Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్‌కల్లమ్‌

వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్‌ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ వ్యాఖ్యానించాడు.

Updated : 06 Dec 2023 14:36 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బ్రెండన్ మెక్‌కల్లమ్‌ (Brendon McCullum) భారత సారథి రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. గతవారం జరిగిన బ్రెండన్  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఇన్నోవేషన్‌ ల్యాబ్ లీడర్స్‌ మీట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపై మెక్‌కల్లమ్‌ స్పందించాడు. ‘‘రోహిత్ సారథ్యం నాకెంతో నచ్చింది. జట్టును నడిపించిన తీరు అద్భుతం. ఎలాంటి రిస్క్‌ తీసుకొనేందుకైనా సిద్ధంగా ఉంటాడు. గేమ్‌పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతాడు. ఇలాంటి ప్రతిభ చాలా అరుదుగానే ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధిస్తాడు. భారత్‌ జట్టును మాత్రమే కాకుండా ముంబయి ఇండియన్స్‌నూ అద్భుతంగా నడిపించాడు’’ అని బ్రెండన్‌ వ్యాఖ్యానించాడు.

కోహ్లీ గురించి అప్పుడే అనుకున్నా..

విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్‌ అవుతాడని అతడి తొలినాళ్లల్లోనే అంచనా వేశా. భవిష్యత్తులో స్టార్‌గా మారతాడని అప్పుడే తెలుసు. నేను ఆర్‌సీబీతో ఉన్నప్పుడు కలిసి ఆడాం. ఆ తర్వాత ప్రత్యర్థులుగానూ తలపడ్డాం. క్రికెట్‌ పట్ల అతడికి ఉన్న ప్యాషన్‌ అమోఘం. భారీ టోర్నీల్లో విరాట్ ప్రదర్శన అద్భుతం. కోట్లాదిమంది కలలను నిజం చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తాడు. ఇది కోహ్లీ ఆటతీరును చూస్తేనే అర్థమవుతుంది. గేమ్‌పై తన ముద్ర వేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ఆర్‌సీబీలోనూ అత్యంత కీలకమైన ఆటగాడు కోహ్లీనే. 

భారత్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా..

‘‘భారత్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా. రోహిత్, విరాట్‌తోపాటు భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. తప్పకుండా మాకు సవాల్‌ ఎదురవుతుందని తెలుసు. ఒత్తిడిని అధిగమించి మా శైలిలో ఆడేందుకు ప్రయత్నిస్తాం. వారి స్వదేశంలో అత్యుత్తమ జట్టును ఢీకొట్టాలంటే సర్వశక్తులూ ఒడ్డాల్సిన అవసరం ఉంది. మా జట్టులోనూ దూకుడుగా ఆడే ఆటగాళ్లకు కొదవేం లేదు.  అయితే, అన్ని వేళలా ‘బజ్‌బాల్’ క్రికెట్‌ స్థిరంగా ఫలితాలను సాధిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. దాని గురించి మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. అత్యుత్తమ క్రికెట్‌ ఆడటమే మా లక్ష్యం. కోచ్‌గా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూనే జట్టును సరైన మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ విధానంలో మేం త్వరగా విజయవంతం కావడం మా అదృష్టం’’ అని మెక్‌కల్లమ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని