IND vs AUS: బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ హీరోలు వీరే!

ఫిబ్రవరి 9 నుంచి 2022-23 బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)  ప్రారంభంకానుంది. తొలి టెస్టు నాగ్‌పూర్‌ వేదికగా జరగనుండగా.. ఈ ట్రోఫీలో ఇప్పటివరకు నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దామా..! 

Updated : 08 Feb 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య ఎన్ని సిరీస్‌లు జరిగినా బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ  (Border-Gavaskar Trophy) ప్రత్యేకతే వేరు. మిగతా సిరీస్‌ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్‌లో గెలవడాన్ని మాత్రం ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. స్పిన్నర్లు తమ మాయాజాలంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తే.. పేసర్లు బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఇక, కవ్వింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా మాటల యుద్ధానికి దిగి ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తారు. ఇలా హొరాహోరీగా సాగే బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ (BGT) రేపే (గురువారం) ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది. మరి BGTలో ఇప్పటివరకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.. 

ఆసీస్‌ ఒక్కసారే.. 

ఇరు దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), అలెన్ బోర్డర్‌ (Allen Border) పేరుతో ట్రోఫీని నిర్వహిస్తున్నారు. భారత్‌లో నిర్వహించిన మొదటి ట్రోఫీ (1996/97)ని టీమ్‌ఇండియా దక్కించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని ఇప్పటివరకు 15 సార్లు నిర్వహించగా.. భారత్‌ 9 సార్లు, ఆస్ట్రేలియా ఐదుసార్లు విజయం సాధించాయి. ఒకసారి (2003/04)  డ్రా అయింది. చివరిగా నిర్వహించిన మూడు ట్రోఫీల్లోనూ టీమ్‌ఇండియానే గెలుపొందింది. భారత్‌లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించగా.. ఆసీస్‌ ఒక్కసారి మాత్రమే (2004/05) విజేతగా నిలిచింది.

అత్యధిక పరుగులు చేసింది ఎవరంటే?

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌ తరఫున సచిన్ (Sachin Tendulkar) అత్యధికంగా 3,262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 అర్ధ శతకాలు ఉన్నాయి. భారత్‌పై ఆసీస్‌ తరఫున అత్యధికంగా రికీ పాంటింగ్‌  2,555 పరుగులు సాధించాడు. 8 శతకాలు, 12 అర్ధ శతకాలు బాదాడు. ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్న వారిలో చూసుకుంటే భారత్‌ తరఫున 1,893 పరుగులతో ఛెతేశ్వర్‌ పుజారా, ఆసీస్‌ తరఫున స్టీవ్ స్మిత్ 1,742 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. 

అత్యధిక వ్యక్తిగత స్కోరు 

ఈ సిరీస్‌లో భారత్‌పై అత్యధిక స్కోరు సాధించిన రికార్డు మైఖేల్ క్లార్క్‌ పేరిట ఉంది. 2012 జనవరిలో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మైఖేల్ క్లార్క్‌ 329 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, భారత్‌ తరఫున చూసుకుంటే 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేశాడు.  

భజ్జీ ఫస్ట్.. కుంబ్లే సెకండ్

BGTలో ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన రికార్డు హర్భజన్‌ సింగ్‌  (Harbhajan Singh) పేరిట ఉంది. 2001లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో (7/133), రెండో ఇన్నింగ్స్‌లో 8/84)తో ఆకట్టుకున్నాడు. హర్భజన్‌ 15 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే చెన్నై మైదానంలో 2004లో జరిగిన మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే (Anil kumble) తొలి ఇన్నింగ్స్‌లో  (7/48), రెండో ఇన్నింగ్స్‌లో (6/133) తన సత్తా చాటాడు. ఆసీస్‌ తరఫున ఆల్‌రౌండర్‌ స్టీవ్ ఒకీఫ్ (12/70).. 2017లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన రికార్డు ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్ పేరిట ఉంది. 2017 మార్చిలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతడు 22.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి 50 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 

ఎక్కువ వికెట్లు పడగొట్టింది ఎవరంటే? 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మొదటి నుంచి స్పిన్నర్లదే హవా. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే అత్యధికంగా 111 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ సింగ్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ తరఫున నాథన్‌ లైయన్ 94 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. 53 వికెట్లతో బ్రెట్ లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. మరి ఈ సిరీస్‌లో ఆసీస్‌, టీమ్‌ఇండియా క్రికెటర్లు ఎలాంటి మాయాజాలాన్ని ప్రదర్శిస్తోరో చూడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని