Bengaluru Vs Rajasthan: ఈ సాలా కన్నీళ్లే!

ఐపీఎల్‌-17లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం ఎలిమినేటర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడింది.

Updated : 23 May 2024 06:49 IST

ఐపీఎల్‌-17 నుంచి ఔట్‌
మెరిసిన అశ్విన్, యశస్వి, పరాగ్‌
రాజస్థాన్‌ చేతిలో బెంగళూరు ఓటమి 

ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగు.. వరుసగా ఆరు విజయాలతో సంచలనం.. జోరుమీద జట్టు.. దీంతో ‘‘ఈ సాలా కప్‌ నమ్‌దే’’ అని అభిమానుల్లో ధీమా! కానీ లీగ్‌ దశలో చూపిన పోరాట పటిమను.. ప్లేఆఫ్స్‌లో చూపించలేకపోయింది ఆర్సీబీ. ఆ జట్టు జైత్రయాత్రకు ఎలిమినేటర్‌లో బ్రేక్‌ పడింది. అభిమానులకు మళ్లీ ఆవేదనే మిగిలింది. 

వరుసగా అయిదు (ఒకటి వర్షార్పరణం) మ్యాచ్‌ల్లో గెలుపన్నదే లేకుండా లీగ్‌ దశను ముగించిన రాజస్థాన్‌.. కీలక పోరులో జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆర్సీబీ ఆశలను కూల్చింది. ఎలిమినేటర్‌లో విజయంతో ఆ జట్టు క్వాలిఫయర్‌-2కు చేరగా.. ఓటమితో బెంగళూరు కథ ముగిసింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చెపాక్‌లో  సన్‌రైజర్స్‌తో రాజస్థాన్‌ తలపడుతుంది.

అహ్మదాబాద్‌

పీఎల్‌-17లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం ఎలిమినేటర్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (34; 22 బంతుల్లో 2×4, 2×6), కోహ్లి (33; 24 బంతుల్లో 3×4, 1×6), మహిపాల్‌ లొమ్రార్‌ (32; 17 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనిపించారు. అశ్విన్‌ (2/19), అవేష్‌ ఖాన్‌ (3/44), బౌల్ట్‌ (1/16) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. యశస్వి జైస్వాల్‌ (45; 30 బంతుల్లో 8×4), రియాన్‌ పరాగ్‌ (36; 26 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. సిరాజ్‌ (2/33) మెరిశాడు.

ఒత్తిడిని దాటి..: ఛేదనలో రాజస్థాన్‌కు తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులే వచ్చాయి. కానీ ఆర్సీబీ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో ఆ జట్టు ఓపెనర్లు చెలరేగారు. యశ్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ క్యాచ్‌ను గ్రీన్‌ పట్టలేకపోయాడు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లతో అతను దూకుడు ప్రదర్శించాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ వేగాన్ని అందుకుంది. యశ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కాడ్మోర్‌ (20) ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ వదిలేశాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే ఆర్సీబీకి పట్టు బిగించే అవకాశం దక్కేది. ఆ వెంటనే స్లో యార్కర్‌తో కాడ్మోర్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేసినా.. శాంసన్‌ (17) జతగా జైస్వాల్‌ బౌండరీల వేటలో సాగిపోయాడు. అప్పుడు బౌలింగ్‌ మార్పు ఆర్సీబీకి కలిసొచ్చింది. గ్రీన్‌ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించిన జైస్వాల్‌ వికెట్‌కీపర్‌కు చిక్కాడు. ఆ వెంటనే శాంసన్‌ను కర్ణ్‌ తెలివిగా బోల్తాకొట్టించడంతో ఆర్సీబీ పోటీలోకి వచ్చింది. శాంసన్‌ క్రీజు వదిలి ముందుకు రావడాన్ని గమనించిన కర్ణ్‌.. బంతిని వైడ్‌లైన్‌కు దగ్గరగా వేశాడు. శాంసన్‌ అది ఆడలేకపోవడం, దినేశ్‌ కార్తీక్‌ స్టంప్స్‌ ఎగరగొట్టడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత కోహ్లి అద్భుతమే చేశాడు. లెగ్‌సైడ్‌ బంతిని పంపించిన పరాగ్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ చిరుతలా పరుగెత్తి బంతి అందుకున్న కోహ్తి మెరుపు వేగంతో త్రో విసిరాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంతిని అందుకున్న గ్రీన్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. కేవలం మిల్లిమీటర్ల తేడాతో జూరెల్‌ (8) రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి స్థానంలో మరే ఫీల్డర్‌ ఉన్నా కూడా రెండు పరుగులు వచ్చేవనే చెప్పాలి. రాజస్థాన్‌ విజయ సమీకరణం 30 బంతుల్లో 47 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ గ్రీన్‌ వేసిన తర్వాతి ఓవర్‌తోనే రాజస్థాన్‌ విజయం ఖాయమైపోయింది. తొలి బంతికే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ హెట్‌మయర్‌ (26) సిక్సర్‌ కొట్టగా.. ఆ తర్వాత పరాగ్‌ వరుసగా 6, 4 బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో హెట్‌మయర్‌ రెండు ఫోర్లు రాబట్టాడు. సమీకరణం 18 బంతుల్లో 19 పరుగులుగా మారింది. కానీ 18వ ఓవర్లో పరాగ్, హెట్‌మయర్‌ను ఔట్‌చేసిన సిరాజ్‌ 6 పరుగులే ఇచ్చి ఆశలు రేపాడు. కానీ ఫెర్గూసన్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో పావెల్‌ (16 నాటౌట్‌) పని పూర్తిచేశాడు.

పడగొట్టి..: అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఊపందుకుంటుంది, బౌండరీలు వస్తున్నాయనే సమయంలోనే వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ కళ్లెం వేసింది. ఆరంభంలో బౌల్ట్, మధ్యలో అశ్విన్, ఆఖర్లో అవేష్‌ కట్టడి చేశారు. మందకొడి పిచ్‌పై కొత్త బంతితో బౌల్ట్‌ హడలెత్తించాడు. 3-0-6-1.. ఇవీ పవర్‌ప్లేలో అతని గణాంకాలు. బౌల్ట్‌ ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ముందుకు డైవ్‌ చేస్తూ పావెల్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో డుప్లెసిస్‌ (17) నిష్క్రమించాడు. అయినా పవర్‌ప్లేలో జట్టు 50 పరుగులు చేసిందంటే కోహ్లీనే కారణం. సందీప్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో జట్టు బౌండరీల ఖాతా తెరిచిన అతను.. అవేష్‌ఓవర్లో సిక్సర్‌ కొట్టాడు. కానీ స్పిన్నర్ల రాకతో బెంగళూరు ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన గ్రీన్‌ (27) సౌకర్యవంతంగా కనిపించలేదు. చాహల్‌ ఓవర్లో స్లాగ్‌స్వీప్‌కు ప్రయత్నించిన కోహ్లి డీప్‌ మిడ్‌వికెట్లో ఫీల్డర్‌కు చిక్కడంతో ఆర్సీబీకి షాక్‌ తగిలింది. ఈ దశలో చాహల్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4తో గ్రీన్‌ వేగం పెంచేందుకు ప్రయత్నించాడు. 11 ఓవర్లలో స్కోరు 82/2. గేరు మార్చాల్సిన దశలో అశ్విన్‌ వరుస బంతుల్లో గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ (0)ను వెనక్కిపంపి ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీశాడు. చాహల్‌ ఓవర్లో రజత్, లొమ్రార్‌ చెరో సిక్సర్‌ కొట్టడంతో ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చిందనిపించింది. లొమ్రోర్‌ కొట్టిన బంతి జైస్వాల్‌ చేతుల్లో నుంచి బౌండరీ బయట పడింది. కానీ అవేష్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టిన వెంటనే రజత్‌ ఔటైపోవడంతో మళ్లీ బ్రేక్‌ పడింది. దినేశ్‌ కార్తీక్‌ (13 బంతుల్లో 11) బంతికో పరుగూ చేయలేకపోయాడు. అతనితో పాటు లొమ్రార్‌ను అవేష్‌ ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. ఆఖరి ఓవర్లో స్వప్నిల్‌ (9 నాటౌట్‌) సిక్సర్‌తో స్కోరు 170 దాటింది.


ఆ ఎల్బీ నాటౌటా?

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సమీక్షలో దినేశ్‌ కార్తీక్‌ ఎల్బీ నాటౌట్‌గా తేలడం వివాదాస్పదమైంది. 15వ ఓవర్‌ రెండో బంతికి రజత్‌ను అవేశ్‌ ఔట్‌ చేశాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన దినేశ్‌ బంతిని డిఫెండ్‌ చేద్దామని చూడగా అది ప్యాడ్లకు తాకింది. అప్పీల్‌ చేస్తే మైదానంలోని అంపైర్‌ ఔటిచ్చాడు. వెంటనే దినేశ్‌ సమీక్ష కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్‌ రావడంతో టీవీ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ అది బంతి బ్యాట్‌కు తాకితే రాలేదని, ప్యాడ్‌కు బ్యాట్‌ తాకితే వచ్చిందని రాజస్థాన్‌ ఆటగాళ్లు, ఆ ఫ్రాంఛైజీ క్రికెట్‌ డైరెక్టర్‌ సంగక్కర అసహనం వ్యక్తం చేశారు. రీప్లేలో కూడా బంతి, బ్యాట్‌ మధ్య ఖాళీ కనిపించింది. వ్యాఖ్యాత గావస్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ అవకాశాన్ని దినేశ్‌ వృథా చేశాడు. అతను 13 బంతుల్లో 11 పరుగులే చేసి ఔటవడం ఆర్సీబీకి నష్టమే చేసింది.


4

ఈ సీజన్లో మ్యాక్స్‌వెల్‌ డకౌట్లు. మొత్తంగా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేశ్‌ కార్తీక్‌ (18)ను సమం చేశాడు. 


8004

ఐపీఎల్‌లో కోహ్లి పరుగులు. లీగ్‌లో 8 వేల మైలురాయి చేరుకున్న తొలి ఆటగాడు అతనే. 244 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఈ పరుగులు చేశాడు. రెండో స్థానంలో ధావన్‌ (221 ఇన్నింగ్స్‌ల్లో 6769) ఉన్నాడు.


బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ఫెరీరా (బి) చాహల్‌ 33; డుప్లెసిస్‌ (సి) పావెల్‌ (బి) బౌల్ట్‌ 17; గ్రీన్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 27; రజత్‌ (సి) పరాగ్‌ (బి) అవేష్‌ 34; మ్యాక్స్‌వెల్‌ (సి) ధ్రువ్‌ (బి) అశ్విన్‌ 0; లొమ్రార్‌ (సి) పావెల్‌ (బి) అవేష్‌ 32; దినేశ్‌ కార్తీక్‌ (సి) జైస్వాల్‌ (బి) అవేష్‌ 11; స్వప్నిల్‌ నాటౌట్‌ 9; కర్ణ్‌ (సి) పావెల్‌ (బి) సందీప్‌ 5; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-37, 2-56, 3-97, 4-97, 5-122, 6-154, 7-159, 8-172; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-16-1; సందీప్‌ 4-0-48-1; అవేష్‌ 4-0-44-3; అశ్విన్‌ 4-0-19-2; చాహల్‌ 4-0-43-1

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) కార్తీక్‌ (బి) గ్రీన్‌ 45; క్యాడ్‌మోర్‌ (బి) ఫెర్గూసన్‌ 20; శాంసన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కర్ణ్‌ 17; పరాగ్‌ (బి) సిరాజ్‌ 36; జురెల్‌ రనౌట్‌ 8; హెట్‌మయర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 26; పావెల్‌ నాటౌట్‌ 16; అశ్విన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-46, 2-81, 3-86, 4-112, 5-157, 6-160; బౌలింగ్‌: స్వప్నిల్‌ 2-0-19-0; సిరాజ్‌ 4-0-33-2; యశ్‌  3-0-37-0; ఫెర్గూసన్‌ 4-0-37-1; కర్ణ్‌శర్మ 2-0-19-1; గ్రీన్‌ 4-0-28-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని