Bengaluru Vs Chennai: ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్

మే 18న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదే ఇరు జట్లకూ లీగ్‌ స్టేజ్‌లో చివరిది కావడం గమనార్హం. మరోవైపు ప్లేఆఫ్స్‌కు కీలకంగా మారిన మ్యాచ్‌ కావడంతో ఆసక్తి నెలకొంది.

Published : 17 May 2024 17:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై తన లీగ్‌ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌ ఆడబోతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్‌ జరగాలని ప్రతిఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోతే ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆడే చివరి మ్యాచ్‌ ఇదే అవుతుంది. కాబట్టి, అతడినుంచి అసలైన ఆట బెంగళూరుపై చూడబోతున్నామని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వరుణ్‌ ఆరోన్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘శనివారం ఎంఎస్ ధోనీ షోను చూస్తామనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మనం అతడి ఆటను చూశాం. చిన్నస్వామి స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఇక్కడ ఆడాడు. గతంలో ఓసారి చివరి ఓవర్‌లో 20 పరుగులను ఒక్కడే బాదేశాడు. కాబట్టి, అతడు అత్యంత ప్రమాదకారి. మరోసారి అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా’’ అని ఆరోన్ వెల్లడించాడు. ప్రస్తుత సీజన్‌లో ధోనీ ఇన్నింగ్స్‌ చివర్లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకటి లేదా రెండు ఓవర్లు ఉన్నప్పుడు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. ఇప్పటివరకు 13 మ్యచుల్లో 136 పరుగులు రాబట్టాడు. అందులో ఎక్కువగా బౌండరీల రూపంలో వచ్చినవే. అయితే, ఈసారి మాత్రం ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌ చూడాలనేదే అభిమానుల ఆకాంక్ష.

ఏప్రిల్ కలిసిరాలేదు.. మే మంచిది: కోహ్లీ

తొలి అర్ధభాగంలో బెంగళూరు కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఇప్పుడు రెండో స్టేజ్‌లో ఐదు విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. ఈ క్రమంలో తమ జట్టు మొదట్లో విఫలం కావడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మే నెల చాలా బాగుంది. ఏప్రిల్‌ మాకు పెద్దగా కలిసి రాలేదు. సన్‌లైట్‌ కిరణాలను ఇప్పుడే సరిగ్గా అందుకున్నాం(నవ్వుతూ). వరుస విజయాలతో మళ్లీ అభిమానులను అలరించడం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు