ODI WC 2023: ఇదే అత్యుత్తమమని నేను చెప్పలేను.. కానీ: టీమ్‌ఇండియా బౌలింగ్‌పై గంగూలీ

టీమ్‌ఇండియా వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మన బౌలింగ్‌ అటాక్‌పై మాజీ కెప్టెన్‌ గంగూలీ స్పందించాడు. అలాగే అఫ్గాన్‌ ఓటమికి వారే కారణమని వ్యాఖ్యానించాడు.

Published : 11 Nov 2023 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఈ ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో టీమ్‌ఇండియా(Team India) వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిదింట్లో ఎనిమిది నెగ్గి అందరికంటే ముందే సెమీస్‌ చేరింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్‌ఇండియా.. ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడేందుకు మరో రెండడుగుల దూరంలోనే ఉంది. ఇక భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పేస్‌ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్‌లపై ప్రసంశలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్‌ గంగూలీ(Sourav Ganguly).. మన బౌలింగ్‌ అటాక్‌పై స్పందించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు ఇప్పటి వరకూ అత్యుత్తమ బౌలింగ్‌ అటాక్‌ ఇదేనని జరుగుతున్న చర్చపై గంగూలీ స్పందించాడు. అలాంటి అభిప్రాయం సరికాదన్నాడు. 2003 ప్రపంచకప్‌లోని బౌలింగ్‌ అటాక్‌ గురించి ప్రస్తావించాడు.

‘ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమ పేస్‌ అటాక్‌ అని నేను చెప్పలేను. 2003 ప్రపంచకప్‌లో నెహ్రా, జహీర్‌ ఖాన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ కూడా ఎంతో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇక బుమ్రా, షమీ, సిరాజ్‌ బౌలింగ్‌ చూడటం మరింత ఆసక్తిగా ఉంది. బుమ్రా ఉన్నప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అతడు మిగతా ఇద్దరిపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాడు’ అని గంగూలీ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ వివరించాడు. ఇక షమీని మొదటి నాలుగు మ్యాచ్‌లకు పక్కనపెట్టడంపై దాదా స్పందిస్తూ..‘తొలి మ్యాచ్ నుంచి షమీని ఆడించాల్సింది. అతడు తర్వాతి మ్యాచ్‌ల్లో ఎలా చెలరేగిపోయాడో చూశాం’ అని అన్నాడు. ఇక రోహిత్‌ సేన తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఈ నెల 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లోకి అడుగుపెట్టాలని టీమ్‌ఇండియా చూస్తోంది.

అజయ్‌ జడేజా ఏడ్చి ఉంటాడు

‘‘అఫ్గానిస్థాన్ బ్యాటింగ్‌ కోచ్‌ అజయ్‌ జడేజా ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌ అనంతరం బాధపడి ఉంటాడు. ఒంటిచేత్తో ఆసీస్‌ను మ్యాక్సీ గెలిపించాడు. గాయంతోనే బాధపడుతూ ఆడేశాడు. అఫ్గాన్‌ బౌలర్లు కూడా మ్యాక్సీకి అనుకూలంగా బౌలింగ్‌ చేసినట్లు ఉన్నారు. వారు వికెట్‌కు కాస్త దూరంగా బంతులను విసిరి ఉండాల్సింది. అప్పటికే కాలును కదిపేందుకు కూడా మ్యాక్స్‌వెల్ బాధపడుతూ ఉన్నాడు. ఆసీస్‌ 91/7 స్కోరుతో ఉన్నప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో అఫ్గాన్‌ విఫలం కావడం అజయ్‌ జడేజాకు ఏడుపు తెప్పించే ఉంటుంది. వికెట్ల ముందు నుంచుని భారీ షాట్లు కొట్టిన మ్యాక్సీని అడ్డుకోలేకపోయారు. తప్పకుండా వన్డేల్లో ఇదొక అద్భుత ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని