Bopanna - Ebden: రోహన్‌ బోపన్న జోడీ మరో రికార్డు.. మియామి ఓపెన్‌ విజేత

భారత స్టార్‌ రోహన్ బోపన్న మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి మియామి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

Published : 31 Mar 2024 10:59 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టెన్నిస్ స్టార్‌ రోహన్ బోపన్న (Rohan Boppanna) వయసు పెరిగే కొద్దీ విజయాలబాటలో పరుగులు పెడుతున్నాడు. తాజాగా డబుల్స్‌ విభాగంలో మియామి ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. తన సహచరుడు మ్యాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డొడిక్ - అమెరికన్ ప్లేయర్ ఆస్టిన్ క్రాజిసెక్‌పై 6-7, 6-3, 10-16 తేడాతో విజయం సాధించారు. దీంతో 44 ఏళ్ల వయసులో ‘1000 టైటిల్‌’ సాధించిన ఆటగాడిగా రోహన్‌ రికార్డు నమోదు చేశాడు. లియాండర్ పేస్‌ తర్వాత తొమ్మిది ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ల ఫైనల్స్‌కు చేరిన రెండో భారత టెన్నిస్‌ ఆటగాడినూ రోహన్ నిలిచాడు. 

మియామి ఫైనల్‌లో రోహన్ జోడీకి గట్టి పోటీనే ఎదురైంది. డొడిక్-ఆస్టిన్‌ మొదటి రౌండ్‌ను కొట్టేశారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా.. రెండో రౌండ్‌లో రోహన్ - ఎబ్డెన్ పుంజుకున్నారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-3 తేడాతో గెలిచారు. ఇక నిర్ణయాత్మకమైన మూడో రౌండ్‌ హోరాహోరీగా జరిగింది. విజయం కోసం ఇరు జట్లూ తలపడ్డాయి. రోహన్ - ఎబ్డెన్ దూకుడుగా ఆడి 10-6 తేడాతో మూడో రౌండ్‌లో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని