ODI WC 2023: మినరల్‌ వాటర్‌ ఫ్రీ.. టీమ్‌ఇండియాకు ఆల్‌ ది బెస్ట్‌.. ఈసారి కూడా మాదే కప్‌!

Published : 05 Oct 2023 14:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ (ODI WC 2023) సంగ్రామం మొదలైంది. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక ప్రకటన వెల్లడించారు. అలాగే టీమ్‌ఇండియాకు ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ ట్వీట్‌ చేశాడు. ఈసారి కూడా తమ జట్టే గెలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి వరల్డ్‌ కప్ విశేషాలు మీ కోసం.. 

ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్‌: జైషా

ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మినరల్‌ వాటర్‌ అందజేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అహ్మదాబాద్‌ వేదికగా  ఇవాళ ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. మొత్తం పది మైదానాల్లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా జైషా ‘‘వరల్డ్‌ కప్‌ సందడి మొదలైంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తున్నా. భారత్‌లోని వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే అన్ని మైదానాల్లో ప్రేక్షకులకు ఉచితంగా మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తాం. ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను అందజేస్తాం. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌లను ఆస్వాదించాలి’’ అని ట్వీట్ చేశారు.


భారత క్రికెట్ జెర్సీలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

వరల్డ్‌ కప్‌లో భారత్ పోరాటం అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్‌ డ్రూ మెక్‌ఇంటైర్ ట్విటర్‌లో ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. భారత్‌ ఆతిథ్యం, అభిమానం అద్భుతమని వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ నాయకత్వంలోని భారత జట్టుకు వరల్డ్‌ కప్‌లో మంచి జరగాలి. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఆతిథ్యం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది’’ అని ట్వీట్ చేశాడు. గత సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మెక్‌ఇంటైర్‌ పాల్గొన్నాడు. 


మా జట్టే మళ్లీ ఛాంపియన్‌: మైకెల్ వాన్

వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌ (ENG vs NZ) తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. టాస్‌ నెగ్గిన కివీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ సారథి మైకెల్ వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. మరోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం వారి ముందుంది. ఇంగ్లాండ్‌ తప్పకుండా విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆటగాళ్లలో ప్రతి ఒక్కరూ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో కీలకమైన ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు’’ అని మైకెల్ వాన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు