Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్

ముంబయి ఇండియన్స్‌ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్‌మెంట్‌ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న.

Published : 30 Nov 2023 02:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సోషల్‌ మీడియాలో జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah) పెట్టిన పోస్టు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ను (MI) అన్‌ఫాలో చేయడం కూడా నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. హార్దిక్‌ పాండ్య ముంబయికి తిరిగి రావడమే దానికి ప్రధాన కారణమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బుమ్రా కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బుమ్రా వ్యవహారంపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.

‘‘బుమ్రా వంటి బౌలర్‌ను తయారు చేయడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్‌ అయినా.. టెస్టులైనా సరే సహజసిద్ధమైన బౌలింగ్‌తో అదరగొట్టేస్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. వరల్డ్ కప్‌లో అతడి ప్రదర్శన చూశాం. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోని ఐదో మ్యాచ్‌కు కెప్టెన్సీ చేపట్టాడు. ఇప్పుడు హార్దిక్‌ వంటి ప్లేయర్‌ తిరిగి రావడం బుమ్రాను బాధించి ఉంటుందేమో.. పాండ్య బయటకు వెళ్లి వచ్చాక ముంబయి ఇండియన్స్‌ సంబరాలు చేసుకుంటుంది. కానీ, జట్టులో మున్ముందు ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితే గతేడాది సీఎస్‌కేలోనూ చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా విషయంలో వెంటనే అప్పటి కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ, మేనేజ్‌మెంట్ త్వరగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

ముంబయి జట్టులోనూ ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. త్వరగా బుమ్రా, హార్దిక్‌ పాండ్య, రోహిత్‌ను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలి. అందుకే, బుమ్రాతో త్వరగా మాట్లాడాలి. బుమ్రా అద్భుతమైన వ్యక్తి. ఒకవేళ అతడు ఇబ్బంది పడినట్లు అనిపిస్తే దానిని మేనేజ్‌మెంట్ సరిచేయాలి. లేకపోతే భారీ మార్పులే చోటు చేసుకొనే అవకాశం ఉంది’’ అని క్రిష్ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీలో ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అత్యుత్తమ సమాధానం’’ అనే కొటేషన్‌ పెట్టడం కూడా వెళ్లిపోయేందుకు చూస్తున్నాడనేదానికి బలాన్ని చేకూరుస్తోంది. ఒకవేళ బుమ్రా ముంబయి ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకుంటే అతడికి వేలంలో భారీ ధర దక్కడం ఖాయమనే వాదనా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని