Rohit Sharma: మరి రోహిత్‌?

దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్‌ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాలని రోహిత్‌ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓడినప్పటి నుంచి రోహిత్‌ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

Updated : 30 Nov 2023 13:02 IST

టీ20లు ఆడతాడా!
దక్షిణాఫ్రికా పర్యటనకు జట్ల ఎంపిక నేడే

దిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్‌ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్‌కు నాయకత్వం వహించాలని రోహిత్‌ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ఓడినప్పటి నుంచి రోహిత్‌ పొట్టి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్ల గురించి చర్చించడంతోపాటు టీ20 ప్రపంచకప్‌కు మార్గసూచీని తయారు చేయడానికి బీసీసీఐ కార్యదర్శి, సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ జై షా.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌తో సమావేశం కానున్నాడు. రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో మరో నెలపాటు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో.. బోర్డు ఇప్పుడు చేయాల్సింది సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంచుకోవడం లేదా రోహిత్‌ నాయకత్వ పటిమను నమ్మడమే.

టీ20 ఫార్మాట్లో ఆడాలనుకోవట్లేదని రోహిత్‌ ఇంతకుముందే చెప్పాడు. కానీ వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ జట్టును నడిపించిన తీరు చూశాక.. టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు పొట్టి క్రికెట్లో కొనసాగితేనే బాగుంటుందన్న భావనతో బీసీసీఐ ఉంది. ‘‘హార్దిక్‌ వస్తే పరిస్థితేంటన్న ప్రశ్న ఉంటుందనుకోండి. కానీ దక్షిణాఫ్రికాతో టీ20లకు జట్టుకు నాయకత్వం వహించేందుకు రోహిత్‌ అంగీకరిస్తే.. టీ20 ప్రపంచకప్‌లోనూ అతడే జట్టును నడిపిస్తాడు. ఒకవేళ రోహిత్‌ ఒప్పుకోకపోతే దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20 జట్టుకు సూర్యకుమార్‌ సారథ్యం వహిస్తాడు. ఇక దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లో కోహ్లి ఆడబోవట్లేదు. అతడు విశ్రాంతి కోరాడు. వచ్చే ఐపీఎల్‌లో ఎలా ఆడతాడన్నదానిపైనే కోహ్లి టీ20 ప్రపంచకప్‌లో ఆడడం ఆధారపడి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. డిసెంబరు 10న తొలి టీ20తో పర్యటన మొదలవుతుంది.

శ్రేయస్‌, రాహుల్‌ పునరాగమనం: దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టులో ఎలాంటి ఆశ్చర్యాలు ఉండే అవకాశం లేదు. సుదీర్ఘ విరామానంతరం శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేస్తారు. రహానెపై వేటు పడొచ్చు. పుజారాకు అవకాశం లేనట్లే. విదేశీ పరిస్థితుల్లో ఎప్పటిలాగే జడేజా తొలి ప్రాధాన్య స్పిన్నర్‌గా జట్టులోకి వస్తాడు. అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని