FIFA World Cup 2022: బ్రెజిల్‌కు గుండెకోత.. ప్రపంచకప్‌ నుంచి ఫేవరెట్‌ ఔట్‌

దాడుల మీద దాడులు చేశారు. మెరుపు షాట్లు కొట్టారు. కానీ ఫలితం లేదు. ప్రథమార్ధం అయింది. నిర్ణీత సమయం  ముగిసింది. ఇంజురీ టైం కూడా పూర్తయింది.

Updated : 10 Dec 2022 09:04 IST

పెనాల్టీ షూటౌట్‌లో విఫలం.. క్రొయేషియా సెమీస్‌కు

దాడుల మీద దాడులు చేశారు. మెరుపు షాట్లు కొట్టారు. కానీ ఫలితం లేదు. ప్రథమార్ధం అయింది. నిర్ణీత సమయం  ముగిసింది. ఇంజురీ టైం కూడా పూర్తయింది. గోడలా నిలబడ్డ క్రొయేషియా డిఫెన్స్‌ బ్రెజిల్‌ను ఖాతా తెరవనివ్వలేదు. కానీ అదనపు సమయం మొదలైన కాసేపటికే ఆధిక్యంలోకి బ్రెజిల్‌. ఎన్నో ఆశలు పెట్టుకున్న నెయ్‌మారే కళ్లు చెదిరే రీతిలో గోల్‌ కొట్టేశాడు. బ్రెజిల్‌ది మామూలు సంబరం కాదు. స్టేడియంలో పసుపు చొక్కాల సందడి అంతా ఇంతా కాదు. సెమీస్‌ బెర్తు సొంతమైపోయిందని బ్రెజిల్‌ అభిమానులు ధీమాగా ఉన్నారు. బ్రెజిల్‌ కూడా ఆ ధీమాలోనే డిఫెన్స్‌లో కొంత నిర్లక్ష్యం వహించింది. ఫలితం.. క్రొయేషియా గోల్‌. అయినా షూటౌట్‌ ఉందిగా అని ధీమా!

కానీ షూటౌట్లో షాక్‌ మీద షాక్‌. ఒక షాట్‌ ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ ఆపేశాడు. ఇంకోటి గోల్‌ బార్‌కు తాకింది. పాపం.. ఇంకేముంది ప్రపంచకప్‌ నుంచి హాట్‌ ఫేవరెట్‌ ఔట్‌! స్టేడియం బ్రెజిల్‌ ఆటగాళ్లు, అభిమానుల కన్నీళ్లతో తడిసిపోయింది.

క్రొయేషియా.. నాలుగేళ్ల కిందట మహా మహా జట్లకు చెక్‌ పెడుతూ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లిన జట్టు. ఈసారి ఆ జట్టు బ్రెజిల్‌కు గుండెకోత మిగిల్చి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

బ్రెజిల్‌ అంటే కేవలం బ్రెజిల్‌ మాత్రమే మెచ్చే జట్టు కాదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఇష్టపడే ఫుట్‌బాల్‌ జట్టు. 2002 తర్వాత ఆ జట్టు మరో ప్రపంచకప్‌ గెలిస్తే చూడాలని ఆశిస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఈసారి చక్కటి ప్రదర్శనతో కచ్చితంగా కప్పు గెలిచేలా కనిపించిన సాంబా జట్టు.. క్వార్టర్స్‌ కూడా దాటలేకపోయింది. శుక్రవారం ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆ జట్టుకు క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-2తో షాకిచ్చింది. మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్స్‌ కొట్టలేకపోగా.. అదనపు సమయంలో తలో గోల్‌ సాధించాయి. బంతిపై ఇరు జట్లూ సమానంగా నియంత్రణ సాధించినా.. మ్యాచ్‌లో గోల్‌ లక్ష్యంగా ఎక్కువ షాట్లు ఆడింది బ్రెజిలే. నెయ్‌మార్‌ సహా బ్రెజిల్‌ ఆటగాళ్లు పలుమార్లు బంతిని నెట్‌లోకి పంపేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే క్రొయేషియా డిఫెన్స్‌ చాలా బలంగా నిలబడి బ్రెజిల్‌కు చెక్‌ పెట్టింది. ఆ జట్టు గోల్‌ కీపర్‌ లివకోవిచ్‌ నిర్ణీత సమయంలోనే కాక.. పెనాల్టీ షూటౌట్లోనూ అదరగొట్టి మ్యాచ్‌ హీరోగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో వ్లాసిచ్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను ఆధిక్యంలో నిలపగా.. రోడ్రిగో విఫలమవడం బ్రెజిల్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రోడ్రిగో నెట్‌  కొట్టిన షాట్‌ను సరిగ్గా అంచనా వేసిన లివకోవిచ్‌ అద్భుత డైవ్‌తో ఆపేశాడు.  తర్వాతి రెండు ప్రయత్నాల్లో ఇరు జట్లూ విజయవంతమయ్యాయి. నాలుగో ప్రయత్నంలో ఓర్సిచ్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను 4-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. మార్కినో కొట్టిన షాట్‌ ఎడమవైపు గోల్‌ బార్‌ను తాకి బయటికి వచ్చేయడంతో బ్రెజిల్‌ కథ ముగిసింది.

పది నిమిషాల వ్యవధిలో..: అంతకుముందు నిర్ణీత సమయం, ఇంజురీ టైంలో ఇరు జట్లూ గోల్స్‌ కొట్టలేకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లింది. కాసేపటికే నెయ్‌మార్‌ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 106వ నిమిషంలో క్రొయేషియా బాక్స్‌ చివర్లో బంతిని చేజిక్కించుకున్న నెయ్‌మార్‌.. చుట్టూ చాలామంది డిఫెండర్లు ఉన్నా.. వారిని తప్పిస్తూ బంతిని ముందుకు తీసుకెళ్లాడు. నెయ్‌మార్‌ నుంచి బంతిని అందుకున్న పక్వెటా తిరిగి అతడికే పాస్‌ ఇవ్వగా.. నెట్‌కు సమీపంలోకి దూసుకెళ్లి అతను మెరుపు గోల్‌ కొట్టాడు. అయితే ఈ గోల్‌ సంబరం పది నిమిషాలే నిలిచింది. 115వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు పెట్కోవిచ్‌ స్కోరు సమం చేశాడు. పెట్కోవిచ్‌ కొట్టిన షాటే రీబౌండ్‌ అయి రాగా.. తిరిగి దాన్ని ఓర్సిచ్‌అతడివైపు నెట్టాడు. ఈసారి పెట్కోవిచ్‌ ఏ తప్పూ చేయకుండా గోల్‌ కొట్టేశాడు.


ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో క్వార్టర్స్‌లో ఆడుతుండడం ఇదే తొలిసారి.


3

ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌లో క్రొయేషియా అడుగుపెట్టడం ఇది మూడో సారి. వరుసగా రెండో సారి. మొదటగా 1998లో సెమీస్‌ చేరింది.


4
2014 (సెమీస్‌లో ఓటమి) మినహా గత అయిదు ప్రపంచకప్‌ల్లో బ్రెజిల్‌ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించడం ఇది నాలుగో సారి.


77
నెయ్‌మార్‌ అంతర్జాతీయ గోల్స్‌. బ్రెజిల్‌ తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన దిగ్గజ ఆటగాడు పీలేను అతను సమం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని