IPL Trophy: ‘మీ ఆటతో బెంగాల్‌ వ్యాప్తంగా సంబరాలు’.. కోల్‌కతా ప్లేయర్లపై ప్రశంసల జల్లు

IPL Trophy: అద్భుతమైన ప్రదర్శనలతో ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపొంది కేకేఆర్ ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కోల్‌కతా ఆటగాళ్లపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 27 May 2024 09:40 IST

చెన్నై: టోర్నీ ఆసాంతం నిలకడ ప్రదర్శనతో ఐపీఎల్ (IPL) ట్రోఫీని కోల్‌కతా కైవసం చేసుకుంది. సంచలనాలు నమోదు చేసిన హైదరాబాద్‌ (SRH) మాత్రం ఆఖరి పోరులో చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యంతో కప్పును కోల్‌కతాకు (kolkata knight riders) కట్టబెట్టింది. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న నైట్‌రైడర్స్‌ ఆటతీరుపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడా, రాజకీయ, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు బెంగాల్‌ వ్యాప్తంగా సంబరాలు తీసుకొచ్చింది. ఐపీఎల్‌లో రికార్డు బ్రేకింగ్‌ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో పాటు ఇతర స్టాఫ్‌, ఫ్రాంచైజీకి నా శుభాకాంక్షలు. రాబోయే ఏళ్లలో మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’

- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

‘‘2024 టాటా ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అభినందనలు. టోర్నమెంట్ ఆసాంతం జట్టు గొప్ప నిలకడను కనబర్చింది. టీమ్‌ను అద్భుతంగా నడిపించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)కు శుభాకాంక్షలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీజన్‌ను విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు’’

- జైషా, బీసీసీఐ కార్యదర్శి

‘‘టోర్నీ మొత్తం నిలకడ ప్రదర్శన కనబర్చిన కేకేఆర్‌ ఆటతీరు అద్భుతం. తొలుత బ్యాటర్లు తమ ప్రతాపం చూపారు. టోర్నీ చివర్లో బౌలర్లు అందరి దృష్టినీ ఆకర్షించారు. వెనువెంటనే వికెట్లు తీస్తూ బౌలర్లంతా దూకుడు కనబర్చారు. తద్వారా ఛేదనను సులభం చేశారు. మూడోసారి ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లు, స్టాఫ్‌ అందరికీ శుభాకాంక్షలు. గత రెండు నెలలుగా ఐపీఎల్‌లో వెలుగులు నింపుతూ.. ఫైనల్లో మాత్రం తడబడిన సన్‌రైజర్స్‌కూ నా అభినందనలు’’

- సచిన్‌ తెందూల్కర్‌

‘‘మూడో ఐపీఎల్‌ టైటిల్ సాధించిన కేకే రైడర్స్‌కు అభినందనలు. షారుక్‌ ఖాన్‌ చెప్పినట్లు.. మనమేదైనా మనఃస్ఫూర్తిగా కోరుకుంటే.. దాన్ని నెరవేర్చేందుకు ఈ యావత్‌ ప్రపంచం మనతో కలిసి నడుస్తుందని నిరూపించారు. ఫీల్డ్‌లో జట్టును అద్భుతంగా నడిపించినందుకు, సరైన ప్రణాళికలు అమలు చేసినందుకు శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) ప్రత్యేక అభినందనలు. గతంలో నెహ్రా, ఇప్పుడు గౌతమ్ గంభీర్‌ మెంటార్‌లుగా విజయం సాధించారు. వారి టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపారు’’

- వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘కేకేఆర్‌ ఆటగాళ్లు ఫైనల్‌లో సంచలన ప్రదర్శన కనబర్చారు. కోల్‌కతా నగరం మొత్తానికి ఇవి సంతోషకరమైన క్షణాలు’’ అంటూ సియట్‌ టైర్స్‌ చేసిన పోస్ట్‌ను ఆ కంపెనీ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా రీపోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని