Ben stokes: ఇంగ్లాండ్‌కు దొరికిన గొప్ప పోరాట యోధుడు.. బెన్‌స్టోక్స్‌

అతడో మేటి పేసర్‌.. అత్యవసర సమయాల్లో జట్టుకు అమూల్యమైన వికెట్లు అందిస్తాడు. అతడో సూపర్‌ బ్యాట్స్‌మన్‌.. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్‌ను మంత్ర దండంగా మారుస్తాడు...

Published : 19 Jul 2022 01:51 IST

తన ఆటతో ఆ మాటలకు చెక్‌ పెట్టాడు..

అతడో మేటి పేసర్‌.. అత్యవసర సమయాల్లో జట్టుకు అమూల్యమైన వికెట్లు అందిస్తాడు. అతడో సూపర్‌ బ్యాట్స్‌మన్‌.. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాట్‌ను మంత్ర దండంగా మారుస్తాడు. అతడో పోరాట యోధుడు.. అగాధంలో కూరుకుపోయిన జట్టును అసమాన పోరాటంతో గెలిపిస్తాడు. అతడే ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌. ఉన్నట్టుండి వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ప్రత్యేక కథనం.

విమర్శించిన వారితోనే శభాష్‌ అనిపించుకొని..

2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా.. 2019 వరకూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే పలు వివాదాల్లో చిక్కుకొని అభిమానుల్లో చులకనయ్యాడు. తన ప్రవర్తనతో ఒకానొక సందర్భంలో జట్టులో చోటే కోల్పోయాడు. ఇంకోసారి ఏకంగా ఇంగ్లాండ్‌ జట్టుకు టీ20 ప్రపంచకప్‌నే దూరం చేశాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో చివరి ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు సమర్పించుకొని ఇంగ్లాండ్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను వెస్టిండీస్‌కు అప్పగించాడు. దీంతో బెన్‌స్టోక్స్‌ అంటేనే ఆ జట్టు అభిమానులకు చిర్రెత్తుకొచ్చేది. సీన్‌ కట్‌చేస్తే 2019 జులై 14. తనని విమర్శించిన వాళ్లతోనే శభాష్‌ అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్‌కు దశాబ్దాల కలను నెరవేర్చాడు. ఆ జట్టుకు హీరో అవ్వడమే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో అతడిలా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అవ్వాలని ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.

ఆ మాటలకు చెక్‌ పెట్టాడు..

అప్పటిదాకా ఇంగ్లాండ్‌కు క్రికెట్‌ పుట్టినిల్లన్న పేరే తప్ప వన్డే ప్రపంచకప్‌ గెలిచింది లేదు. దీంతో ఆ జట్టును ఎవరైనా విమర్శించాలంటే ఈ అస్త్రాన్నే మాటల తూటాల్లా వినియోగించేవారు. కానీ, వాటికి చెక్‌ పెట్టేలే చేసిన ఘనత బెన్‌స్టోక్స్‌ది. దశాబ్దాల కలను నెరవేరుస్తూ 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలబెట్టాడు. దీంతో ఆ జట్టుకు దశాబ్దాల వన్డే ప్రపంచకప్‌ కలను సాకారం చేశాడు. 242 పరుగుల ఛేదనలో 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో బెన్‌స్టోక్స్‌ (84 నాటౌట్‌; 98 బంతుల్లో 5x4, 2x6) గొప్పగా పోరాడు. బట్లర్‌ (59; 60 బంతుల్లో 6x4)తో కలిసి ఐదో వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 241 పరుగులే చేసి ఆలౌటైంది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే, సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అక్కడా మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. దీంతో బౌండరీ కౌంట్‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. స్టోక్స్‌ అద్వితీయ పోరాటమే ఉత్కంఠభరితమైన క్షణాల్లో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించేలా చేసింది. అంతకుముందు స్టోక్స్‌ పలు విలువైన ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఈ మ్యాచ్‌తోనే తనపై ఉన్న చెడు అభిప్రాయాలను తొలగించుకున్నాడు.

పోరాట యోధుడు..

బెన్‌స్టోక్స్‌కు ఓ విలక్షణమైన అలవాటుంది. ఎలాంటి స్థితిలోనైనా మ్యాచ్‌ గెలుస్తామనే సంకల్పం అతడిది. ఆ లక్షణంతోనే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అదరడు బెదరడు. టాప్‌ఆర్డర్‌ లేకపోయినా.. లోయర్‌ ఆర్డర్‌తోనే మ్యాచ్‌లు గెలిపిస్తాడు. ప్రత్యర్థి ఎవరనేది, ఎంత పెద్ద లక్ష్యం అనేవి పట్టించుకోడు. అది 2019 వన్డే ప్రపంచకప్‌లోనే తెలిసొచ్చినా.. అదే ఏడాది యాషెస్‌ సిరీస్‌లోనూ మరోసారి నిరూపించుకున్నాడు. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ 67 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థికి 112 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలు 246 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్‌ ముందు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఛేదనలో ఇంగ్లాండ్‌ 286/9తో ఓటమి అంచున నిలిచింది. అప్పటికి ఆ జట్టు విజయానికి 72 పరుగులు కావాలి. చేతిలో ఒకే వికెట్‌ మిగిలింది. స్టోక్స్‌ 61 పరుగులతో ఉన్నాడు. చివరి బ్యాట్స్‌మన్‌గా లీచ్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్‌ ఒంటరిపోరాటం చేశాడు. చివరికి 362/9 స్కోర్‌ సాధించి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. అప్పటికి స్టోక్స్‌ (135 నాటౌట్‌తో) నిలిస్తే లీచ్‌ (1) ఒక్క పరుగు మాత్రమే తీశాడు. దీన్నిబట్టి అతడెలాంటి పోరాట యోధుడో అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని