french open: ఎర్రకోటలో కొత్త వీరుడు

నాదల్‌ వారసుడిగా పేరు పొందినా ఇప్పటిదాకా క్లేకోర్టులో గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టలేకపోయిన కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ముద్దాడాడు. కెరీర్‌లో మొదటి టైటిల్‌ గెలవాలని తపించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) కలను భగ్నం చేస్తూ అల్కరాస్‌ రొలాండ్‌ గారోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.

Updated : 10 Jun 2024 06:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ అల్కరాస్‌ సొంతం
ఫైనల్లో జ్వెరెవ్‌పై గెలుపు 

నాదల్‌ వారసుడిగా పేరు పొందినా ఇప్పటిదాకా క్లేకోర్టులో గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టలేకపోయిన కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ముద్దాడాడు. కెరీర్‌లో మొదటి టైటిల్‌ గెలవాలని తపించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) కలను భగ్నం చేస్తూ అల్కరాస్‌ రొలాండ్‌ గారోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. అయిదు సెట్ల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జ్వెరెవ్‌ను ఓడించి కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్లో కొత్త ఛాంపియన్‌! తన ఆరాధ్య ఆటగాడు నాదల్‌ బాటలో నడుస్తూ స్పెయిన్‌ వీరుడు అల్కరాస్‌ ఎర్రకోటలో జెండా ఎగరేశాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ మూడోసీడ్‌ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో నాలుగోసీడ్‌ జ్వెరెవ్‌ని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. 4 గంటలకు పైగా జరిగిన ఈ పోరులో 1-2తో వెనుకబడి కూడా అల్కరాస్‌ పుంజుకుని విజయాన్ని అందుకున్నాడు. తొలి సెట్లో అల్కరాస్‌దే పైచేయి. మెరుపు సర్వీసులు, క్రాస్‌కోర్టు విన్నర్లతో విజృంభించిన ఈ స్పెయిన్‌ స్టార్‌.. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. తర్వాత అయిదో గేమ్‌లో మరో బ్రేక్‌ సాధించి తేలిగ్గా తొలి సెట్‌ నెగ్గాడు. కానీ జ్వెరెవ్‌ వెంటనే పుంజుకున్నాడు. రెండో సెట్‌ అయిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన అతడు ఆపై సెట్‌ గెలిచి స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో అతడు నెట్‌ సమీపంలో కొట్టిన ఓ క్రాస్‌కోర్టు ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌ హైలైట్‌. ఇదే జోరును మూడో సెట్లోనూ చూపించిన జ్వెరెవ్‌ కష్టపడకుండానే సెట్‌ గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకున్నాడు. కానీ అల్కరాస్‌ నాలుగోసెట్లో పట్టుదలగా పోరాడాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అతడు.. అదే జోరుతో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. ఈ క్రమంలో అతడు ఒక్క గేమే చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక అయిదో సెట్‌లో అల్కరాస్‌ దూకుడు పెంచాడు. 4 గేముల్లో మూడు తానే సొంతం చేసుకుని 3-1తో ఆధిక్యంలో నిలిచాడు. జ్వెరెవ్‌ ప్రతిఘటించినా అల్కరాస్‌ అవకాశాన్ని వదల్లేదు. ఏడో గేమ్‌లో బ్రేక్‌ సాధించి 5-2తో నిలిచిన అతడు.. తర్వాత సర్వీస్‌ నిలబెట్టుకుని టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఓ ఫోర్‌హ్యాండ్‌ షాట్‌ని జ్వెరెవ్‌ నెట్‌కి కొట్టడంతో అల్కరాస్‌ సంబరాలు షురూ చేశాడు. టైటిల్‌ గెలిచే క్రమంలో ఈ స్పెయిన్‌ స్టార్‌ 3 ఏస్‌లతో పాటు 52 విన్నర్లు కొట్టాడు. 

పవిచ్‌ జోడీకి డబుల్స్‌ టైటిల్‌: పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మాట్‌ పవిచ్‌ (క్రొయేషియా)-మార్సెలో అర్వాలో (ఎల్‌ సాల్వడార్‌) జంట  7-5, 6-3తో సిమోన్‌ బొలెలీ-ఆండ్రియా వావసోరీ (ఇటలీ) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో కొకోగాఫ్‌-కేథరినా సినికోవా (చెక్‌) జంట 7-6 (7-5), 6-3తో పౌలీని-సారా ఎరానీ (ఇటలీ) జంటపై నెగ్గి టైటిల్‌ సాధించింది.

1
పిన్న వయసులో మూడు భిన్నమైన కోర్టులపై గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడు అల్కరాస్‌ (21 ఏళ్లు). జిమ్మి కానర్స్‌ (అమెరికా, 22 ఏళ్లు)ను అధిగమించాడు.

2
నాదల్‌ (19) తర్వాత రొలాండ్‌ గారోస్‌లో టైటిల్‌ గెలిచిన రెండో పిన్న వయస్కుడు అల్కరాస్‌(21)

3
కెరీర్‌లో అల్కరాస్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు. 2022లో యుఎస్‌ ఓపెన్‌ 2023లో వింబుల్డన్‌ నెగ్గాడు. 

4
గత పదేళ్లలో నాదల్, జకోవిచ్, వావ్రింకా కాకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ గెలిచింది అల్కరాసే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని