BCCI: ఐపీఎల్‌ మైదాన సిబ్బందికి బీసీసీఐ నజరానా

ఐపీఎల్‌-17 విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన మైదాన సిబ్బంది, క్యురేటర్లను బీసీసీఐ ప్రశంసించింది.

Published : 28 May 2024 02:47 IST

దిల్లీ: ఐపీఎల్‌-17 విజయవంతం కావడంలో తెర వెనుక పాత్ర పోషించిన మైదాన సిబ్బంది, క్యురేటర్లను బీసీసీఐ ప్రశంసించింది. వీరి సేవలకు గుర్తింపుగా ఒక్కో మైదానానికి రూ.25 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించింది. ‘‘మైదాన సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఐపీఎల్‌ విజయవంతం అయింది. క్లిష్టమైన వాతావరణంలోనూ వాళ్లు గొప్ప పిచ్‌లను తయారు చేశారు. 10 రెగ్యులర్‌ మైదానాలకు రూ.25 లక్షల చొప్పున నజరానాగా ఇస్తున్నాం. అదనపు వేదికలుగా నిలిచిన మూడు మైదానాలకు రూ.10 లక్షల చొప్పున బహుమతి అందిస్తాం’’ అని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పాడు. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్, హైదరబాద్, బెంగళూరు, లఖ్‌నవూ, అహ్మదాబాద్, జైపుర్‌ వేదికలు ఐపీఎల్‌-17లో రెగ్యులర్‌ మ్యాచ్‌లను నిర్వహించాయి. వీటికి తోడు విశాఖపట్నం, గువాహాటి, ధర్మశాలల్లో కొన్ని మ్యాచ్‌లు జరిగాయి. దిల్లీకి విశాఖ.. రాజస్థాన్‌కు గువాహాటి.. పంజాబ్‌కు ధర్మశాల రెండో సొంత వేదికలుగా నిలిచాయి. 


ఆసీస్‌కు తొమ్మిదిమందే మిగిలారు!

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టుపై ఐపీఎల్‌ ప్రభావం పడింది. వార్మప్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టుకు ఆటగాళ్ల కొరత వచ్చింది. ప్రస్తుతానికి తొమ్మిదిమందే జట్టులో ఉన్నారు. ఆదివారం ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడిన కమిన్స్, ట్రావిస్‌ హెడ్‌ (హైదరాబాద్‌), మిచెల్‌ స్టార్క్‌ (కోల్‌కతా)తో పాటు మ్యాక్స్‌వెల్, కామెరూన్‌ గ్రీన్‌ (బెంగళూరు), స్టాయినిస్‌ (లఖ్‌నవూ) ఇంకా బార్బడోస్‌ చేరుకోలేదు. జూన్‌ 5న ఓమన్‌తో తొలి గ్రూప్‌ మ్యాచ్‌ నాటికల్లా వీళ్లు జట్టుతో కలిసే అవకాశం ఉంది. దీనికి తోడు గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌ చేసే పరిస్థితుల్లో లేడు. ఈ నేపథ్యంలో కోచింగ్‌ సిబ్బంది బ్రాడ్‌ హాడ్జ్, ఆండ్రూ మెక్‌డొనాల్డ్, జార్జ్‌ బెయిలీ, ఆండ్రీ బోర్‌విచ్‌లను ఫీల్డింగ్‌ చేయడానికి జట్టులో చేర్చే అవకాశం ఉంది. మంగళవారం నమీబియా.. గురువారం వెస్టిండీస్‌తో ఆసీస్‌ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది.


కోచ్‌ రేసులో ఎవరు?

దిల్లీ: బీసీసీఐ ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేయడానికి సోమవారంతో గడువు ముగిసింది. ఈ పదవి కోసం చాలా రోజులుగా గౌతమ్‌ గంభీర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గంభీర్‌ మెంటర్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంతో అతడిపై ఆసక్తి ఇంకా పెరిగింది. కానీ అతడు దరఖాస్తు చేశాడా లేదా అన్నది మాత్రం తెలియట్లేదు. బీసీసీఐ నుంచి గానీ, గంభీర్‌ నుంచి గానీ ఈ విషయంపై స్పందన లేదు. కానీ ప్రస్తుతానికి బీసీసీఐ ముందు అంతగా మెరుగైన ప్రత్యామ్నాయాలు లేవని తెలుస్తోంది. పేరున్న విదేశీయులెవరూ దరఖాస్తు చేసుకోలేదని కూడా అర్థమవుతోంది. ముఖ్యంగా కింది నుంచి ఎదిగి, దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేసిన నేపథ్యంలో విదేశీయుల నుంచి పెద్దగా స్పందన రాలేదని భావిస్తున్నారు. బీసీసీఐ ప్రధాన లక్ష్యం జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అని భావించవచ్చు. కానీ లక్ష్మణ్‌కు ఆసక్తి లేదని అనిపిస్తోంది.


అంకుషిత గెలుపు

బ్యాంకాక్‌: బాక్సింగ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో ప్రపంచ మాజీ యూత్‌ ఛాంపియన్‌ అంకుషిత బోరో శుభారంభం చేసింది. సోమవారం 60 కిలోల విభాగంలో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో భారత యువ బాక్సర్‌ అంకుషిత 4-1తో నమున్‌ మోంకోర్‌ (మంగోలియా)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి బాక్సర్‌ దూకుడు ప్రదర్శించినా వ్యూహాత్మకంగా వ్యవహరించిన బోరో అదును చూసి నమున్‌పై పిడిగుద్దులు విసిరింది. మూడు రౌండ్ల పాటు ఆమెదే ఆధిపత్యం. మరో మ్యాచ్‌లో భారత బాక్సర్‌ అభిమన్యు (80 కిలోలు)కు నిరాశ ఎదురైంది. 0-5తో క్రిస్టియన్‌ నికోలోవ్‌ (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు