French Open: అల్కరాస్‌ అడుగు దూరంలో

టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం రసవత్తరంగా జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ అల్కరాస్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో రెండో సీడ్‌ సినర్‌ (ఇటలీ)పై విజయం సాధించాడు.

Published : 08 Jun 2024 03:16 IST

ఫైనల్లో స్పెయిన్‌ యువ సంచలనం
సెమీస్‌లో సినర్‌పై విజయం

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిళ్ల ఖాతా తెరిచేందుకు.. మూడో గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని సొంతం చేసుకునేందుకు స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌ అడుగు దూరంలో నిలిచాడు. రోలాండ్‌ గారోస్‌లో అతను తొలిసారి ఫైనల్‌ చేరాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సినర్‌ను ఓడించి ముందంజ వేశాడు. 

పారిస్‌: టైటిల్‌ ఫేవరెట్‌ అల్కరాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం రసవత్తరంగా జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మూడో సీడ్‌ అల్కరాస్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో రెండో సీడ్‌ సినర్‌ (ఇటలీ)పై విజయం సాధించాడు. 4 గంటలకు పైగా పోటాపోటీగా సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. విజయం కోసం ఇద్దరూ తీవ్రంగా శ్రమించారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరిచి జోరు మీదున్న 22 ఏళ్ల సినర్‌ తొలి సెట్‌లో దూకుడు ప్రదర్శించాడు. తొలి, మూడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేసి చూస్తుండగానే 4-0తో దూసుకెళ్లాడు. మధ్యలో 21 ఏళ్ల అల్కరాస్‌ రెండు గేమ్‌లు నెగ్గినా.. ఏడో గేమ్‌లో మరో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన సినర్‌ ఆ వెంటనే సెట్‌ ముగించాడు. రెండో సెట్లోనూ 2-0తో సినర్‌దే ఆధిపత్యం. దీంతో అల్కరాస్‌కు ఓటమి తప్పదేమోనన్న అంచనాలు కలిగాయి. కానీ అద్భుతంగా పుంజుకున్న అల్కరాస్‌ అత్యున్నత ఆటతీరుతో అలరించాడు. బ్యాక్‌ హ్యాండ్, ఫోర్‌ హ్యాండ్‌ షాట్లతో పాయింట్ల వేటలో సాగిపోయాడు. విన్నర్లతో చెలరేగి వరుసగా 5 గేమ్‌లు గెలిచాడు. బంతి ఏ మూలకు వెళ్లినా మట్టిపై జారుతూ గొప్పగా రిటర్న్‌ చేశాడు. ఇక మూడో సెట్లో పరిస్థితి మరోసారి సినర్‌కు అనుకూలంగా మారింది. అల్కరాస్‌ అనవసర తప్పిదాలతో వెనుకబడ్డాడు. నాలుగో సెట్లో పోరు మరోస్థాయికి చేరింది. ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ సాగడంతో 4-4తో స్కోరు సమమైంది. ఆ దశలో తన సర్వీస్‌ను కాపాడుకున్న అల్కరాస్‌.. తర్వాతి గేమ్‌లో బ్రేక్‌ సాధించి మ్యాచ్‌ను నిర్ణయాత్మక అయిదో సెట్‌కు మళ్లించాడు. ఇందులో అల్కరాస్‌ జోరును అడ్డుకోలేక సినర్‌ పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాస్‌ 8 ఏస్‌లు, 65 విన్నర్లు కొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని