Bengaluru Vs Chennai: భళి భళిరా బెంగళూరు

ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్‌రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్‌ ప్రపంచం తీర్మానించింది.

Updated : 19 May 2024 04:35 IST

వరుసగా ఆరో విజయంతో ప్లేఆఫ్స్‌లో ప్రవేశం
చెన్నైకి నిరాశ 
బెంగళూరు

ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్‌రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్‌ ప్రపంచం తీర్మానించింది. ఆర్సీబీ నిస్సహాయతను, వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోటెత్తాయి. ఆఖరికి ఆ జట్టు ఆటగాడు కూడా కలలో సైతం తమ జట్టు ముందంజ వేస్తుందని ఊహించి ఉండడు. కానీ అద్భుతం!

బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో, అంటే వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో        ముంచెత్తుతూ కనీ వినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ..     మెరుగైన రన్‌రేట్‌తో ముందంజ వేసింది. 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అదరగొట్టింది. వరుసగా ఆరో విజయంతో ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను మట్టికరిపించింది. డుప్లెసిస్‌ (54; 39 బంతుల్లో 3×4, 3×6), కోహ్లి (47; 29 బంతుల్లో 3×4, 4×6), రజత్‌ పటీదార్‌ (41; 23 బంతుల్లో 2×4, 4×6), గ్రీన్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4, 3×6) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. శాంట్నర్‌ (1/23), తీక్షణ (0/25) పొదుపుగా బౌలింగ్‌ చేశారు.  ఛేదనలో తడబడ్డ చెన్నై 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. 201 చేసినా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లగలిగేది. రచిన్‌ రవీంద్ర (61; 37 బంతుల్లో 5×4, 3×6) టాప్‌ స్కోరర్‌. జడేజా (42 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 3×6) రాణించాడు. యశ్‌ దయాళ్‌ (2/42), మ్యాక్స్‌వెల్‌ (1/25), సిరాజ్‌ (1/35) బంతితో రాణించారు.

చెన్నై తడబాటు: ఛేదనలో చెన్నై బ్యాటింగ్‌ పేలవం. అసలే పెద్ద లక్ష్యం. ఆపై తొలి బంతికే.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ రుతురాజ్‌ ఔట్‌. మూడో ఓవర్లో మిచెల్‌ (4) కూడా నిష్క్రమించాడు. 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో ఆ జట్టు గాడినపడింది. బ్యాటర్లిద్దరూ చక్కని షాట్లు ఆడడంతో 8 ఓవర్లలో 85/2తో రేసులో నిలిచింది. పరిస్థితి చక్కబడుతుందనుకున్న దశలో ఇన్నింగ్స్‌ మళ్లీ గతి తప్పింది. రహానెను ఔట్‌ చేయడం ద్వారా చెన్నై పతనాన్ని ఫెర్గూసన్‌ తిరిగి ఆరంభించాడు. రచిన్‌ రెండు సిక్స్‌లు బాదినా.. బౌండరీలు ఎక్కువగా రాకపోవడంతో చెన్నై సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్‌ ఔట్‌ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ముఖ్యంగా మంచి ఊపు మీదున్న రచిన్‌ ఔట్‌ కావడం మలుపు అనుకోవచ్చు. దూబెతో సమన్వయ లోపంతో అతడు రనౌట్‌ కాగా.. ఉన్న కాసేపూ ఇబ్బందిపడ్డ దూబె (15 బంతుల్లో 7).. గ్రీన్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. శాంట్నర్‌ (3)ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే అయిదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. ఆ దశలో ధోని తోడుగా జడేజా పోరాడాడు. ఓటమి ఖాయమే అయినా.. ప్లేఆఫ్స్‌ కోసం చెన్నై పోటీలో నిలిచింది. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాల్సిన స్థితిలో ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని (25) 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్‌ (యశ్‌ దయాళ్‌) తొలి బంతికే ధోని సిక్స్‌ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్‌ గొప్పగా బౌలింగ్‌ చేశాడు .రెండో బంతికి ధోనీని ఔట్‌ చేసిన అతడు.. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీని ఆనందంలో ముంచెత్తాడు.

దంచేశారు..: బ్యాటింగ్‌కు దిగిన ప్రతి బ్యాటరూ రెచ్చిపోవడంతో అంతకుముందు బెంగళూరు భారీ స్కోరు సాధించింది. కోహ్లి, డుప్లెసిస్‌ అదిరే ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత పటీదార్, గ్రీన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తుషార్‌ తొలి ఓవర్లో రెండే పరుగులిచ్చినా.. ఆ తర్వాత ఓపెనర్లు బ్యాట్లకు పని చెప్పారు.. శార్దూల్‌ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో డుప్లెసిస్‌.. తుషార్‌ ఓవర్లో రెండు కళ్లు చెదిరే సిక్స్‌లతో కోహ్లి తమ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. కానీ వర్షంతో మ్యాచ్‌ కాసేపు ఆగి, తిరిగి ఆరంభమయ్యాక ఆట భిన్నంగా సాగింది. బంతి గిర్రున తిరగడంతో స్పిన్నర్లు తీక్షణ, శాంట్నర్‌ బౌలింగ్‌లో షాట్లు ఆడడం బ్యాటర్లకు కష్టమైపోయింది. పరుగుల వేగం తగ్గింది. ముఖ్యంగా డుప్లెసిస్‌ బ్యాట్‌ ఝళిపించలేకపోయాడు. 8 ఓవర్లకు స్కోరు 60/0. ఆ దశలో ఆర్సీబీ 218 చేయగలదని ఎవరూ ఊహించలేదు. కానీ ఇన్నింగ్స్‌ మళ్లీ ఊపందుకుంది. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ జెట్‌ వేగాన్ని అందుకుంది. పటీదార్‌-గ్రీన్‌ల విధ్వంసక భాగస్వామ్యమే అందుకు ప్రధాన కారణం. భారీ షాట్లతో విరుచుకుపడ్డ ఈ జంట కేవలం 28 బంతుల్లో 71 పరుగులు జోడించి మ్యాచ్‌ గమనాన్నే మార్చేసింది. అయితే వీళ్లకన్నా ముందు ఎనిమిదో ఓవర్‌ తర్వాత కోహ్లి రెండు సిక్స్‌లతో కొట్టి ఇన్నింగ్స్‌లో మళ్లీ జోరు నింపాడు. ఆ తర్వాత డుప్లెసిస్‌ రెండ[ు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో జడేజా ఓ ఓవర్లో ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. 13వ ఓవర్లో అతడు రనౌటయ్యాక పటీదార్‌కు తోడయ్యాడు గ్రీన్‌. ఇద్దరూ కలిసి చెన్నై బౌలింగ్‌ను ఉతికేశారు. వాళ్ల నిర్దాక్షిణ్య బ్యాటింగ్‌కు, సిక్స్‌ల మోతకు శార్దూల్, తుషార్, సిమర్‌జీత్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో పటీదార్‌ ఔటైనా.. అప్పటికే అతడు చెన్నైకి చాలా నష్టం చేశాడు. దినేశ్‌ కార్తీక్‌ (14), మ్యాక్స్‌వెల్‌ (16) బ్యాట్‌ ఝళిపించడంతో ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ మరో 31 పరుగులు పిండుకుంది. చివరి ఏడు ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 80 పరుగులు చేయడం విశేషం. పేలవ బౌలింగ్‌తో శార్దూల్‌ నాలుగు ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా (3 ఓవర్లలో 40), తుషార్‌ దేశ్‌పాండే (1/49) బంతితో నిరాశపరిచారు. తుషార్‌ నాలుగు వైడ్లు వేశాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) శాంట్నర్‌ 47; డుప్లెసిస్‌ రనౌట్‌ 54; రజత్‌ పటీదార్‌ (సి) మిచెల్‌ (బి) శార్దూల్‌ 41; గ్రీన్‌ నాటౌట్‌ 38; దినేశ్‌ కార్తీక్‌ (సి) ధోని (బి) తుషార్‌ 14; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) శార్దూల్‌ 16; లొమ్రార్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 218; వికెట్ల పతనం: 1-78, 2-113, 3-184, 4-201, 5-218; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-49-1; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-61-2; తీక్షణ 4-0-25-0; శాంట్నర్‌ 4-0-23-1; జడేజా 3-0-40-0; సిమర్‌జీత్‌ సింగ్‌ 1-0-19-0

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0; రచిన్‌ రనౌట్‌ 61; మిచెల్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ దయాళ్‌ 4; రహానె (సి) డుప్లెసిస్‌ (బి) ఫెర్గూసన్‌ 33; దూబె (సి) ఫెర్గూసన్‌ (బి) గ్రీన్‌ 7; జడేజా నాటౌట్‌ 42; శాంట్నర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 3; ధోని (సి) స్వప్నిల్‌ (బి) యశ్‌ దయాళ్‌ 25; శార్దూల్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-0, 2-19, 3-85, 4-115, 5-119, 6-129, 7-190; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-25-1; సిరాజ్‌ 4-0-35-1; యశ్‌ దయాళ్‌ 4-0-42-2; స్వప్నిల్‌ సింగ్‌ 2-0-13-0; కర్ణ్‌ 1-0-14-0; ఫెర్గూసన్‌ 3-0-39-1; గ్రీన్‌ 2-0-18-1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని