Rohit Sharma: ప్రపంచకప్‌ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్‌కు బాగా తెలుసు: ధావన్‌

అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ అభిప్రాయపడ్డాడు. 

Published : 20 May 2024 16:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీలో టీమ్‌ ఇండియా చతికలపడుతోందనే ముద్రను పోగొట్టుకోవడానికి టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) అద్భుతమైన అవకాశం. ఈసారి జట్టు విజేతగా నిలుస్తుందని వెటరన్‌ బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ విశ్వాసం వ్యక్తంచేశాడు. అతడు ఓ ఆంగ్లపత్రికతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ప్రపంచకప్‌లలో భారత్‌ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్‌ శర్మ (Rohit Sharma) అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. భారత్‌ ఈసారి విజయంతో తిరిగి వస్తుందని నమ్ముతున్నా. శివం దుబే, చాహల్‌, సంజూకు తగిన అవకాశాలు లభించాయి. వారిని జట్టులో చూసి చాలా సంతోషంగా అనిపించింది. టీమ్‌ ఇండియా చాలా సమతౌల్యంగా ఉంది’’ అని  పేర్కొన్నాడు.

విరాట్‌ మరోసారి ప్రపంచకప్‌లో విజృంభిస్తాడని శిఖర్‌ అంచనా వేశాడు. గత ప్రపంచకప్‌ల్లో కూడా అతడు రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘‘ఈసారి జట్టు విజయాల్లో రోహిత్‌తోపాటు.. విరాట్‌, జెస్సీ (బుమ్రా) కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఛేజ్‌ మాస్టర్‌గా పేరున్న విరాట్‌ మైదానంలో ఉంటేనే.. ప్రత్యర్థి జట్టు ధైర్యం కోల్పోతుంది. ఇక మూడు ఫార్మాట్లలో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌. భారత్‌ కప్పు గెలవాలంటే అతడు ముఖ్య భూమిక పోషించాలి’’ అని విశ్లేషించాడు.  

ఇక ఈసారి ఐపీఎల్‌లో పలువురు కుర్రాళ్లు మెరిశారని ధావన్‌ పేర్కొన్నాడు. ముఖ్యంగా అశుతోష్‌, శశాంక్‌లు అత్యంత ఒత్తిడిలో కూడా రాణించారని పేర్కొన్నాడు. వీరిలో తనకు భవిష్యత్తు తారలు కనిపిస్తున్నారని చెప్పాడు. వీరెప్పుడూ లక్ష్యాన్ని పూర్తి చేస్తామనే ఆశలను తమలో కల్పిస్తున్నారన్నాడు. 

మరోవైపు జూన్‌ 5వ తేదీన ప్రారంభం కానున్న ప్రపంచకప్‌నకు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ సన్నద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన ఉత్సాహంతో ఈ టోర్నీలో రాణిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 5వ తేదీన న్యూయార్క్‌లో భారత్‌ జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌ 2007లో మినహా భారత్‌కు మరెప్పుడూ దక్కలేదు. 2013 నుంచి మన జట్టు ఐసీసీ ట్రోఫీలను కూడా గెలవలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని