల సాయంతో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు.  
  • వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 23 మ్యాచ్‌ల్లోనే అగార్కర్‌ ఈ ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు.
  •  వన్డే క్రికెట్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసి 50 వికెట్లు, 50 క్యాచ్‌లు అందుకున్న ఎనిమిది మంది భారత క్రికెటర్లలో అజిత్ అగార్కర్‌ ఒకడు.
  •  వన్డేల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసి 100కుపైగా వికెట్లు పడగొట్టిన 10 మంది భారత ఆటగాళ్ల జాబితాలో అగార్కర్‌ ఉన్నాడు.
  • 2004లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ ఓవల్‌ మైదానంలో 6/41తో అగార్కర్‌ సత్తా చాటాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే ఏకైక ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
  • టెస్టు క్రికెట్‌లో వరుసగా ఐదుసార్లు డకౌట్‌ అయిన చెత్త రికార్డు కూడా ఇతని పేరిట ఉంది. ఈ ఐదుసార్లు ఆసీస్‌పైనే కావడం గమనార్హం. బాబ్ హాలండ్, మహ్మద్‌ ఆసిఫ్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని