ODI WC 2023: ఆ రెండు మైదానాల్లోని మ్యాచుల్లో ఇక ‘నో ఫైర్‌వర్క్స్‌’!

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు మైదానాల్లో జరగనున్న మ్యాచుల తర్వాత ఎలాంటి క్రాకర్స్‌ కాల్చకూడదని నిర్ణయించింది.

Updated : 01 Nov 2023 11:45 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World cup 2023) ఏదైనా జట్టు మ్యాచ్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాచ్‌ మధ్యలో అభిమానుల కోసం లైటింగ్‌ షో కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు కానీ క్రాకర్స్‌ను కాల్చడం వల్ల మాత్రం కాలుష్యం పెరుగుతున్నట్లు కొందరి వాదన. అత్యంత దారుణంగా గాలి కాలుష్యం ఉండే దిల్లీ, ముంబయి ప్రాంతాల్లో ఈ టపాసులను పేల్చడం వల్ల ఇంకాస్త వాతావరణానికి హాని చేసినట్లే అవుతుందని అభిమానుల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీంతో ఈ రెండు మహా నగరాల్లోని మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బ్యాన్‌ విధిస్తున్నట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. 

‘‘వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం అధికారికంగా ఐసీసీ వద్దకు తీసుకెళ్లాం. వారు కూడా అంగీకరించారు. దీంతో ముంబయి, దిల్లీ మైదానాల వద్ద టపాసుల ప్రదర్శన నిర్వహించడం లేదు. వాతావరణ సమస్యలపై  బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్‌కు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందులో భాగంగా ఫైర్‌వర్క్స్‌ను నిలిపివేస్తున్నాం ’’ అని జైషా తెలిపారు. 

ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం దిల్లీ వేదికగా నవంబర్ 6న ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడతాయి. ముంబయి వేదికగా ఇంకా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ - శ్రీలంక మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ కూడా ఉంది. ఈ రెండు మాత్రమే కాకుండా తొలి సెమీస్‌కు వేదిక కూడా ముంబయిలోని వాంఖడే మైదానమే. దీంతో ఈ మైదానాల్లో క్రాకర్స్‌ సందడి ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని