T20 WC 2024: న్యూయార్క్‌ పిచ్‌పై బీసీసీఐ అనధికారిక ఫిర్యాదు!

న్యూయార్క్‌ పిచ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అనూహ్యమైన బౌన్స్‌తో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదని క్రికెటర్లు వాపోతున్నారు.  

Published : 08 Jun 2024 17:21 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) మరొక్క రోజులో భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) సమరం జరగనుంది. ఇటువంటి సమయంలో న్యూయార్క్‌ పిచ్‌ తీరుపై ఐసీసీకి ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి. అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లు గాయాలపాలయ్యే అవకాశం ఉందని... బీసీసీఐ నుంచే అనధికారికంగా కంప్లైట్‌ వెళ్లినట్లు సమాచారం. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. హాఫ్ సెంచరీ ముగిసిన తర్వాత పెవిలియన్‌కు చేరాడు. నెట్స్‌లోనూ తీవ్ర ఇబ్బందిపడినట్లు కథనాలు వెలువడ్డాయి. రోహిత్‌ మాత్రమే కాకుండా.. విరాట్ కోహ్లీకీ ఇలాంటి పరిస్థితే ఎదురైందని అందులో పేర్కొన్నాయి. 

నెట్‌ ప్రాక్టీస్‌లో రోహిత్‌కు గాయం!

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయం కారణంగా మైదానాన్ని వీడిన రోహిత్.. ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనూ గాయమైనట్లు వార్తలు రావడం అభిమానులను కలవరానికి గురి చేసింది. అతడి బొటనవేలికి గాయం అయినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అది ఏమంత ప్రమాదకరం కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఫిజియో వైద్యచికిత్స అందించారు. కాసేపటికే రోహిత్ మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కావడంతో ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే భావనలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. 

రెండుసార్లు మాత్రమే.. 

టీ20 క్రికెట్‌ అంటేనే బ్యాటర్ల దూకుడు ఉంటుంది. కానీ, యూఎస్‌ఏలోని న్యూయార్క్‌ పిచ్‌ వేదికగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. కేవలం రెండుసార్లు మాత్రమే 100+ స్కోర్ మార్క్‌ను తాకడం గమనార్హం. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడం బాగున్నప్పటికీ.. బ్యాటర్లూ దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉండాలి. అమెరికాలో క్రికెట్ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తక్కువ స్కోర్లు నమోదైతే మ్యాచ్‌లను ప్రేక్షకులు ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడరనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని