#HBDViratKohli: సచిన్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ... ఈ సంవత్సరం చాలా స్పెషల్‌!

Virat Kohli Birthday Special: టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. గత కొన్నేళ్లుగా ఫామ్‌ లేమితో ఉన్న ఇప్పుడు ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. 

Updated : 05 Nov 2023 18:13 IST

విజయం సాధించడంతో పాటు ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం కష్టం అంటారు. విపరీతమైన పోటీ ఉండే క్రికెట్లో.. అందులోనూ విపరీతమైన అంచనాల ఒత్తిడి ఉండే భారత క్రికెట్లో ఇది మరింత కష్టం. ఈ ఆటలో విరాట్ కోహ్లి (Virat Kohli) నెలకొల్పిన ప్రమాణాలు అసాధారణం. సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని అందరూ తీర్మానించేశాక.. సచిన్‌ను మించే స్థాయిలో పరుగుల ప్రవాహంతో అనేక రికార్డులు బద్దలు కొట్టడం.. మరెన్నో రికార్డుల మీద గురి పెట్టడం అతడికే చెల్లింది. ఈ రోజు ఏకంగా వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు (49)ను కూడా సమం చేసేశాడు. ఐతే ఆటలో ఎవరూ అందుకోని స్థాయికి చేరుకున్న కోహ్లి.. ఒక దశలో ఎదుర్కొన్న వైఫల్యాలు, పతనం చూసి ఇక అతడి పనైపోయిందని అందరూ తీర్మానించేశారు. కానీ పడి లేచిన కెరటంలా పేలవ దశను అతను అధిగమించిన తీరు అద్భుతం. వైఫల్యాల మధ్యే రెండు మూడు పుట్టిన రోజులు జరుపుకొన్న ‘కింగ్’.. ఈ పుట్టిన రోజు (Happby Birthday Virat)కు మళ్లీ కెరీర్ పతాక స్థాయిని అందుకోవడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.

ఈ రోజు (నవంబరు 5) కోహ్లి తన 35వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఐతే అతడి గత మూడు పుట్టిన రోజులు అంత సంతృప్తికరంగా సాగలేదు. అంతర్జాతీయ కెరీర్ మొదలయ్యాక పైకి ఎదగడమే తప్ప కిందికి పడటం అన్నదే అతడి కెరీర్లో జరగనే లేదు. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతల ఉన్నది ఎలాంటి బౌలర్లయినా అతడికి లెక్క ఉండదు. క్రీజులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే. అలుపు సొలుపు లేకుండా పరుగులు రాబట్టడం.. మంచినీళ్ల ప్రాయంగా శతకాలు బాదడం.. అందరూ ఇబ్బంది పడే ఛేదనలో మొనగాడిలా నిలబడి జట్టును గెలిపించడం.. అదీ కోహ్లి అంటే. మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు. కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం కోహ్లికే సాధ్యం. కోహ్లిని ఎవరైనా రెచ్చగొడితే.. అతడిలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వస్తాడు. అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు.. కోహ్లితో పెట్టుకోవద్దని, అతణ్ని రెచ్చగొట్టొద్దని తమ ఆటగాళ్లను హెచ్చరించేవారు. 

ఇదే పతాక స్థాయి అనుకున్న ప్రతిసారీ.. అంతకుమించి ఉత్తమ ప్రదర్శన చేసి ఇంకా తనకు తానే సాటి అనిపించిన ఆటగాడు విరాట్. వివిధ ఫార్మాట్లలో అతడి పరుగులు.. సగటు.. శతకాలు.. ఇలాంటి గణాంకాలు చూసి క్రికెట్ పండితులు నోరెళ్లబెట్టారు. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటి కంటే ఛేదనల్లో ఎక్కువ పరుగులు, సగటు, శతకాలు నమోదు చేయడం అతడికే చెల్లింది. క్రికెట్ చరిత్రలో అప్పటిదాకా ఎవరికీ ఇలాంటి ఘనతలు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆటగాడు వస్తాడని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇలా పతాక స్థాయిలో సాగిపోతున్న విరాట్ కెరీర్ 2019-2023 మధ్య మాత్రం ఊహించని పతనం చవిచూసింది.

అదే అతడి ప్రత్యేకత..

సెంచరీ కొట్టడాన్ని ఒక మామూలు విషయంగా మార్చేసి.. ఒక ఏడాదిలో పది సెంచరీలు కొడితే కోహ్లికి ఇది మామూలే కదా అని అభిమానులు అనకునే పరిస్థితి కల్పించిన ఘనుడు కోహ్లి. అలాంటి ఆటగాడు ఒక్క శతకం కూడా సాధించకుండా రెండున్నరేళ్లకు పైగా ఉన్నాడంటే అంతకంటే అనూహ్యమైన విషయం మరొకటి ఉండదు. ఎలాంటి ఆటగాడైనా ఫామ్ కోల్పోవడం, కొంత కాలం పరుగుల కోసం తంటాలు పడటం, సెంచరీలకు దూరం కావడం మామూలే. ఐతే కోహ్లి స్థాయి ఆటగాడు రెండున్నరేళ్లు మూడంకెల స్కోరు చేయకపోవడం మాత్రం అనూహ్యం. ఫలానా ఫార్మాట్ అని తేడా లేకుండా అన్నింట్లోనూ అతను విఫలమయ్యాడు. 

ఐపీఎల్‌లో సైతం సాధారణ పరిస్థితి చేశాడు. కోహ్లి అంటే బెంబేలెత్తిన బౌలర్లు, ప్రత్యర్థి జట్లు.. అతను క్రీజులోకి వస్తుంటే అస్సలు భయపడకపోవడం, తన వికెట్ పడినా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం ఆ పేలవ దశలోనే చూశారు అభిమానులు. సెంచరీల కోసం చూడ్డం మాని అతను 50 దాటినా సంబరపడే పరిస్థితి వచ్చింది ఒక దశలో. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీకి దూరం కావడం.. ఐపీఎల్‌లో సైతం కెప్టెన్సీని విడిచిపెట్టడంతో కోహ్లి ప్రభ మరింత తగ్గింది. దీంతో విరాట్ మళ్లీ మునుపటి స్థాయిని అందుకోలేడని.. ఇక అతను రిటైరవడమే తరువాయి అనే చర్చ జరిగింది. కానీ అలాగే జరిగి ఉంటే.. అతను కోహ్లి ఎందుకవుతాడు?

అక్కడ్నుంచి మొదలు..

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత ఏడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించడంతో విరాట్ మళ్లీ తన పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మీద ఆడిన 84 సంచలన ఇన్నింగ్స్‌తో అతడి పేరు మార్మోగింది. మళ్లీ మునుపటి కోహ్లిని ఆ మ్యాచ్‌లోనే చూశారు అభిమానులు. క్రికెట్ ప్రపంచమంతా కింగ్ కింగే అని కొనియాడింది. ఇక కోహ్లి ఆగనే లేదు. 2023లో అతడి జోరు మామూలుగా లేదు. ఈ ఏడాది కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఆరు సెంచరీలు కూడా సాధించాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. 

ఇక ప్రపంచకప్‌లో అయితే అతడి వీరవిహారం మామూలుగా లేదు. 8 ఇన్నింగ్స్‌ల్లో 108.6 సగటుతో 543 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలపాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88 పరుగుల వద్ద ఔటై.. సచిన్‌ రికార్డు సమం చేయడానికి అడుగు దూరంలో ఉండిపోయిన విరాట్ దక్షిణాఫ్రికా మీద అజేయ శతకం (101*) చేసి పని పూర్తి చేశాడు. ఇక సచిన్‌ రికార్డును అధిగమించడమే తరువాయి. త్వరలోనే ఆ రికార్డును తన పేరిట లిఖించుకోవడం ఖాయం. ప్రపంచకప్‌లో విరాట్ ఇదే ఫామ్‌ను చివరి వరకు కొనసాగించి భారత్‌ను మూడోసారి విశ్వవిజేతగా నిలపాలన్నది అభిమానుల ఆకాంక్ష.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు