IND Vs PAK: కొంచమే కొట్టినా కొట్టేశారు

పిచ్‌ బౌలర్ల స్వర్గధామమే.. అక్కడ బ్యాటింగ్‌ చాలా కష్టమే.. కానీ బ్యాటర్లు మరీ బాధ్యత లేకుండా ఆడి ప్రత్యర్థి ముందు కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు.

Updated : 10 Jun 2024 07:13 IST

బుమ్రా సంచలన ప్రదర్శన
భారత్‌ అద్భుత విజయం 
119కే రోహిత్‌సేన ఆలౌట్‌
పాకిస్థాన్‌ 113/7

పిచ్‌ బౌలర్ల స్వర్గధామమే.. అక్కడ బ్యాటింగ్‌ చాలా కష్టమే.. కానీ బ్యాటర్లు మరీ బాధ్యత లేకుండా ఆడి ప్రత్యర్థి ముందు కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు.

మిగతా బౌలర్ల ప్రదర్శన సాధారణం.. ఫీల్డింగ్‌ అంతంతమాత్రం.. లక్ష్యం నిలిచే పరిస్థితి లేదు. పాక్‌పై ఆధిపత్యం కొనసాగేలా లేదు.. అభిమానుల్లో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి.

కానీ వచ్చినవాడు బుమ్రా.. అతనొస్తే పరుగులు ఆగిపోవాల్సిందే.. వికెట్‌ పడాల్సిందే..!

అతను బంతుల్ని బుల్లెట్లలా మార్చి సంధిస్తుంటే.. పాక్‌ బ్యాటర్లు విలవిలలాడిపోయారు.

ఆశలు వదులుకున్న మ్యాచ్‌లో బుమ్రా అద్భుతాలు చేయడంతో భారత్‌ చిరస్మరణీయ విజయాన్నందుకుంది.

న్యూయార్క్‌

టీ20 ప్రపంచకప్‌లో మరోసారి పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. కానీ ఈసారి విజయం అంత తేలిగ్గా రాలేదు. మ్యాచ్‌లో చాలా వరకు పాక్‌ ఆధిపత్యమే సాగి, భారత్‌కు ఓటమి భయమూ తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో జస్‌ప్రీత్‌ బుమ్రా (3/14) గొప్ప బౌలింగ్‌ ప్రదర్శన చేయడంతో భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. వర్షం ప్రభావం చూపిన ఈ మ్యాచ్‌లో మొదట భారత్‌ 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. రిషబ్‌ పంత్‌ (42; 31 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్‌. పాక్‌ బౌలర్లలో నసీమ్‌ షా (3/21), హారిస్‌ రవూఫ్‌ (3/21), మహ్మద్‌ ఆమిర్‌ (2/23) అదరగొట్టారు. అనంతరం బుమ్రాకు తోడు హార్దిక్‌ పాండ్య (2/24) కూడా రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 113/7కు పరిమితమైంది. మహ్మద్‌ రిజ్వాన్‌ (31; 44 బంతుల్లో 1×4, 1×6) మినహా బ్యాటర్లు తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించి, ఇప్పుడు పాక్‌పై నెగ్గిన భారత్‌.. సూపర్‌-8 చేరడమిక లాంఛనమే.

ఉత్కంఠ.. ఉత్కంఠ..: లక్ష్యం చిన్నదే కావడంతో ఛేదనలో పాక్‌ ఆత్మవిశ్వాసంతోనే ఆడింది. భారతే చాలా వరకు ఆత్మరక్షణలో ఉంది. పాక్‌ పేసర్లు విజృంభించిన పిచ్‌ మీద అర్ష్‌దీప్, సిరాజ్‌ అంత ప్రభావవంతంగా కనిపించలేదు. బుమ్రా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ వికెట్‌కు రంగం సిద్ధం చేశాడు కానీ.. ఫైన్‌ లెగ్‌లో దూబె తేలికైన క్యాచ్‌ను వదిలేయడంతో అది పాక్‌కు బాగా కలిసొచ్చింది. తర్వాత రిజ్వాన్‌ నిలకడగా ఆడుతూ పరుగులు సాధించాడు. స్వల్ప ఛేదనలో పాక్‌ 26/0తో నిలవడంతో భారత అభిమానుల్లో నైరాశ్యం అలుముకుంది. ఈ స్థితిలో బుమ్రా.. బాబర్‌ (13)ను ఔట్‌ చేసి భారత్‌కు తొలి బ్రేక్‌ అందించాడు. అయితే ఉస్మాన్‌ (13)తో కలిసి రిజ్వాన్‌ ఇంకో అయిదు ఓవర్లకు పైగా వికెట్‌ ఇవ్వకపోవడంతో 10 ఓవర్లకు 57/1తో పాక్‌ లక్ష్యం దిశగా సాగింది. మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లుతున్న సమయమది. ఈ దశలో ఉస్మాన్‌ను అక్షర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. భారత్‌ సమీక్షలో ఈ వికెట్‌ సాధించింది. అయినా ఆందోళన తొలగిపోలేదు. ఎందుకంటే రిజ్వాన్‌ క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు ఫకార్‌ వస్తూనే ఎదురుదాడికి దిగాడు. 12 ఓవర్లకు 72/2తో పాక్‌ మరింత ముందంజ వేసింది. కానీ ఇక్కడ్నుంచే భారత్‌ తిరిగి పోటీలోకి వచ్చింది. వేగంగా ఆడే ప్రయత్నంలో జమాన్‌ (13) వెనుదిరగ్గా.. రిజ్వాన్‌ను బౌల్డ్‌ చేసిన బుమ్రా భారత శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. షాదాబ్‌ (4) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సాధించాల్సిన రన్‌రేట్‌ కూడా పెరిగింది. 17 ఓవర్లకు పాక్‌ స్కోరు 90/5. పాక్‌కు కష్టంగా మారుతున్న సమయంలో 18వ ఓవర్లో ఒక నోబాల్, ఒక వైడ్‌ వేయడంతో పాటు మొత్తంగా 9 పరుగులిచ్చిన సిరాజ్‌.. ఆ జట్టుకు కొంత ఉపశమనాన్నిచ్చాడు. కానీ ఈ దశలో బుమ్రా మరోసారి అద్భుతమే చేశాడు. 19వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చి ఇఫ్తికార్‌ (5)ను ఔట్‌ చేశాడు. ఈ ఓవర్లో అతను మూడు డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. చివరి ఓవర్‌ (అర్ష్‌దీప్‌) తొలి బంతికే ఇమాద్‌ (15) ఔట్‌ కావడంతో మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసినట్లే కనిపించింది. కానీ 4, 5 బంతులకు నసీమ్‌ షా 2 ఫోర్లు కొట్టడంతో కొంత ఉత్కంఠ రేగింది. చివరి బంతికి సింగిలే రావడంతో మ్యాచ్‌ భారత్‌ సొంతమైంది.

టపటపా..: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక 77కే ఆలౌట్‌. భారత్‌తో పోరులో ఐర్లాండ్‌ 97కే ఆలౌట్‌. ఆ మ్యాచ్‌లు జరిగిన న్యూయార్క్‌లోనే భారత్‌-పాక్‌ పోరు అనగానే పెద్ద స్కోర్లు కావన్న అంచనా ముందే ఉంది. పైగా ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు వర్షం పడి పరిస్థితులు బౌలర్లకు మరింత అనుకూలంగా మారాయి. దీంతో టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగే చేసేవాళ్లమన్న రోహిత్‌ మాటతోనే బ్యాటర్లకు కష్టాలు తప్పవని అర్థమైపోయింది. అయితే ప్రమాదకర షహీన్‌ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో రోహిత్‌ కళ్లు చెదిరే సిక్సర్‌ బాదడంతో మ్యాచ్‌ అంచనాలకు భిన్నంగా సాగుతుందేమో అనిపించింది. కానీ వర్షం వల్ల అరగంట ఆలస్యంగా ఆరంభమై, తొలి ఓవర్‌ తర్వాత మళ్లీ వరుణుడి పలకరింపుతో అరగంటకు పైగా ఆట ఆగి తిరిగి మొదలవ్వగానే భారత్‌కు పెద్ద షాక్‌ తగిలింది. నసీమ్‌ బౌలింగ్‌లో చక్కటి డ్రైవ్‌తో ఫోర్‌ కొట్టి ఖాతా తెరిచిన కోహ్లి (4).. వెంటనే అన్యమనస్కంగా ఆడిన కట్‌ షాట్‌తో పాయింట్‌లో ఉస్మాన్‌కు దొరికిపోయాడు. తర్వాతి ఓవర్లోనే (షహీన్‌) రోహిత్‌ శర్మ అనవసర షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో రవూఫ్‌ చేతికి చిక్కాడు. 3 ఓవర్లలో 20/2తో భారత్‌ కష్టాల్లో పడింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన అక్షర్‌ పటేల్‌.. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాక కొన్ని షాట్లు ఆడి స్కోరు బోర్డును కదిలించాడు. షహీన్‌ బౌలింగ్‌లో అప్పర్‌ కట్‌తో అతను సిక్సర్‌ బాది ఆశ్చర్యపరిచాడు. మరోవైపు బ్యాటింగ్‌ కష్టంగా కనిపిస్తున్న పిచ్‌పై మొదట్లో షాట్ల కోసం రకరకాలుగా ప్రయత్నించి విఫలమైన పంత్‌.. తర్వాత బౌండరీలు సాధించాడు. రవూఫ్‌ వేసిన పదో ఓవర్లో అతను హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టాడు. ఈలోపే అక్షర్‌ (20)ను నసీమ్‌ బౌల్డ్‌ చేశాడు. ఓ ఎండ్‌లో పంత్‌ ధాటిగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నా మరో ఎండ్‌లో అతడికి సహకారం కరవైంది. ప్రతికూల పరిస్థితుల్లో నిలిచి ఆడాల్సిన సూర్యకుమార్‌ (7), దూబె (3) పేలవ రీతిలో నిష్క్రమించారు.  14 ఓవర్లకు స్కోరు 96/5. పంత్‌ నిలకడగా ఆడుతుండడం.. ఇంకా హార్దిక్, జడేజా ఉండడంతో స్కోరు 140 దాటేలాగే కనిపించింది. కానీ 15వ ఓవర్లో ఆమిర్‌ వరుస బంతుల్లో పంత్, జడేజా (0)లను ఔట్‌ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హార్దిక్‌ సైతం అద్భుతాలు చేయలేదు. రవూఫ్‌ కూడా వరుస బంతుల్లో రెండు వికెట్లతో హార్దిక్, బుమ్రా (0)లను ఔట్‌ చేసి భారత్‌ను పతనపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. అయితే అర్ష్‌దీప్‌ (9), సిరాజ్‌ (7 నాటౌట్‌) కాస్త పోరాడి స్కోరును 120కి చేరువ చేశారు. 19 ఓవర్‌ చివరి బంతికి అర్ష్‌దీప్‌ రనౌటైపోవడంతో మరో ఓవర్‌ మిగిలుండగానే భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రవూఫ్‌ (బి) షహీన్‌ 13; కోహ్లి (సి) ఉస్మాన్‌ (బి) నసీమ్‌ 4; పంత్‌ (సి) బాబర్‌ (బి) ఆమిర్‌ 42; అక్షర్‌ (బి) నసీమ్‌ 20; సూర్యకుమార్‌ (సి) ఆమిర్‌ (బి) రవూఫ్‌ 7; దూబె (సి) అండ్‌ (బి) నసీమ్‌ 3; హార్దిక్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) రవూఫ్‌ 7; జడేజా (సి) ఇమాద్‌ (బి) ఆమిర్‌ 0; అర్ష్‌దీప్‌ రనౌట్‌ 9; బుమ్రా (సి) ఇమాద్‌ (బి) రవూఫ్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (19 ఓవర్లలో ఆలౌట్‌) 119; వికెట్ల పతనం: 1-12, 2-19, 3-58, 4-89, 5-95, 6-96, 7-96, 8-112, 9-112; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 4-0-29-1; నసీమ్‌ షా 4-0-21-3; మహ్మద్‌ ఆమిర్‌ 4-0-23-2; ఇఫ్తికార్‌ అహ్మద్‌ 1-0-7-0; ఇమాద్‌ వసీమ్‌ 3-0-17-0; హారిస్‌ రవూఫ్‌ 3-0-21-3

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (బి) బుమ్రా 31; బాబర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 13; ఉస్మాన్‌ఖాన్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 13; ఫకార్‌ జమాన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 13; ఇమాద్‌ వసీమ్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 15; షాదాబ్‌ఖాన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 4; ఇఫ్తికార్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) బుమ్రా 5; షహీన్‌షా అఫ్రిది నాటౌట్‌ 0; నసీమ్‌ షా 10 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 113; వికెట్ల పతనం: 1-26, 2-57, 3-73, 4-80, 5-88, 6-102, 7-102; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-31-1; సిరాజ్‌ 4-0-19-0; బుమ్రా 4-0-14-3; హార్దిక్‌ పాండ్య 4-0-24-2; జడేజా 2-0-10-0; అక్షర్‌ పటేల్‌ 2-0-11-1

7

టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా సాధించిన విజయాలుTags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు